త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | పాల‌మూరు ఎడారిగా మారుతోంది.. కాంగ్రెస్ కుట్ర‌ల‌ను అడ్డుకుంటాం : శ్రీ‌నివాస్ గౌడ్

Srinivas Goud | ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డినా పాల‌మూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని శ్రీ‌నివాస్ గౌడ్‌ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పొరుగున ఉన్న కర్ణాటక ప్రభుత్వ కుట్రల వల్ల పాలమూరు శాశ్వతంగా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు.

D

Hyderabad | Published On Jun 23, 2026, 1.49 pm IST

Srinivas Goud | పాల‌మూరు ఎడారిగా మారుతోంది.. కాంగ్రెస్ కుట్ర‌ల‌ను అడ్డుకుంటాం : శ్రీ‌నివాస్ గౌడ్
Advertisement

Srinivas Goud | ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆగం అయిందని మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. పాల‌మూరు పేద‌రికాన్ని చూపించి ప్ర‌పంచ బ్యాంకు ద‌గ్గ‌ర అప్పులు చేశార‌ని.. ఆ నిధులు ఆంధ్రాలో కేటాయించార‌ని ఆరోపించారు. బాంబులు వేస్తామని భయపెట్టి రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లారన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్డీఎస్ నుంచే పాద‌యాత్ర స్టార్ట్ చేసి ఉద్య‌మాన్ని ర‌గిల్చార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ‌నివాస్ గౌడ్‌ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌, కేంద్ర ప్ర‌భుత్వం, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డినా పాల‌మూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని శ్రీ‌నివాస్ గౌడ్‌ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పొరుగున ఉన్న కర్ణాటక ప్రభుత్వ కుట్రల వల్ల పాలమూరు శాశ్వతంగా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు.

తుంగ‌భ‌ద్ర నుంచి 30 వేల ఎక‌రాల‌కు సాగు నీరు రావ‌డం లేదని శ్రీ‌నివాస్ గౌడ్ తెలిపారు. ఏ ధైర్యంతో ఆర్డీఎస్‌పైన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం రిజ‌ర్వాయ‌ర్లు క‌డుతోంద‌ని ప్ర‌శ్నించారు. కృష్టా న‌దిపై మ‌రో మూడు బ్యారేజీల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ ప్లాన్ చేస్తోంద‌ని చెప్పారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం పనులు ప్రారంభించింద‌న్నారు. ఇప్ప‌టికే జూరాల‌కు నీళ్లు రావ‌డం లేద‌ని... ఆల్మ‌ట్టి ఎత్తు పెంచితే జూన్‌, జులైలో సైతం కృష్ణాకు నీళ్లు రావ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీని వ‌ల్ల పాల‌మూరు జిల్లా పూర్తిగా క‌రవు కోర‌ల్లో కూరుకుపోతుంద‌న్నారు.

నీటి వివాదాలు ప‌రిష్క‌రించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా విఫ‌ల‌మైంద‌ని శ్రీ‌నివాస్ గౌడ్ ధ్వ‌జ‌మెత్తారు. కేంద్రానికి తెలంగాణపై ఎలాంటి ప్రేమ లేదని, అందుకే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదని విమ‌ర్శించారు. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కొత్త‌గా నిర్మిస్తున్న ప్రాజెక్టుల‌ను ఆపాల‌ని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్‌లో కర్ణాటక మంత్రులతో మీటింగ్ జరిగినప్పుడే పాలమూరు ఎమ్మెల్యేలు తమ అభ్యంతరం తెలిపార‌ని శ్రీ‌నివాస్ గౌడ్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ నాయకులే అక్కడ బ్యారేజీలకు కాంట్రాక్టర్లుగా మారి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిప‌డ్డారు. పాల‌మూరును శాశ్వ‌తంగా క‌ర‌వు జిల్లాగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు.

ప్ర‌స్తుతం పాల‌మూరు ప్రమాదంలో ఉంద‌ని అన్నారు. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్మిస్తున్న‌ ప్రాజెక్టుల‌ను ఎలా ఆపాలో త‌మ‌కు తెలుసున‌ని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అవ‌స‌ర‌మైతే వాటిని బ‌ద్ద‌లు కొడ‌తామ‌ని వ్యాఖ్యానించారు. పాలమూరు రక్షణ కోసం మరోసారి ఆర్డీఎస్ నుంచి పాదయాత్ర చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. జిల్లా ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉండాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారు.. జైపాల్ యాద‌వ్‌

పాల‌మూరు ప్ర‌జ‌ల‌ను రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాద‌వ్ విమ‌ర్శించారు. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి రేవంత్ స‌ర్కార్ ఎన్ఓసీ ఇచ్చింద‌న్నారు. "తుంగభద్ర నుంచి ఆర్డీఎస్ ద్వారా 90 వేల ఎకరాలకు ఆయకట్టు ఉండేది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజోలి బండకు రెండు వైపులా బ్యారేజీలు కట్టాలని కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదే జరిగితే రాజోలి బండకు చుక్క నీరు రాదు. పాలమూరు జిల్లాల్లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గం పాల‌మూరు. రేవంత్ రెడ్డికి రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చింది కూడా పాల‌మూరే" అని జైపాల్ యాద‌వ్ పేర్కొన్నారు. క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయార‌ని ఈ సంద‌ర్భంగా ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement