త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DMK Election Manifesto | డీఎంకే మేనిఫెస్టో రిలీజ్: మహిళలకు నెలకు రూ.2,000, ఫ్రీ లాప్‌టాప్‌లు.. స్టాలిన్ వరాల జల్లు..!

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార డీఎంకే పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సీఎం ఎం.కె. స్టాలిన్ మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, విద్యార్థులకు ఉచిత లాప్‌టాప్‌లు, పెన్షన్ల పెంపుతో పాటు ఉచిత విద్యుత్ వంటి పలు ఆకర్షణీయమైన హామీలను ప్రకటించారు.

J

National | Published On Mar 29, 2026, 9.00 pm IST

DMK Election Manifesto | డీఎంకే మేనిఫెస్టో రిలీజ్: మహిళలకు నెలకు రూ.2,000, ఫ్రీ లాప్‌టాప్‌లు.. స్టాలిన్ వరాల జల్లు..!
Advertisement

DMK Election Manifesto | తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ ఆదివారం తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. చెన్నైలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజా సంక్షేమం, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి సమతుల్యతనిస్తూ పలు కీలక హామీలను ఆయన ప్రకటించారు. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, మళ్లీ అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను మరింత విస్తరిస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు.

మహిళలు, చిన్నారుల సంక్షేమానికి పెద్దపీట

నెలకు రూ.2,000: కుటుంబ పెద్దలైన మహిళలకు ప్రస్తుతం ఇస్తున్న నెలవారీ ఆర్థిక సాయాన్ని రూ.1,000 నుంచి రూ.2,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.37 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.

వృద్ధాప్య పెన్షన్ పెంపు: వృద్ధులకు అందించే పెన్షన్‌ను కూడా రూ.2,000కు పెంచుతామని ప్రకటించారు.

ఉచిత అల్పాహార పథకం విస్తరణ: ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఉన్న ప్రభుత్వ 'ఉచిత అల్పాహార పథకాన్ని' 8వ తరగతి వరకు పొడిగిస్తామని తెలిపారు.

వడ్డీ లేని రుణాలు: మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.

ఆరోగ్యం, సొంత ఇల్లు

రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్: ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకాన్ని మరింత విస్తరించి, బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచుతారు. అలాగే, ఈ పథకానికి అర్హత పొందే వార్షిక ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని పేర్కొన్నారు.

10 లక్షల ఇళ్లు: రాబోయే ఐదేళ్లలో పేదల కోసం 10 లక్షల కొత్త ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేస్తామని వెల్లడించారు.

విద్యార్థులకు లాప్‌టాప్‌లు, రైతులకు ఉచిత విద్యుత్

ఉచిత లాప్‌టాప్‌లు: ఉన్నత విద్యనభ్యసిస్తున్న 35 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా లాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్నారు.

రైతులకు లబ్ధి: 20 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ మద్దతును కొనసాగిస్తామని, అలాగే మీటర్లు లేని పంప్‌సెట్‌లను అందిస్తామని హామీ ఇచ్చారు.

ఉపాధి అవకాశాలు, పెట్టుబడులపై ఫోకస్

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 120 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా, రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని స్టాలిన్ తెలిపారు.

ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు కొత్తగా 'నియో టైడెల్ పార్కుల'ను (Neo Tidel Parks) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

విపక్షాలపై స్టాలిన్ ఫైర్

డీఎంకే ప్రభుత్వం కేవలం ఎన్నికల హామీలనే కాకుండా, చెప్పని ఎన్నో మంచి పనులను కూడా అమలు చేసిందని సీఎం స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మేనిఫెస్టో కమిటీకి నేతృత్వం వహించిన కనిమొళి కరుణానిధితో పాటు ఇతర సీనియర్ నేతలకు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. సుపరిపాలన, అభివృద్ధి కొనసాగాలంటే తమిళనాడు ప్రజలు మళ్లీ డీఎంకేకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement