లోడ్ అవుతోంది...


కేంద్ర ప్రభుత్వం జోక్యంతో బ్లింకిట్ సహా ప్రధాన క్విక్ కామర్స్ సంస్థలు ‘10 నిమిషాల డెలివరీ’ వాగ్దానాన్ని నిలిపివేస్తున్నాయి. డెలివరీ ఏజెంట్లపై ఒత్తిడిని తగ్గించి, వారి భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే బ్లింకిట్ తన యాప్, ప్రకటనల నుండి ఈ సమయ గడువును తొలగించింది.
10-Minute Delivery | దేశవ్యాప్తంగా క్విక్ కామర్స్ రంగంలో సంచలనం సృష్టించిన ‘10 నిమిషాల డెలివరీ’ ఫీచర్‌కు తెరపడనుంది. డెలివరీ భాగస్వాముల (గిగ్ వర్కర్లు) ప్రాణ భద్రత, పని ఒత్తిడిపై వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో, ప్రముఖ సంస్థ బ్లింకిట్ (Blinkit) తన బ్రాండింగ్, ప్రకటనల నుంచి ఈ కాలపరిమితిని తొలగించాలని నిర్ణయించుకుంది.
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల బ్లింకిట్, జెప్టో (Zepto), స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనే నిబంధన డెలివరీ ఏజెంట్లపై తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడిని కలిగిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వేగం కంటే భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీలను ఆదేశించారు. ప్రకటనల్లో, సోషల్ మీడియాలో ఇలాంటి ‘ఫిక్స్‌డ్ టైమ్’ వాగ్దానాలను నిలిపివేయాలని సూచించారు.
ప్రభుత్వ సూచనలకు స్పందించిన బ్లింకిట్, ఇప్పటికే తన ట్యాగ్‌లైన్‌ను మార్చేసింది. గతంలో ఉన్న "10 నిమిషాల్లో 10,000కు పైగా ఉత్పత్తులు" అనే నినాదానికి బదులుగా, ఇప్పుడు "మీ ఇంటి వద్దకే 30,000కు పైగా ఉత్పత్తులు" అని బ్రాండింగ్ చేసుకుంటోంది. మిగిలిన సంస్థలు కూడా త్వరలోనే ఇదే బాటలో పయనిస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి.
కానీ దీని వల్ల డెలివరీ సమయం అనేది పెరుగుతుంది అని చెప్పలేకున్నా 10 నిమిషాల్లో డెలివరీ అనే కాన్సెప్ట్ ఉండదు ఇక. పలు బ్రాండ్స్‌కి ఇతర బ్రాండ్లతో ఉన్న పోటీ కారణంగా ఎంత తక్కువ సమయంలో డెలివరీ చేశారు అనేది ఎక్కువగా హైలెట్ అయ్యే చాన్స్ ఉంది.
గత ఏడాది డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది గిగ్ వర్కర్లు నిర్వహించిన మెరుపు సమ్మె ఈ మార్పుకు ప్రధాన కారణమైంది. డెలివరీ సమయ పరిమితులను తొలగించాలని, మెరుగైన వేతనాలు, భీమా సౌకర్యాలు కల్పించాలని గిగ్ వర్కర్లు డిమాండ్ చేశారు. అంతకంటే ముందు డిసెంబర్ 25న తొలిసారి సమ్మె నిర్వహించారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కూడా గిగ్ వర్కర్ల పక్షాన నిలిచి, వారి కష్టాలను పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో పాటు స్వయంగా డెలివరీ బాయ్‌గా మారి వారి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు.

జనవరి 10, 2026

జనవరి 8, 2026

జనవరి 1, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam