త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | ఈ 7 వ‌రి ర‌కాల‌కే బోన‌స్.. తేల్చిచెప్పిన మంత్రి తుమ్మ‌ల‌

Tummala Nageshwar Rao | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ ఏడు వరి రకాలకే బోనస్ వర్తిస్తుందని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. విత్త‌న కంపెనీల ప్ర‌తినిధులు, ఎరువుల డీల‌ర్లు, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు, అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లతో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై ఖ‌రీఫ్ సీజ‌న్ ఏర్పాట్ల‌పై స‌మ‌గ్రంగా స‌మీక్షించారు.

S

Telangana | Published On Jun 17, 2026, 4.29 pm IST

Tummala Nageshwar Rao | ఈ 7 వ‌రి ర‌కాల‌కే బోన‌స్.. తేల్చిచెప్పిన మంత్రి తుమ్మ‌ల‌
Advertisement

Tummala Nageshwar Rao | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ ఏడు వరి రకాలకే బోనస్ వర్తిస్తుందని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. విత్త‌న కంపెనీల ప్ర‌తినిధులు, ఎరువుల డీల‌ర్లు, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు, అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లతో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై ఖ‌రీఫ్ సీజ‌న్ ఏర్పాట్ల‌పై స‌మ‌గ్రంగా స‌మీక్షించారు.

ఏడు వ‌రి ర‌కాల విత్త‌నాల‌కే ప్రాధాన్యం..

విత్తన కంపెనీలతో జరిగిన సమావేశంలో మార్కెట్ డిమాండ్, మిల్లర్ల సూచనలు, ఎగుమతి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఏడు వరి రకాల విత్తనాల లభ్యతపై మంత్రి తుమ్మల సమీక్షించారు. బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సొన), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-7715 రకాల విత్తనాలను రైతులకు విస్తృతంగా అందుబాటులో ఉంచాలని సూచించారు.

60 శాతానికి చేరుకున్న స‌న్న ర‌కాల సాగు

ఈ రకాల వరికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో పాటు ఎగుమతులకు కూడా అవకాశాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి కూడా వీటి సాగును ప్రోత్సహించాలని సూచించినట్లు మంత్రి తెలిపారు. గతంలో రాష్ట్రంలో దొడ్డు రకాల సాగు 60 శాతం, సన్న రకాల సాగు 40 శాతం ఉండేదని, ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించిన తర్వాత పరిస్థితి మారి ప్రస్తుతం సన్న రకాల సాగు 60 శాతానికి చేరుకుందని వివరించారు.

విత్త‌నాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు..

ప్రభుత్వం సూచించిన విత్తనాలను రైతులకు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కంపెనీలకు ఆదేశించారు. రైతులకు విత్తనాల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని స్పష్టం చేశారు. ఈ రకాలను ఏ రైతు ఎంత విత్తనం కొనుగోలు చేశాడనే వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశించారు.

రైతుల బ్యాంకు ఖాతాల్లోనే స‌బ్సిడీ

విత్తన సబ్సిడీపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని, వ్యవసాయ యాంత్రీకరణ పథకం తరహాలో సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విత్తనాల పంపిణీ కోసం అవసరమైతే రైతు వేదికలను ప్రత్యేక కేంద్రాలుగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని చెప్పారు.

విక్ర‌యాల‌ను రోజువారిగా అప్డేట్ చేయాలి

ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ ఏడు వరి రకాలకే బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేసిన మంత్రి, కంపెనీల వారీగా అందుబాటులో ఉన్న విత్తనాల నిల్వలను రైతులకు తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు. అదేవిధంగా ఆయా రకాల అమ్మకం, విక్రయాలను రోజువారిగా అప్ డేట్ చేయాల్సిందిగా డీలర్లను మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ఆదేశించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement