త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Vijay | న‌టుడి పార్టీ అన్నారు.. రాజ‌కీయాలు ఇంత క్రూర‌మా..? : అసెంబ్లీలో విజ‌య్ కీల‌క ప్ర‌సంగం

CM Vijay | త‌మిళ‌నాడు అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి హోదాలో విజ‌య్ (CM Vijay) తొలిసారి ప్ర‌సంగించారు. ఏప్రిల్‌-మే నెల‌ల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఎన్నో కుట్ర‌లు, స‌వాళ్ల‌ను అధిగ‌మించి ఘ‌న విజ‌యం సాధించింద‌ని చెప్పారు. టీవీకేని న‌టుడి పార్టీ అని ఎగ‌తాళి చేశార‌ని అన్నారు.

D

National | Published On Jun 23, 2026, 12.54 pm IST

CM Vijay | న‌టుడి పార్టీ అన్నారు.. రాజ‌కీయాలు ఇంత క్రూర‌మా..? : అసెంబ్లీలో విజ‌య్ కీల‌క ప్ర‌సంగం
Advertisement

CM Vijay | త‌మిళ‌నాడు అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. స‌మావేశాల్లో భాగంగా ఇవాళ ముఖ్య‌మంత్రి హోదాలో విజ‌య్ (CM Vijay) తొలిసారి కీల‌క ప్ర‌సంగం చేశారు. ఎన్నిక‌ల్లో టీవీకే విజ‌యంతోపాటూ విప‌క్షాల విమ‌ర్శ‌లు, నీట్‌, హిందీ వంటి అంశాల‌పై సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. ఏప్రిల్‌-మే నెల‌ల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఎన్నో కుట్ర‌లు, స‌వాళ్ల‌ను అధిగ‌మించి ఘ‌న విజ‌యం సాధించింద‌ని చెప్పారు. టీవీకేని న‌టుడి పార్టీ అని ఎగ‌తాళి చేశార‌ని అన్నారు.

అధికారం అంత సుల‌భంగా రాలేదు..

"మాకు అధికారం అంత సులభంగా రాలేదు. తమిళ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మేము ఎంతగా పోరాడామో మాకు మాత్రమే తెలుసు. కొందరు ఏమీ తెలియనట్లు నటిస్తూ 'అతను కేవలం ఒక నటుడు, అది ఒక నటుడి పార్టీ' అంటూ మమ్మల్ని విమర్శించారు. అలాంటి విమ‌ర్శ‌ల‌ను మేం అస్స‌లు ప‌ట్టించుకోము. మా రాజ‌కీయం పార‌దర్శ‌క‌మైన‌ది. ఎవ‌రైనా ముందు రాజ‌కీయ పార్టీని పెట్టి ప్ర‌జ‌ల్లోకి వెళ్తారు. కానీ నేను ప్ర‌జ‌ల్లోకి వెళ్లి పార్టీని పెట్టాను. మాకు 35 శాతం ఓట్లు వ‌చ్చాయి. మేం చాలా ఈజీగా అధికారంలోకి వ‌చ్చామ‌ని కొంద‌రు అంటున్నారు. కానీ మేము ఎన్నో కుట్ర‌లు, ఆంక్ష‌ల‌ను ఎదుర్కొన్నాం. అన్నింటినీ త‌ట్టుకుని ఇక్క‌డ నిల‌బ‌డ్డాం. మేం ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంది" అని విజ‌య్ చెప్పుకొచ్చారు.

నీట్‌ ర‌ద్దు చేయాలి..

దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నీట్' (NEET) ప‌రీక్ష‌ వివాదంపై కూడా విజయ్ స్పందించారు. నీట్ విధానం విద్యా వ్య‌వ‌స్థ‌లో అసమానతలను సృష్టిస్తోందని మండిపడ్డారు. దీన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ద్విభాషా విధానం స‌రిపోతుంది..

ఇక హిందీయేత‌ర రాష్ట్రాల‌పై హిందీని రుద్ద‌డంపై కూడా విజ‌య్ తీవ్రంగా స్పందించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ద్విభాషా విధానానికే (రాష్ట్ర భాష త‌మిళం, ఇంగ్లీష్‌) త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. హిందీ భాష‌ను రుద్ద‌డంపై కేంద్రం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను తాము ఎన్న‌టికీ అంగీక‌రించ‌బోమ‌ని ఈ సంద‌ర్భంగా విజ‌య్ తేల్చి చెప్పారు.

రాజ‌కీయాలు ఇంత క్రూర‌మా..?

ఇక ఎన్నిక‌ల ర్యాలీ సంద‌ర్భంగా క‌రూర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌ను కూడా విజ‌య్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌లో 41 మంది ప్రాణాలు కోల్పోవ‌డం త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింద‌న్నారు. ఆ బాధ త‌న‌ను ఎప్ప‌టికీ ఉంటుంద‌న్నారు. ఈ ఘ‌ట‌న విష‌యంలోనూ త‌మ‌పైనే నింద‌లు వేశార‌ని మండిప‌డ్డారు. ఇది అత్యంత దారుణ‌మ‌ని.. రాజ‌కీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా..? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అప్పుడు అన్నాదురై, ఎంజీఆర్‌.. ఇప్పుడు విజ‌య్‌..

ఈ సంద‌ర్భంగా అన్నాదురై, ఎంజీఆర్ గుర్తించి కూడా ప్రస్తావించారు. "1967లో అన్నా (అన్నాదురై), 1977లో ఎంజీఆర్ సామాన్య ప్రజల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2026లో విజయ్ ప్రభుత్వం కూడా సామాన్య ప్రజల కోసమే పనిచేస్తుంది" అని పేర్కొన్నారు.

వార‌స‌త్వ రాజ‌కీయంపై విమ‌ర్శ‌లు..

అదే సమయంలో డీఎంకే వారసత్వ రాజకీయంపై కూడా విజయ్ గట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. "మా రాజకీయం కేవలం ఒకే ఒక్క కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం కాదు. తమిళనాడులోని ప్రతి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడమే మా రాజకీయం.. అదే మా పాలన" అని విజయ్ నొక్కి చెప్పారు. డీఎంకే అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌లను ఉద్దేశించి విజ‌య్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కేంద్రంతో సయోధ్యగానే ఉంటాం..

కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యగానే ఉంటామని సీఎం స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్ర‌యోజ‌నాల దృష్ట్యా కేంద్ర ప్ర‌భుత్వంతో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తామ‌న్నారు. అయితే సిద్ధాంతపరంగా మాత్రం తాము బీజేపీ విధానాలను, వారి ఐడియాలజీని పూర్తిగా వ్యతిరేకిస్తామని సీఎం విజయ్ సభలో తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement