త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

All Party Meeting | స‌మావేశాల‌కు స‌హ‌క‌రించాల‌న్న కేంద్రం.. అఖిల‌ప‌క్ష భేటీలో చ‌ర్చ‌కు విప‌క్షాల ప‌ట్టు..!

All Party Meeting | పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు బుధ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు.

P

National | Published On Jan 27, 2026, 6.32 pm IST

All Party Meeting | స‌మావేశాల‌కు స‌హ‌క‌రించాల‌న్న కేంద్రం.. అఖిల‌ప‌క్ష భేటీలో చ‌ర్చ‌కు విప‌క్షాల ప‌ట్టు..!
Advertisement

All Party Meeting | పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు బుధ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. వివిధ పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సీనియర్ బీజేపీ నేత‌లు, ప్రతిపక్ష నేత‌లు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేశ్ భేటీకి హాజ‌ర‌య్యారు.

బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లనుద్దేశించి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌సంగిస్తారు. ఈ నెల 29న ఆర్థిక స‌ర్వేను ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ సారి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు రెండు విడుత‌ల్లో జ‌రుగ‌నున్నాయి. తొలి విడుత స‌మావేశాలు బుధ‌వారం నుంచి ఫిబ్ర‌వ‌రి 13 వ‌ర‌కు కొన‌సాగుతాయి. ఈ సమయంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. అలాగే, బడ్జెట్‌పై కూడా చ‌ర్చ జ‌రుగుతుంది. మార్చి 9న పార్ల‌మెంట్ స‌మావేశాలు పునః ప్రారంభ‌మ‌వుతాయి. ఏప్రిల్ 2తో బ‌డ్జెట్ స‌మావేశాలు ముగుస్తాయి.

పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు ముందు ప్ర‌తిపాదిత శాస‌న అజెండాను వెల్ల‌డించ‌నందుకు కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పించింది. అఖిల‌ప‌క్ష స‌మావేశం అనంత‌రం కాంగ్రెస్ నేత కే సురేశ్ మాట్లాడుతూ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బిల్లుల జాబితా ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు. ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ అసంతృప్తిగా ఉన్నాయ‌న్నారు. అజెండాను తర్వాత పంపిణీ చేస్తామని మంత్రులు చెప్పారని, ప్రభుత్వం పారదర్శకత పాటించడం లేదని విమ‌ర్శించారు.

మ‌హ‌త్మాగాంధీ ఉపాధిహామీ ప‌థ‌కం స్థానంలో వ‌చ్చిన వీబీ గ్రామ్ జీ చ‌ట్టాన్ని ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకోద‌ని కేంద్ర‌మంత్రి కిర‌ణ్ రిజిజు స్ప‌ష్టం చేశారు. ఒక చట్టాన్ని దేశం ముందుకు తెచ్చిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ వెన‌క్కి త‌గ్గ‌లేమ‌న్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన చట్టాలపై వెనక్కి వెళ్లకుండా పార్లమెంటు ముందుకు సాగాలన్నారు. సమావేశాల సమయంలో ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత బడ్జెట్‌కు సంబంధించిన పనులేనని రిజిజు తెలిపారు. అన్ని పార్టీలు సహకరించి, పార్లమెంట్ స‌మావేశాలు సజావుగా పనిచేసేలా చూడాలని ఆయన కోరారు. కొత్త యూజీసీ మార్గదర్శకాలతో సహా పలు అంశాలపై చర్చలు జరపాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌కు ఆయ‌న స్పందిస్తూ.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్న ఆయ‌న‌.. బడ్జెట్‌ను ఆమోదించాల్సిన రాజ్యాంగ బాధ్యతను పార్టీలకు గుర్తుచేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై చర్చ జరపాలని తమ పార్టీ డిమాండ్ చేసిందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్ తెలిపారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లేదన్నారు. మ‌ర‌ణాల పేరుతో ఓట్లు తొల‌గించారంటూ ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తిప‌క్ష పాలిత రాష్ట్రాల‌కు ఉద్దేశించిన నిధుల‌ను కేంద్రం అన్యాయంగా నిలిపివేసింద‌ని, ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న రాష్ట్రాల్లో కేంద్ర సంస్థ‌ల దుర్వినియోగం జ‌రుగుతోంద‌ని ఘోష్ ఆరోపించారు. స‌ర్ వంటి అంశాల‌ను తీవ్రంగా చ‌ర్చించాల‌ని ఐయూఎంఎల్ ఎంపీ ఈటీ మ‌హ‌హ్మ‌ద్ బ‌షీర్ డిమాండ్ చేశారు.

దేశంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఒడిశాలో శాంతి భ‌ద్ర‌త‌లు, నిరుద్యోగం, కొత్త జీరామ్ జీ చ‌ట్టం కింద ప‌రిమిత ఉపాధి అవ‌కాశాల‌కు సంబంధించిన ఆందోళ‌న‌ల‌పై త‌మ పార్టీ లేవ‌నెత్తుతుంద‌ని బీజేడీ ఎంపీ స‌స్మిత పాత్ర పేర్కొన్నారు. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ఈజీఎస్ ప‌థ‌కాన్ని ర‌ద్దు చేసి.. ఆ స్థానంలో విక‌సిత్‌ భార‌త్ గ్యారంటీ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిష‌న్ (గ్రామీణ) బిల్లును కేంద్రం తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు ఈ వ్యాఖ్య‌లు చేశాయి. ఉపాధిని వంద నుంచి 125 రోజుల‌కు కేంద్రం పెంచిన విష‌యం తెలిసిందే. ఉపాధి, స‌ర్‌తో పాటు ప‌లు అంశాల‌పై కేంద్రాన్ని ప్ర‌తిప‌క్షాలు ఇరుకున పెట్టేందుకు త‌మ అస్త్రాల‌ను సిద్ధం చేస్తున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement