త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | చొరబాటుదారులను ఏరివేయడమే మా లక్ష్యం.. వారిని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం

ఓటర్ల జాబితా నుంచి అక్రమ వలసదారులను తొలగించేందుకు ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపడితే కొంతమంది దేశద్రోహులు అడ్డుకుంటున్నారు

J

National | Published On Dec 20, 2025, 9.30 pm IST

PM Modi | చొరబాటుదారులను ఏరివేయడమే మా లక్ష్యం.. వారిని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం
Advertisement

Modi |స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణను కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈసీ చేపట్టింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇప్పటికే చనిపోయిన వారు, సరైన అడ్రస్ లేని వారు, అక్రమంగా మన దేశంలోకి చొరబడి ఇక్కడే నకిలీ పత్రాలు పొంది ఓటు హక్కు పొందినవారు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్ల ఓట్లను తొలగించే ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఓట్ల తొలగింపును చేపడుతోందని, ప్రాంతీయ పార్టీలకు మద్దతు పలుకుతున్న ఓట్లను తీసేందుకు జరుగుతున్న కుట్ర అంటూ పలు రాష్ట్రాల నేతలు ఆరోపిస్తున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. అయినా కూడా ఈసీ తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో 58 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా కొన్ని లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. ప్రతిపక్షాలు దీనిపై గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా నోరు విప్పారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా చొరబాటుదారులను ఎన్నికల ప్రక్రియను నుంచి ఏరివేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

దీన్ని అడ్డుకుంటోంది దేశద్రోహులే

ఓటర్ల జాబితా నుంచి అక్రమ వలసదారులను తొలగించేందుకు ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపడితే కొంతమంది దేశద్రోహులు అడ్డుకుంటున్నారని, వారిని కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ అన్నారు. శనివారం అస్సాంలోని గౌహతిలో పర్యటించిన ఆయన.. గౌహతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.

కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం

కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి అస్సాం కనిపించలేదు. ఈశాన్య రాష్ట్రాలు కూడా కనిపించలేదు. ఆ రాష్ట్రాల అభివృద్ధిని పక్కన పెట్టేసిందని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ చేసిన పాపాలకు ఈశాన్య రాష్ట్రాలు భారీ మూల్యం చెల్లించుకున్నాయి. చొరబాటుదారులు వచ్చి ఇక్కడ మన భూములను ఆక్రమించుకుంటున్నారు. మన అడవులను దోచుకుంటున్నారు. దాని వల్ల ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలే ప్రమాదంలో పడ్డాయి. అస్సాం అస్తిత్వానికే ముప్పు వచ్చింది. కాంగ్రెస్ అప్పుడు చేసిన తప్పిదాలను బీజేపీ ప్రభుత్వం సరిదిద్దుతోంది. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం.. అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు ముందే.. గౌహతిలో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో నూతనంగా నిర్మించిన టెర్మినల్ 2 ని ప్రారంభించారు. దీని నిర్మాణానికి 4 వేల కోట్లు కాగా, ఒక సంవత్సరానికి కనీసం కోటి మంది ఈ టెర్మినల్ గుండా ప్రయాణం చేసేలా తీర్చిదిద్దారు. నేచర్ థీమ్ అనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ విమానాశ్రయ టెర్మినల్‌ని నిర్మించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement