త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | ప్ర‌ధాని మోదీ, అమిత్ షా, సీఎంలు అక్ర‌మంగా ఎన్నిక‌య్యారు.. లోక్‌స‌భ‌, అసెంబ్లీల‌ను ర‌ద్దు చేయాలి

Mallikarjun Kharge | దేశంలో జ‌రిగిన అన్ని ఎన్నిక‌లు పూర్తిగా అక్ర‌మ‌మ‌ని (all elections illegal) కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సహా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులంతా అక్ర‌మంగా ఎన్నికైన వారేన‌ని చెప్పారు. లోక్‌స‌భ‌, అసెంబ్లీల‌ను ర‌ద్దు చేసి బ్యాలెట్ పేప‌ర్ల ద్వారా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. SIR ప్రక్రియలో భారీగా అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల సంఘం తీరుకు వ్య‌తిరేకంగా అక్టోబ‌ర్ 6న ఢిల్లీలో భారీ నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

D

National | Published On Oct 3, 2026, 5.34 pm IST

Mallikarjun Kharge | ప్ర‌ధాని మోదీ, అమిత్ షా, సీఎంలు అక్ర‌మంగా ఎన్నిక‌య్యారు.. లోక్‌స‌భ‌, అసెంబ్లీల‌ను ర‌ద్దు చేయాలి
Advertisement
  • బ్యాలెట్ పేప‌ర్ల ద్వారానే ఎన్నిక‌లు నిర్వ‌హించాలి
  • SIR ప్రక్రియలో భారీగా అక్ర‌మాలు
  • గ‌త ప్ర‌ధానులెవ‌రూ ఇలా చేయ‌లేదు..
  • అక్టోబ‌ర్ 6న ఢిల్లీలో భారీ నిర‌స‌న కార్య‌క్ర‌మం
  • కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖ‌ర్గే

Mallikarjun Kharge | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో జ‌రిగిన అన్ని ఎన్నిక‌లు పూర్తిగా అక్ర‌మ‌మ‌ని (all elections illegal) ఆరోపించారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సహా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులంతా అక్ర‌మంగా ఎన్నికైన వారేన‌ని చెప్పారు. లోక్‌స‌భ‌తోపాటూ అన్ని రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేసి (dissolution of Lok Sabha And State Assemblies) బ్యాలెట్ పేప‌ర్ల ద్వారా మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు.

క‌ర్ణాట‌క క‌ల‌బుర‌గిలో ఖ‌ర్గే మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా అధికార అహంకారం తారాస్థాయికి చేరిందంటూ కేంద్రంలోని మోదీ స‌ర్కార్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈవీఎమ్‌ల‌ను అడ్డ‌గోలుగా దుర్వినియోగం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. దేశవ్యాప్తంగా ఈసీ చేప‌ట్టిన ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (SIR) ప్రక్రియలో భారీగా అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. ఇది దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని దెబ్బ‌తీస్తోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌లే ఇండీ కూట‌మి స‌మావేశంలో చ‌ర్చించిన అంశాల‌ను ఖ‌ర్గే ప్ర‌స్తావించారు. స‌ర్ ప్ర‌క్రియ పేద‌లు, నిర‌క్ష‌రాస్యులు, కార్మికులు, మైనారిటీల జీవితాల‌పై తీవ్ర దుష్ప్ర‌భావం చూపుతోంద‌ని స‌భ్యులంతా ఏక‌గ్రీవంగా అంగీక‌రించిన‌ట్లు చెప్పారు. ఒక్కో బూత్‌లో సుమారు 500 ఓట్లు తొల‌గిస్తే అది ఎలాంటి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నిక అవుతుంది..? అంటూ ప్ర‌శ్నించారు.

గ‌త ప్ర‌ధానులెవ‌రూ ఇలా చేయ‌లేదు..

ఈ సంద‌ర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ కోసం ప్ర‌భుత్వం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను ఉప‌యోగించుకుంటోంద‌ని ఆరోపించారు. వారు గ్రామాలు, వార్డులు, పంచాయతీల్లోకి వెళ్లి ఓట్ల‌ను తొల‌గించేందుకు ద‌ర‌ఖాస్తులు నింపుతున్నార‌ని మండిప‌డ్డారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహారావు, రాజీవ్ గాంధీ వంటి గత ప్రధానులెవరూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు పాల్పడలేదని గుర్తుచేశారు. ఈ దుర్వినియోగం వల్ల యువత‌, పేదలు, దళితులు, అణగారిన వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

అదేవిధంగా ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (CEC), ఇతర ఎన్నికల కమిషనర్లకు ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు తీసుకున్న నిర్ణ‌యాల‌పై విచార‌ణ నుంచి మిన‌హాయింపు క‌ల్పిస్తూ కేంద్రం తెచ్చిన కొత్త చ‌ట్టంపై ఖ‌ర్గే మండిప‌డ్డారు. కమిటీ నియామకంలో గతంలో సీజేఐ (CJI) సభ్యుడిగా ఉండేవారని గుర్తు చేశారు. 2023లో తెచ్చిన కొత్త చట్టం ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తిని తొలగించి.. ఆ స్థానంలో ఓ కేబినెట్ మంత్రిని చేర్చారని మండిప‌డ్డారు. కమిషనర్లు ఎలాంటి తప్పు చేసినా వాటిపై విచారణ జరగకుండా చట్టం తెచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.

ఈ సంద‌ర్భంగా ది ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌చురించిన నివేదిక‌ను ప్ర‌స్తావించారు. ముగ్గురు స‌భ్యులున్న ఎన్నిక‌ల క‌మిష‌న్‌లోని ఇద్ద‌రు స‌భ్యులు సీఈసీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ఆయ‌న‌కు 14 సార్లు లేఖ‌లు రాసిన‌ప్ప‌టికీ వాటివ‌ల్ల ఎలాంటి ఫ‌లితం లేద‌ని చెప్పారు. ఆ ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు ఎన్నిక‌ల సంఘంలో అక్ర‌మాలు, ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌పై బ‌హిరంగంగా మాట్లాడ‌లేక‌పోయినా త‌మ అభిప్రాయాల‌ను స్ప‌ష్టంగా వ్య‌క్తం చేశార‌న్నారు. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే ఎన్నిక‌ల‌ను ఏక‌ప‌క్షంగా నిర్వ‌హించే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు.

ఢిల్లీలో భారీ ఆందోళనకు పిలుపు

ఎన్నిక‌ల సంఘం తీరుకు వ్య‌తిరేకంగా అక్టోబ‌ర్ 6న ఢిల్లీలో భారీ నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్న‌ట్లు ఖ‌ర్గే ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ప్ర‌తిప‌క్ష ఎంపీలంతా క‌లిసి ఈసీ కార్యాల‌యం వ‌ర‌కూ మార్చ్ నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. దేశ ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రతి మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇలాంటి నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలనే తమ డిమాండ్‌పై ప్రజలు ఉద్యమించాలని ఈ సంద‌ర్భంగా ఖ‌ర్గే పిలుపునిచ్చారు.

Also Read..

ఎఫ్‌ఐఆర్ నుంచి సుప్రీంకోర్టు తీర్పు దాకా.. మూడేళ్లలోనే కేసు క్లోజ్: అమిత్ షా సంచలన ప్రకటన

రష్యా సైన్యం నుంచి 140 మంది భార‌తీయుల‌కు విముక్తి.. ఆ 55 మంది ఆచూకీ కోసం ప్ర‌య‌త్నాలు

ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?

Advertisement
Advertisement