త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manan Kumar Mishra | రూ.150 కోట్ల స్కాం.. ఫ్యామిలీకే పదవులు : బీసీఐ చైర్మన్ మనన్ 15 రోజుల్లో రాజీనామా చేయాల్సిందే

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)లో తీవ్ర కలకలం రేగుతోంది. నిధుల మళ్లింపు, బంధుప్రీతి ఆరోపణలతో చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తక్షణమే రాజీనామా చేయాలని కో-చైర్మన్ వై.ఆర్.సదాశివ రెడ్డి డిమాండ్ చేస్తూ సంచలన లేఖ రాశారు.

J

National | Published On Aug 22, 2026, 1.06 pm IST

Manan Kumar Mishra | రూ.150 కోట్ల స్కాం.. ఫ్యామిలీకే పదవులు : బీసీఐ చైర్మన్ మనన్ 15 రోజుల్లో రాజీనామా చేయాల్సిందే
Advertisement
  • బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)లో భారీ వివాదం, చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజీనామాకు డిమాండ్
  • 15 రోజుల్లోగా రిజైన్ చేయాలంటూ కో-చైర్మన్ వై.ఆర్.సదాశివ రెడ్డి ఆరు పేజీల ఘాటు లేఖ
  • ప్రైవేట్ ట్రస్ట్‌కు రూ.150 కోట్లు బదిలీ, కౌన్సిల్ పోస్టుల్లో ఫ్యామిలీ మెంబర్స్ నియామకంపై ఆరోపణలు
  • నల్సార్ (NALSAR) విద్యార్థులపై తీసుకున్న అక్రమ చర్యలను తీవ్రంగా తప్పుబట్టిన సదాశివ రెడ్డి

Manan Kumar Mishra | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా న్యాయవాదుల వ్యవహారాలను పర్యవేక్షించే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 22, 2026న శనివారం.. కౌన్సిల్ కో-చైర్మన్ వై.ఆర్.సదాశివ రెడ్డి ఏకంగా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాకి ఒక ఘాటైన ఆరు పేజీల లేఖ రాశారు. 15 రోజుల్లోగా తన పదవికి రాజీనామా(resignation) చేయాలని అందులో స్ట్రాంగ్‌గా డిమాండ్ చేశారు. దాదాపు దశాబ్ద కాలంగా ఆయనతో కలిసి పనిచేస్తున్న సదాశివ రెడ్డి.. ఇప్పుడు ఇలా బహిరంగంగా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ రాజీనామా కోరడం లీగల్ సర్కిల్స్‌లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

రూ.150 కోట్లు ప్రైవేట్ ట్రస్ట్‌కు మళ్లింపు

మిశ్రా రాజీనామా కోరడానికి ప్రధాన కారణం భారీ స్థాయిలో జరిగిన నిధుల మళ్లింపేనని ఆ లేఖలో ఆరోపించారు. దేశవ్యాప్తంగా న్యాయవాదులు చెల్లించిన సుమారు రూ. 150 కోట్ల కౌన్సిల్ ఫండ్స్‌ను(funds) ను చైర్మన్ కంట్రోల్ చేసే 'BCI Trust PEARL – First' అనే ఒక ప్రైవేట్ ట్రస్ట్‌కు మళ్లించినట్లు రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఎలాంటి పారదర్శకత లేకుండా.. కనీసం పబ్లిక్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కౌన్సిల్‌లోని కీలక పోస్టుల్లో చైర్మన్ తన సొంత కుటుంబ సభ్యులను ( family members) కూర్చోబెట్టారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

లా కాలేజీలపై వసూళ్ల పర్వం

ఇక అప్రూవల్స్ లేదా రెన్యువల్స్ కోసం వచ్చే లా కాలేజల (Law colleges ) నుంచి ఈ కొత్త ట్రస్ట్‌కు రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు విరాళాలు ఇవ్వాలని చైర్మన్ ఆఫీస్ నుంచి ఒత్తిడి తెస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. దీనికి తోడు, ఇటీవల హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ (NALSAR) యూనివర్సిటీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఆపాలని చైర్మన్ ఆఫీస్ ఇచ్చిన అక్రమ ఆదేశాలు కౌన్సిల్ ఇమేజ్‌ను చరిత్రలో ఎన్నడూ లేనంతగా డ్యామేజ్ చేశాయని సదాశివ రెడ్డి ఫైర్ అయ్యారు. కౌన్సిల్ తీర్మానం లేకుండానే ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.

14 ఏళ్లుగా ఒకరే ఎలా ఉంటారు?

సాధారణంగా కేవలం రెండేళ్ల పదవీకాలం ఉండే చైర్మన్ పోస్టులో మనన్ కుమార్ మిశ్రా 2012 నుంచి.. అంటే ఏకంగా 14 ఏళ్లుగా కొనసాగడంపై సదాశివ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఎలెక్టెడ్ పోస్టులో ఒకే వ్యక్తి ఇన్నేళ్ల పాటు ఉండటం అంటే దానికి అర్థమే లేదని అన్నారు. స్టూడెంట్ బార్ కౌన్సిల్స్, యంగ్ అడ్వకేట్స్ అందరూ ఆయన వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గుర్తుచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై కాగ్ (CAG) ప్యానెల్ ఏజెన్సీతో స్పెషల్ ఆడిట్ (special audit) జరిపించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేస్తూ లేఖను ముగించారు.

Advertisement
Advertisement