త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GLP-1 Medicine | బ‌రువు త‌గ్గించే జీఎల్‌పీ-1 మందులు.. వాడ‌కాన్ని మధ్య‌లోనే ఆపేస్తున్నారు.. ఎందుక‌ని..?

GLP-1 Medicine | య‌ష్ వ‌య‌స్సు 25 ఏళ్లు. అధికంగా బ‌రువు క‌లిగి ఉంటాడు. షుగ‌ర్ కూడా ఎక్కువే. ఆక‌లికి తట్టుకోలేడు. ఈ క్ర‌మంలో బ‌రువును త‌గ్గించుకోవ‌డం అదే స‌మ‌యంలో డ‌యాబెటిస్‌ను నియంత్రించ‌డం అతనికి క‌ష్టంగా మారింది. ఆ స‌మ‌యంలోనే అత‌ను Tirzepatide అనే ఔష‌ధాన్ని డాక్ల‌ర్ల సూచ‌న మేర‌కు వాడ‌డం మొద‌లు పెట్టాడు.

S

Lifestyle | Published On Jan 7, 2026, 11.33 am IST

GLP-1 Medicine | బ‌రువు త‌గ్గించే జీఎల్‌పీ-1 మందులు.. వాడ‌కాన్ని మధ్య‌లోనే ఆపేస్తున్నారు.. ఎందుక‌ని..?
Advertisement

GLP-1 Medicine | య‌ష్ వ‌య‌స్సు 25 ఏళ్లు. అధికంగా బ‌రువు క‌లిగి ఉంటాడు. షుగ‌ర్ కూడా ఎక్కువే. ఆక‌లికి తట్టుకోలేడు. ఈ క్ర‌మంలో బ‌రువును త‌గ్గించుకోవ‌డం అదే స‌మ‌యంలో డ‌యాబెటిస్‌ను నియంత్రించ‌డం అతనికి క‌ష్టంగా మారింది. ఆ స‌మ‌యంలోనే అత‌ను Tirzepatide అనే ఔష‌ధాన్ని డాక్ల‌ర్ల సూచ‌న మేర‌కు వాడ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో అత‌ని ఆక‌లి చాలా వ‌ర‌కు త‌గ్గింది. తిండి తిన‌డం కూడా చాలా వ‌ర‌కు త‌గ్గించాడు. దీంతోపాటు వ్యాయామం కూడా చేశాడు. కొద్ది నెల‌ల్లోనే ఏకంగా 14 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గాడు. అలాగే నేహా అనే 46 ఏళ్ల మ‌హిళ కూడా ఇదే ఔష‌ధాన్ని వైద్యుల సూచ‌న మేర‌కు వాడింది. ఆమె బ‌రువు 85 కిలోల నుంచి 81 కిలోల‌కు త‌గ్గింది. గ‌తంలో అధికంగా ఉన్న ఆక‌లి ఇప్పుడు ఆమెకు లేదు. దీంతో తిండి తినడం చాలా వ‌ర‌కు తగ్గింది. ఇలా ఈ ఇద్ద‌రు మాత్రమే కాదు, దేశంలో చాలా మంది ప్ర‌స్తుతం Tirzepatide ఔష‌ధంతో లాభం పొందుతున్నారు.

ఇంజెక్ష‌న్‌, ట్యాబ్లెట్ల రూపంలో..

Tirzepatide ఔష‌ధాన్ని Mounjaro బ్రాండ్ పేరిట గ‌తేడాది మార్చిలో విడుద‌ల చేశారు. దీంతో దేశంలోని చాలా మంది ఈ ఔష‌ధాన్ని వాడడం మొద‌లు పెట్టారు. బ‌రువు త‌గ్గేందుకు ఈ ఔష‌ధం అద్భుతంగా ప‌నిచేస్తుండ‌డంతో చాలా మంది దీన్ని వాడేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక Tirzepatide లాగే Semaglutide అనే ఔష‌ధం కూడా బ‌రువు త‌గ్గేందుకు ప‌నిచేస్తుంది. దీన్ని భార‌త్‌లో ఇప్ప‌టికే Rybelsus బ్రాండ్ పేరిట విక్ర‌యిస్తున్నారు. ఈ క్ర‌మంలో చాలా మంది Rybelsus ను కూడా షుగ‌ర్ ను కంట్రోల్ చేయ‌డానికి, బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగిస్తున్నారు. అయితే Tirzepatide మ‌న‌కు ఇంజెక్ష‌న్ రూపంలో ల‌భిస్తుండ‌గా Semaglutide ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులో ఉంది. ఈ క్ర‌మంలో ఈ రెండింటిలో ఏ ఔష‌ధాన్ని వాడినా నెల‌కు క‌నీసం రూ.10వేల నుంచి రూ.30వేల మ‌ధ్య‌లో డ‌బ్బు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది.

రెండింటి ప‌నితీరు ఒక్క‌టే..

అయితే Tirzepatide లేదా Semaglutide ఏ ఔష‌ధాన్ని వాడినా స‌రే రెండూ ఒకేలా ప‌నిచేస్తాయి. కానీ Tirzepatide ఇంజెక్ష‌న్ రూపంలో ఉంటుంది క‌నుక కాస్త మెరుగ్గా ప‌నిచేస్తుంది. అలాగే దీని వ్య‌యం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇక ఈ రెండింటినీ GLP-1 రిసెప్ట‌ర్ ఆగోనిస్ట్స్‌గా పిలుస్తారు. ఈ రెండు ఔష‌ధాలు GIP, GLP-1 అనే రెండు స‌హ‌జ‌సిద్ధ‌మైన హార్మోన్ల మాదిరిగా ప‌నిచేస్తాయి. శ‌రీరంలో ఎక్కువ స‌మ‌యం పాటు ఉంటాయి. ఈ క్ర‌మంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగిన‌ప్పుడు మాత్ర‌మే ఇన్సులిన్ రిలీజ్ అయ్యేలా చూస్తాయి. దీంతో ఇన్సులిన్ ఎల్ల‌ప్పుడూ శ‌రీరంలో ఉండ‌దు. దీని వ‌ల్ల ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అలాగే ఇన్సులిన్ కావ‌ల్సిన‌ప్పుడు మాత్ర‌మే రిలీజ్ అవుతుంది క‌నుక షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి. ఇక ఈ ఔష‌ధాల‌ను వాడితే జీర్ణ‌వ్య‌వ‌స్థలో ఆహారం ఎక్కువ సేపు అలాగే ఉంటుంది. దీంతో ఆక‌లి అవ‌దు. ఫ‌లితంగా ఎక్కువ సేపు క‌డుపు నిండుగా ఉన్న భావ‌న‌తో ఉంటారు. దీని వ‌ల్ల ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. ఇలా రోజూ జ‌రుగుతుంది క‌నుక త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. ఇలా ఈ రెండు మెడిసిన్లు షుగ‌ర్‌ను త‌గ్గించ‌డంతోపాటు బ‌రువును కూడా చాలా వ‌ర‌కు త‌గ్గిస్తాయి. చాలా మంది ఒక్క ఏడాదిలోనే అనేక కేజీల బ‌రువు త‌గ్గిన‌ట్లు చెబుతున్నారు.

మానేయ‌డానికి కార‌ణాలు ఇవే..

అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ ఔష‌ధాల‌ను వాడ‌డంలో ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని వైద్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఈ ఔష‌ధాలు తీవ్ర‌మైన సైడ్ ఎఫెక్ట్స్‌ను క‌లిగిస్తున్నాయ‌ని అంటున్నారు. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, వికారం, తీవ్ర‌మైన గ్యాస్, అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం లేదా విరేచ‌నాల వంటి స‌మస్య‌లు చాలా మందికి వ‌స్తున్నాయ‌ని తెలియజేస్తున్నారు. అలాగే ఈ మెడిసిన్ల ధ‌ర కూడా చాలా ఎక్కువ‌గా ఉంద‌ని, క‌నుక చాలా మంది క‌నీసం ఏడాది పాటు అయినా వాడ‌కుండానే ఈ మెడిసిన్ల‌ను మానేస్తున్నార‌ని వైద్యులు చెబుతున్నారు. ఇలా జ‌ర‌గ‌డం వ‌ల్ల ఈ మందుల ఫ‌లితాల‌ను చాలా మంది రాబ‌ట్ట‌లేక‌పోతున్నార‌ని అంటున్నారు. అలాగే ఈ మందుల‌ను వాడ‌డం మానేస్తే ఎంత బ‌రువు త‌గ్గారో అంత బరువు చాలా వేగంగా పెరుగుతున్నారని కూడా చెబుతున్నారు. ఇలా ఈ మెడిసిన్ల వాడ‌కంలో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని పేర్కొంటున్నారు. అయితే వీటిని అధిగ‌మించ‌గ‌లిగితే ఎంతో మంది ఊబ‌కాయం, అధిక బ‌రువు, టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని వైద్య నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement