త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telegram CEO Pavel Durov | టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌.. కోట్ల ఆస్తి ఉన్నా నిరాడంబ‌ర‌మైన జీవితం..

Telegram CEO Pavel Durov | ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సంప‌న్నులు ఎవ‌రైనా స‌రే అత్యంత ఆడంబ‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతారు. నిత్యం నిద్ర లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు వారు ఉప‌యోగించే వ‌స్తువులు అన్నీ అత్యంత ఖ‌రీదైన‌విగా ఉంటాయి.

S

Lifestyle | Published On Jan 7, 2026, 1.23 pm IST

Telegram CEO Pavel Durov | టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌.. కోట్ల ఆస్తి ఉన్నా నిరాడంబ‌ర‌మైన జీవితం..
Advertisement

Telegram CEO Pavel Durov | ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సంప‌న్నులు ఎవ‌రైనా స‌రే అత్యంత ఆడంబ‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతారు. నిత్యం నిద్ర లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు వారు ఉప‌యోగించే వ‌స్తువులు అన్నీ అత్యంత ఖ‌రీదైన‌విగా ఉంటాయి. తిండి, ప్ర‌యాణం, దుస్తులు, వ్యాపారం, వినోదం.. ఇలా ఏ అంశంలోనైనా స‌రే సంప‌న్నులు ఎవ‌రైనా అత్యంత విలాస‌వంత‌మైన వ‌స్తువులు, స‌దుపాయాల‌ను ఉప‌యోగిస్తూ అత్యంత ఆడంబ‌రంగా జీవిస్తారు. అయితే టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్న‌మైన సంప‌న్నుడ‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న‌కు సుమారుగా 17 బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తి ఉంది. ఆయ‌న స్థాపించిన టెలిగ్రామ్ యాప్ సుమారుగా 30 బిలియ‌న్ డాల‌ర్ల విలువ చేస్తుంది. అయిన‌ప్ప‌టికీ దురోవ్ మాత్రం ఎక్క‌డా త‌న విలాసాన్ని ప్ర‌ద‌ర్శించ‌రు. అత్యంత నిరాడంబ‌రంగా జీవిస్తారు. పైగా ఆయ‌న‌కు అంత ఆస్తి ఉన్నా సొంతంగా ఇల్లు, కార్లు, ప్రైవేటు విమానాలు, ప‌డ‌వ‌లు కూడా లేవు. ఈ క్ర‌మంలోనే చాలా మంది దురోవ్ సింప్లిసిటీని ఆద‌ర్శంగా తీసుకుంటుంటారు. ఆయ‌న‌ను అనుస‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.

సృజ‌నాత్మ‌క‌త‌పైనే దృష్టి..

అయితే దురోవ్ తాను అలా ఎందుకు ఉంటాన‌నే విష‌యాన్ని గ‌తంలో ఎన్న‌డో తెలియ‌జేశారు. అత్యంత విలాస‌వంత‌మైన వ‌స్తువుల‌ను వాడుతూ ఆడంబ‌రంగా జీవిస్తే వాటి మాయలో ప‌డిపోతామ‌ని, చేసే ప‌నిని మరిచిపోయి విలాసాల‌కు అల‌వాటు ప‌డ‌తామ‌ని, అలాగే ఉత్పాద‌క‌త త‌గ్గుతుందని, మాన‌సికంగా ఏ అంశంపై కూడా దృష్టి పెట్ట‌లేర‌ని, దీంతో జీవితంలో సాధించాల‌నుకునే విష‌యాల‌ను సాధించ‌లేక‌పోతార‌ని, అందుక‌నే తాను నిరాడంబ‌రంగా ఉంటాన‌ని దురోవ్ తెలిపారు. దురోవ్ వాస్త‌వానికి చాలా స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటిస్తారు. విలాస‌వంతమైన వ‌స్తువులపై ఆధార ప‌డితే వాటికి బానిస‌లుగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న అభిప్రాయం. మ‌న‌కు స్వేచ్ఛ ల‌భించ‌దు. ఆయ‌న ఎక్కువ‌గా త‌త్వ‌శాస్త్రాన్ని విశ్వ‌సిస్తారు. దాన్నే ఎక్కువ‌గా ఫాలో అవుతారు. భౌతిక ఆస్తులు, స్వల్ప‌కాలిక ఆనందాల‌ను ఆయ‌న ప‌ట్టించుకోరు. ఎల్ల‌ప్పుడూ సృజనాత్మ‌క‌తను పెంచుకునే ప‌నులు చేస్తారు. అవే దీర్ఘ‌కాలిక విజ‌యాల‌ను అందిస్తాయ‌ని ఆయ‌న బ‌లంగా న‌మ్ముతారు. అందుక‌నే దురోవ్ చాలా సింపుల్‌గా జీవిస్తారు.

భౌతిక ఆస్తుల‌తో స్వేచ్ఛ ఉండ‌దు..

భౌతిక ఆస్తుల‌ను పెంచుకుంటూ పోతే వాటికి మ‌నం అటాచ్ అయి ఉండాల్సి వ‌స్తుంద‌ని, స్వేచ్ఛ‌గా జీవించ‌లేమ‌ని దురోవ్ అభిప్రాయం. అలాగే స్వ‌ల్పకాలిక ఆనందాలు మ‌న ఉత్పాద‌క‌త‌కు ఆటంకాలు అని, చేసే ప‌నిపై దృష్టి మ‌ర‌లుతుంద‌ని, మ‌నం చేయాల‌నుకున్న‌వి చేయ‌లేక‌పోతామ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ‌తారు. అందుక‌నే వాటికి ఆయ‌న దూరంగా ఉంటారు. ఇక ఆహారం విష‌యంలోనూ దురోవ్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఆయ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తింటారు. ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు లేదా జంక్ ఫుడ్ తీసుకోరు. పైగా ఆయ‌న మ‌ద్యం అస‌లు సేవించ‌రు. కాఫీ, చ‌క్కెర‌ల‌కు దూరంగా ఉంటారు. ఫాస్ట్ ఫుడ్‌ను అస‌లు తిన‌రు. మాంసం తిన‌డాన్ని ఇష్ట‌ప‌డ‌రు. ఇలా దురోవ్ ఆహారం విష‌యంలోనూ అనేక నియ‌మాల‌ను పాటిస్తారు. పైగా వ్యాయామం కూడా చేస్తారు. క‌నుక‌నే ఆయ‌న శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటారు. అప్పుడ‌ప్పుడు సిక్స్ ప్యాక్ దేహంతోనూ క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు.

వీర్య దానం అందుకే..

ఇక దురోవ్ కు సొంత జెట్ కూడా లేదు. ఆయ‌న సాధార‌ణ విమాన ప్ర‌యాణ‌మే చేస్తారు. ఎక్కువ‌గా త‌న వ‌ద్ద ప‌నిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌తో కొన్ని వారాలకు ఒక‌సారి ఒక దేశం నుంచి మ‌రొక దేశానికి వెళ్తుంటారు. ఆయ‌న ప్ర‌స్తుతం టెలిగ్రామ్ ప్ర‌ధాన కార్యాలయం ఉన్న దుబాయ్‌లో నివ‌సిస్తున్నారు. అయితే దురోవ్ ఈ మ‌ధ్య కాలంలో త‌న వీర్యం ఇవ్వ‌డంపై ప‌లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు. 37 ఏళ్ల లోపు వ‌య‌స్సు ఉన్న మ‌హిళ‌లు ఐవీఎఫ్ కోసం త‌న వీర్యాన్ని ఉప‌యెగించుకుంటే అందుకు అయ్యే ఖ‌ర్చుల‌ను కూడా తానే భ‌రిస్తాన‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌పంచంలో చాలా మంది పురుషుల్లో వీర్యం నాణ్యంగా ఉండడం లేద‌ని, సంతాన లోప స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని, క‌నుక త‌న వీర్యాన్ని దానం చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నాన‌ని తెలిపారు. అందుక‌నే అలాంటి మ‌హిళ‌ల‌కు త‌న వీర్యాన్ని ఐవీఎఫ్ కోసం ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే ఆయ‌న 100 మందికి పైగా త‌న వీర్యాన్ని ఇలా దానం చేశారు. మొద‌ట‌గా త‌న స్నేహితుడికి వీర్య‌దానం చేశాక ఆయ‌న‌కు ఆ ఆలోచ‌న వ‌చ్చి అప్ప‌టి నుంచి వీర్య దానం చేస్తున్నారు. ఇక గ‌తంలో ఆయ‌న తాను చ‌నిపోయాక‌ తన ఆస్తినంతా తాను వీర్య దానం చేయ‌డం ద్వారా జ‌న్మించిన పిల్ల‌ల‌కు స‌మానంగా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఇలా పావెల్ దురోవ్ త‌న నిరాడంబ‌ర‌మైన జీవితంతోనే కాక సామాజిక సేవ‌తో ఎంతో మందికి ప్రేర‌ణ‌గా నిలుస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement