త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Railways | రైలు ఆల‌స్యంతో ప‌రీక్ష మిస్‌.. విద్యార్థినికి రైల్వేశాఖ నుంచి రూ.9 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం..

Indian Railways | భార‌తీయ రైల్వేలో చాలా వ‌ర‌కు రైళ్లు నిర్దిష్ట‌మైన స‌మ‌యానికి గ‌మ్య‌స్థానానికి చేరుకోవనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. చాలా వ‌ర‌కు రైళ్లు కొన్ని నిమిషాల ఆల‌స్యం నుంచి కొన్ని గంట‌ల వ‌ర‌కు ఆల‌స్యంగా న‌డుస్తుంటాయి. దీని వ‌ల్ల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు.

S

National | Published On Jan 27, 2026, 11.45 am IST

Indian Railways | రైలు ఆల‌స్యంతో ప‌రీక్ష మిస్‌.. విద్యార్థినికి రైల్వేశాఖ నుంచి రూ.9 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం..
Advertisement

Indian Railways | భార‌తీయ రైల్వేలో చాలా వ‌ర‌కు రైళ్లు నిర్దిష్ట‌మైన స‌మ‌యానికి గ‌మ్య‌స్థానానికి చేరుకోవనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. చాలా వ‌ర‌కు రైళ్లు కొన్ని నిమిషాల ఆల‌స్యం నుంచి కొన్ని గంట‌ల వ‌ర‌కు ఆల‌స్యంగా న‌డుస్తుంటాయి. దీని వ‌ల్ల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే అక్క‌డ మాత్రం త‌న‌కు జ‌రిగిన ఆల‌స్యానికి ఆ విద్యార్థిని న్యాయ పోరాటం చేసింది. రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల తన భవిష్యత్తు దెబ్బతిందంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా, ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఏడు సంవత్సరాల పాటు సాగిన న్యాయపోరాటం అనంతరం, వినియోగదారుల కమిషన్ రైల్వే శాఖను బాధ్య‌త వ‌హించాల‌ని ఆదేశిస్తూ రూ. 9.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

రైలు ఆల‌స్యంగా రావ‌డంతో..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బ‌స్తీ జిల్లాకు చెందిన స‌మృద్ధి అనే విద్యార్థిని 2018లో బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్షకు సిద్ధ‌మైంది. ఆ ప‌రీక్ష‌కు గాను ఆమె ఏడాది పాటు కష్టపడి చదువుకుంది. ఈ క్ర‌మంలో ఆమెకు పరీక్ష కేంద్రంగా లక్నోలోని జై నారాయణ్ పీజీ కాలేజీని కేటాయించారు. ప‌రీక్ష రోజు బస్తీ నుంచి లక్నోకు ఉదయం 11 గంటలకు చేరాల్సిన ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ రైలులో ఆమె టికెట్ బుక్ చేసుకుంది. అయితే ఆ రైలు దాదాపు రెండున్నర గంటల ఆలస్యంగా చేరింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం 12.30 గంటలలోపు పరీక్ష కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉండగా, సమృద్ధి లక్నోకు చేరేసరికి ఆ గడువు ముగిసిపోయింది. ఉద‌యం 11 గంట‌ల‌కు టైముకు రైలు వ‌చ్చి ఉంటే ఆమెకు ప‌రీక్షా కేంద్రానికి చేరుకునేందుకు కావ‌ల్సినంత స‌మ‌యం ల‌భించి ఉండేది. కానీ రైలు ఆలస్యంగా వ‌చ్చింది. దీంతో ఆమె పరీక్షకు హాజరయ్యే అవకాశం కోల్పోయింది. ఫలితంగా ఆమె ఒక పూర్తి విద్యా సంవత్సరాన్ని నష్టపోయింది.

స‌రైన వివ‌ర‌ణ ఇవ్వ‌లేక‌పోయిన రైల్వే..

కాగా ఈ ఘటనపై తీవ్రంగా మనస్తాపానికి గురైన సమృద్ధి, తన న్యాయవాది ప్రభాకర్ మిశ్రా ద్వారా రూ. 20 లక్షల పరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో రైల్వే మంత్రిత్వ శాఖ, జనరల్ మేనేజర్, స్టేషన్ సూపరింటెండెంట్‌లకు నోటీసులు జారీ అయినప్పటికీ, రైల్వే అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. విచారణ అనంతరం కమిషన్, రైల్వే శాఖ సమయానికి సేవలు అందించడంలో విఫలమైందని తేల్చింది. రైలు ఆలస్యం అయిన విషయాన్ని రైల్వే అధికారులు అంగీకరించినప్పటికీ, దానికి సరైన కారణాన్ని వివరించలేకపోయారని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సమృద్ధికి రూ. 9.10 లక్షల పరిహారం చెల్లించాలని, 45 రోజుల్లోపు చెల్లించకపోతే అదనంగా 12 శాతం వడ్డీ వర్తింపజేస్తామని ఆదేశించింది.

ప్ర‌యాణికులు దీన్ని అనుస‌రిస్తారా..?

సమృద్ధి తరఫు న్యాయవాది ప్రభాకర్ మిశ్రా మాట్లాడుతూ, మే 7, 2018న జరిగిన ఈ ఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక రైలు ఆలస్యం కారణంగా ఆమె భవిష్యత్తు ఏడాది వెనక్కి వెళ్లిపోయింది. రైల్వే శాఖ తప్పును అంగీకరించినప్పటికీ సమర్థించుకోలేకపోయింది. అందుకే కోర్టు భారీ పరిహారం విధించింది.. అని తెలిపారు. ఈ తీర్పు వెలువడిన తర్వాత, దేశవ్యాప్తంగా ప్రయాణికుల హక్కులు, రైళ్ల ఆలస్యంపై రైల్వే శాఖ బాధ్యత వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రతిరోజూ లక్షలాది మంది రైలు ప్రయాణికులు ఆలస్యాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో, ఈ కేసు ఒక కీలక ఉదాహరణగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సంఘ‌ట‌న‌ను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుని రైల్వే శాఖ‌పై ఇక ముందు కూడా ఎవ‌రైనా ప్ర‌యాణికులు అదే విధంగా కేసు విస్తారా, లేదా.. అన్న‌ది రానున్న రోజుల్లో తేల‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement