త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalyan Banerjee Ultimatum | “అభిషేక్ ఉంటే నేనుండను!” – మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడి అల్టిమేటం, టీఎంసీలో ముదిరిన సంక్షోభం

బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు! మమతా బెనర్జీకి టీఎంసీ సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం. పార్టీలో అసలేం జరుగుతోంది?

J

National | Published On Jun 11, 2026, 3.21 pm IST

Kalyan Banerjee Ultimatum | “అభిషేక్ ఉంటే నేనుండను!” – మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడి అల్టిమేటం, టీఎంసీలో ముదిరిన సంక్షోభం
Advertisement
  • తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన కళ్యాణ్ బెనర్జీ డెడ్‌లైన్
  • మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వ్యవహారశైలి, ఒంటెద్దు పోకడల వల్లే పార్టీ నాశనం అవుతోందని సీనియర్ల విమర్శలు
  • ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని వీడుతున్న 20 మంది ఎంపీలు
  • మమత తీరుపై, పార్టీలో అవినీతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీ వైపు చూస్తున్న కీలక నేతలు

Kalyan Banerjee Ultimatum | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఇప్పుడు అస్తిత్వ ప్రమాదంలో పడింది. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, సీనియర్ నాయకుడు అయిన కళ్యాణ్ బెనర్జీ.. ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీలో "అతను ఉంటే నేను ఉండను" అంటూ మమతకు డైరెక్ట్ అల్టిమేటం జారీ చేశారు.

గత 15 ఏళ్లుగా బెంగాల్‌లో టీఎంసీకి ఎదురేలేదు. వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికలు, నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి తిరుగులేని లీడర్ అనిపించుకున్నారు మమతా బెనర్జీ. కానీ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటమి తర్వాత పార్టీలో అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి.

అభిషేక్ వ్యవహార శైలిపై ఫైర్

తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కళ్యాణ్ బెనర్జీ తన ఆవేదన వ్యక్తం చేశారు. "ఇది నాకు జరిగిన ఘోర అవమానం. అభిషేక్ బెనర్జీకి పొగరు ఎక్కువ. అతని ప్రవర్తన వల్లే పార్టీ మొత్తం నాశనమైంది. ఈ విషయాన్ని అతడు గ్రహించాలి," అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

"ప్రతిరోజూ తానొక 'కింగ్' అని ఫీల్ అవుతుంటాడు. నేను మమతా బెనర్జీకి, పార్టీకి అండగా నిలబడిన కష్టకాలంలో కూడా అతను అలాగే ప్రవర్తించాడు. అభిషేక్ తీరు వల్ల పార్టీలో పనిచేయడం అసాధ్యంగా మారింది" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ముందు మమతా దీదీ ఒక నిర్ణయం తీసుకోవాలి. అభిషేక్ లేకుండా పార్టీని ముందుకు నడపలేనని ఆమె అనుకుంటే, ఇక నేను పార్టీలో ఉండను" అని తేల్చి చెప్పారు.

వివాదానికి కారణం ఏంటి?

ఒక ఫోర్జరీ కేసుకు సంబంధించి క్రిమినల్ డిపార్ట్‌మెంట్ విచారణ ఎదుర్కొంటున్న అభిషేక్ బెనర్జీ, ఈ కేసులో తన లాయర్‌గా ఉన్న కళ్యాణ్ బెనర్జీని ఉన్నట్లుండి తప్పించారు. ఈ పరిణామమే కళ్యాణ్ కోపానికి తాజా కారణం. గురువారం కలకత్తా హైకోర్టు అభిషేక్ కు అరెస్ట్ నుంచి మూడు వారాల పాటు తాత్కాలిక ఊరట (Interim protection) ఇచ్చింది. కానీ గురువారం సాయంత్రం 6 గంటలకల్లా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సోవన్‌దేబ్ చటోపాధ్యాయను గుర్తిస్తూ ప్రతిపాదించిన పత్రంలో కొందరు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్నది ప్రధాన ఆరోపణ.

ఈ పరిణామాలు ఎందుకు కీలకం?

ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో టీఎంసీ దారుణ ఓటమిని చవిచూసింది. గత మూడు ఎన్నికల్లో 200కి పైగా సీట్లు (మొత్తం 294 స్థానాల్లో) గెలుచుకున్న పార్టీ.. ఈసారి కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఈ ఓటమితో పార్టీలో అసమ్మతి భగ్గుమంది. మాజీ సీఎం మమతా బెనర్జీ సీనియర్లను పట్టించుకోవడం లేదని, పార్టీలో, పరిపాలనలో అవినీతి పెరిగిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే కకోలి ఘోష్ దస్తిదార్, శతాబ్ది రాయ్ వంటి మమత అత్యంత సన్నిహితులతో సహా ఏకంగా 20 మంది టీఎంసీ ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ (BJP) నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరంతా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ I-PAC లాంటి క్యాంపెయిన్ మేనేజర్లను వాడుకోవడం, అధికారం అంతా అభిషేక్, అతని కోటరీ చేతిలోనే కేంద్రీకృతం కావడంపై సీనియర్లు రగిలిపోతున్నారు.

2009 నుంచి మమతా బెనర్జీతో కలిసి నడుస్తున్న నాలుగు సార్ల ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. "నేను పార్టీని వీడుతున్నాను ఎందుకంటే మా వాయిస్ ఎవరూ వినడం లేదు. ప్రజల కోసం పనిచేయాలని ఉంది కానీ పార్టీలో ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. మమతా బెనర్జీ దగ్గరకు కేవలం కొద్దిమందికి మాత్రమే యాక్సెస్ ఉంది. టీఎంసీలో విపరీతమైన అవినీతి ఉంది.. అది చూసి నేను తీవ్ర నిరాశకు గురయ్యాను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement