త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Komatireddy | నాగ్‌పూర్–వరంగల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే 2027 డిసెంబర్‌ నాటికి పూర్తి : మంత్రి కోమ‌టిరెడ్డి

Minister Komatireddy | నాగ్‌పూర్‌–మంచిర్యాల–వరంగల్‌–ఖమ్మం–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను 2027 డిసెంబర్‌ 31 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శాసన మండలిలో సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

P

Telangana | Published On Sep 12, 2026, 2.39 pm IST

Minister Komatireddy | నాగ్‌పూర్–వరంగల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే 2027 డిసెంబర్‌ నాటికి పూర్తి : మంత్రి కోమ‌టిరెడ్డి
Advertisement

Minister Komatireddy | నాగ్‌పూర్‌–మంచిర్యాల–వరంగల్‌–ఖమ్మం–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను 2027 డిసెంబర్‌ 31 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శాసన మండలిలో సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పరకాల ప్రాంతానికి దగ్గరగా హైవే ఎగ్జిట్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసి, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేయిస్తామని తెలిపారు. నాగ్‌పూర్‌–మంచిర్యాల–వరంగల్‌–ఖమ్మం–విజయవాడ హైవే అత్యంత కీలకమైన రహదారి అని పేర్కొన్నారు. మొత్తం 310 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టులో 280 కిలోమీటర్లు తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు. నాలుగైదు జిల్లాలను కలుపుతూ.. తెలంగాణ నుంచి నాగ్‌పూర్‌, విజయవాడ వైపు రాకపోకలు సాగించే ప్రజలకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి చెప్పారు.

భూసేకరణతో జాప్యం

మంచిర్యాల–వరంగల్‌ రహదారిని పలు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. 2023 మార్చి 31న ఎల్‌ఓఏ జారీ చేయగా.. మే 23న అగ్రిమెంట్‌ జరిగిందన్నారు. తొలుత 730 రోజుల్లో, అంటే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ భూసేకరణ, కోర్టు కేసులు తదితర కారణాలతో పనుల్లో జాప్యం జరిగిందని వివరించారు. భూసేకరణకు సంబంధించి దాదాపు అన్ని సమస్యలను పరిష్కరించామని చెప్పారు. చిన్నచిన్న సమస్యలతో కొంత భూమి మాత్రమే పెండింగ్‌లో ఉందని.. దానిని కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. జాప్యం కారణంగా కాంట్రాక్టర్‌కు ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టైమ్‌ ఇచ్చామని.. 2027 డిసెంబర్‌ 31 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.

రైతులకు మార్కెట్‌ రేట్‌ ప్రకారం పరిహారం

భూసేకరణ విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని మంత్రి స్పష్టం చేశారు. మార్కెట్‌ రేట్‌ ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోదండరామ్‌ లేవనెత్తిన భూసేకరణ సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. ప్రస్తుతం ఒకటి రెండు చోట్ల మాత్రమే భూమి అప్పగింత పెండింగ్‌లో ఉందన్నారు. ఒకచోట సుమారు 1 నుంచి 1.30 కిలోమీటర్లు, మరో ప్యాకేజీలో 5.7 కిలోమీటర్ల మేర సమస్య ఉందని.. వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.

రాష్ట్రం నోడల్‌ ఏజెన్సీ

భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, నిర్మాణ పనులు పూర్తిగా ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ ఏజెన్సీగా ఎన్‌హెచ్‌ఏఐకి పూర్తి సహకారం అందిస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యలను వెంటనే పరిష్కరించేలా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మే 26న ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారని గుర్తుచేశారు. తెలంగాణకు, ముఖ్యంగా నాగ్‌పూర్‌కు వెళ్లే ప్రజలకు ఈ రహదారి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారని మంత్రి తెలిపారు. 2027 డిసెంబర్‌ 31 నాటికి ఈ కీలక రహదారి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మండలి సభ్యులకు మంత్రి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement