త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah vs Sonia Gandhi | వందేమాతరం పట్ల ఇంత అవమానమా.. సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: అమిత్ షా

స్వాతంత్య్ర దినోత్సవం రోజున కాంగ్రెస్ ఆఫీసులో వందేమాతరం గీతాన్ని మధ్యలోనే ఆపేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

J

National | Published On Aug 16, 2026, 5.27 pm IST

Amit Shah vs Sonia Gandhi | వందేమాతరం పట్ల ఇంత అవమానమా.. సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: అమిత్ షా
Advertisement
  • ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం గీతాన్ని సోనియా గాంధీ మధ్యలోనే ఆపేశారని అమిత్ షా ఆరోపణ
  • ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే దేశభక్తి గీతాన్ని అవమానించారని, బంకింబాబుకు, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • షా ఆరోపణలను కొట్టిపారేసిన కాంగ్రెస్
  • ఖర్గే ఆరోగ్యం బాలేనందున కుర్చీ కోసం సోనియా సైగ చేశారని ఉదిత్ రాజ్ వివరణ
  • ఆర్ఎస్ఎస్ (RSS) 52 ఏళ్ల పాటు జాతీయ జెండాను ఎగురవేయలేదని, దానికి అమిత్ షా ఎప్పుడు క్షమాపణ చెబుతారని కాంగ్రెస్ కౌంటర్

Amit Shah vs Sonia Gandhi | త్రినేత్ర.న్యూస్ : స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో 'వందేమాతరం' గీతాన్ని మధ్యలోనే ఆపేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) తీరును తప్పుబట్టిన ఆయన, ఆ పార్టీ వెంటనే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదంతా టీవీల్లో చూశాం.. సిగ్గుపడాలి

రాజస్థాన్‌ (Rajasthan) లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. "వందేమాతరం పాడుతుండగా, దానిని ఆపేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడికి సోనియా జీ సైగ చేశారు. ఇదంతా టీవీల్లో మేం చూశాం. జాతీయ గీతాన్ని సగంలోనే వదిలేయాలని ఎవరైనా ఎలా అనుకుంటారు? ఇందుకు కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలి" అని షా తీవ్రస్థాయిలో విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆ పార్టీ వందేమాతరంతో ముడిపడి ఉన్న త్యాగాలను మర్చిపోయిందని ఆయన దుయ్యబట్టారు. వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల ప్రాణత్యాగాలను గుర్తుచేస్తూ.. ఏమాత్రం సిగ్గు ఉన్నా బంకించంద్ర ఛటర్జీకి, దేశ ప్రజలకు కాంగ్రెస్ రెండు చేతులెత్తి క్షమాపణలు చెప్పాలన్నారు. "సోనియా జీ.. దేశ ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు, మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరు" అని హెచ్చరించారు.

అది పచ్చి అబద్ధం: కాంగ్రెస్ కౌంటర్

అయితే, అమిత్ షా ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ఎక్కువసేపు నిలబడలేరని, అందుకే కుర్చీ తీసుకురావాలని సోనియా గాంధీ సైగ చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఉదిత్ రాజ్ వివరించారు. అంతేతప్ప, అది వందేమాతరం ఆపాలని చేసిన సైగ కాదన్నారు. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంలోని బీజేపీ ఫేక్ వివాదాలు సృష్టిస్తోందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన ఆరెస్సెస్ (RSS) పై తీవ్ర విమర్శలు చేశారు. "ఆర్ఎస్ఎస్ 52 ఏళ్ల పాటు జాతీయ జెండాను ఎగురవేయలేదు. జాతీయ జెండాను ఆమోదించకుండా, అది కాషాయ రంగులోనే ఉండాలని పట్టుబట్టింది. ఆ చరిత్ర ఉన్నందుకు అమిత్ షా ఎప్పుడు క్షమాపణలు చెబుతారు?" అని ఉదిత్ రాజ్ నిలదీశారు.

వాజ్‌పేయి ధైర్యం, మోదీ దార్శనికత

ఇదే సభలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని అమిత్ షా ప్రశంసించారు. అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన ఆయన ధైర్యాన్ని కొనియాడారు. గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ, గిరిజన అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత వాజ్‌పేయిదేనని, ఆ దార్శనికతను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మరింత ముందుకు తీసుకెళ్తున్నారని కితాబిచ్చారు.

కాగా, అమిత్ షా నాయకత్వంలో దేశ సరిహద్దులు ఎంతో సురక్షితంగా ఉన్నాయని, మావోయిస్టుల ఏరివేత సాధ్యమైందని రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ సభలోకేంద్ర హోంమంత్రిని కొనియాడారు.

Advertisement
Advertisement