పవిత్ర పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. శబరిమల కొండపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. ఈ ఘటనలో హైదరాబాద్ భక్తుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌కి చెందిన ఓ అయ్యప్ప భక్తుడు శబరిమలలో ఉన్న ఓ షాపులో వాటర్ బాటిల్ కొన్నాడు. ఆ బాటిల్ ధరను ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తుండటంతో సదరు వ్యాపారిని భక్తుడు ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఆ షాపు యజమాని, షాపులో ఉన్న గాజు సీసాతో భక్తుడి తల పగులగొట్టాడు. దీంతో ఆ భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఆ షాపు వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆ వ్యాపారి దాడిని నిరసిస్తూ షాపు ముందు బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న భక్తులను, వ్యాపారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మిగితా విషయాలు తెలియాల్సి ఉంది.