త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Seafarers | ప‌శ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు.. భార‌తీయ నావికుల భ‌ద్ర‌త‌కు కేంద్రం కీల‌క నిర్ణ‌యం

Indian Seafarers | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్న వేళ కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గల్ఫ్‌ ప్రాంతంలో ప్ర‌యాణించే నౌక‌లో ఉన్న ప్ర‌తి భార‌తీయ నావికుడికి సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అందించేలా ఒక రియ‌ల్ టైమ్ డ్యాష్‌బోర్డ్‌ను (Real Time Monitoring) ఏర్పాటు చేయాల‌ని షిప్పింగ్ అథారిటీని కేంద్రం ఆదేశించింది.

D

National | Published On Jul 15, 2026, 11.41 am IST

Indian Seafarers | ప‌శ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు.. భార‌తీయ నావికుల భ‌ద్ర‌త‌కు కేంద్రం కీల‌క నిర్ణ‌యం
Advertisement

Indian Seafarers | త్రినేత్ర‌.న్యూస్ : ప‌శ్చిమాసియాలో (Middle East) మ‌రోసారి ఉద్రిక్త‌త‌లు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా హ‌ర్మూజ్ జ‌ల‌సంధిలో వాణిజ్య నౌక‌ల‌పై దాడులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే జ‌రిగిన దాడుల్లో ప‌లువురు భార‌తీయ నావికులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గల్ఫ్‌ ప్రాంతంలో ప్ర‌యాణించే నౌక‌లో ఉన్న ప్ర‌తి భార‌తీయ నావికుడికి సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అందించేలా ఒక రియ‌ల్ టైమ్ డ్యాష్‌బోర్డ్‌ను (Real Time Monitoring) ఏర్పాటు చేయాల‌ని షిప్పింగ్ అథారిటీని కేంద్రం ఆదేశించింది. నౌక ఏ దేశ జెండాతో ప్రయాణిస్తున్నా.. అందులో పనిచేస్తున్న ప్రతి భారతీయుడి వివ‌రాలు సేక‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది.

అధికారిక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. ప‌ర్షియ‌న్‌ గ‌ల్ఫ్ (Persian Gulf), హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz), గ‌ల్ఫ్ ఆఫ్ ఒమ‌న్ ప్రాంతాల్లో ప్ర‌యాణించే ప్ర‌తి నౌక‌పై ప్రత్యేక ఆపరేషనల్‌ డ్యాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ (Sarbananda Sonowal) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DGS)ను ఆదేశించారు. ఈ డ్యాష్‌బోర్డులో నౌక ఉన్న ప్రాంతం, యాజ‌మాన్యం, స‌ర‌కు వివ‌రాలు, సిబ్బంది సంఖ్య‌, సిబ్బంది సంక్షేమం, భద్రతా పరిస్థితి, ప్ర‌యాణ మార్గం, చేరాల్సిన పోర్టు, అందుబాటులో ఉన్న సౌక‌ర్యాలు వంటి స‌మాచారం ఎప్ప‌టిక‌ప్పుడు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా షిప్పులోని భార‌తీయ సిబ్బంది వివ‌రాలను క‌చ్చితంగా న‌మోదు చేయాల‌ని మంత్రి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు.

నావికుల భ‌ద్ర‌తే అత్యంత ముఖ్య‌మ‌ని సోనోవాల్ చెప్పారు. నావికుల భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డే ప్రస‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, ఇండియన్ నేవీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DGS), ఇరాన్, ఒమన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని భారత రాయబార కార్యాలయాలతో కలిసి పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ (MoPSW) 24 గంటలూ సమన్వయం చేసుకోవాలని కేంద్ర మంత్రి ఆదేశించారు.

నౌకాయాన భద్రత, ప్రత్యామ్నాయ పోర్టులు, వైద్య సాయం, తరలింపు, స్వదేశానికి పంపే ఏర్పాట్లు, దర్యాప్తు పురోగతిపై ఎప్పటికప్పుడు ధ్రువీకరించిన సమాచారం సేకరించాలని సూచించారు. అదేవిధంగా గల్ఫ్‌ ప్రాంతంలో భారతీయ నావికులను నియమించిన షిప్పింగ్‌ కంపెనీలు, నౌకల నిర్వహణ సంస్థలు, రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పూర్తి సమాచారం, భద్రత, అవసరమైన సాయం లేకుండా ఏ భారతీయ నావికుడినీ విధులకు పంపవ‌ద్దని స్పష్టం చేశారు.

Also Read..

CCI | సీసీఐని పునఃప్రారంభించండి.. కేంద్ర మంత్రిని కోర‌నున్న బీఆర్ఎస్

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఆషాఢ బోనాలు.. రేపే తొలిబోనం

నైపుణ్యమే.. మీ భ‌విష్య‌త్తుకు మార్గం : సీఎం రేవంత్ రెడ్డి

Advertisement
Advertisement