త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GLP-1 Medicine | జీఎల్‌పీ-1 మందుల‌తో కంటి చూపును కోల్పోతారా.. వైద్య నిపుణుల స్ప‌ష్ట‌త‌..

GLP-1 Medicine | ఓజెంపిక్, వెగోవీ, జెప్‌బౌండ్ వంటి ప్రముఖ జీఎల్‌పీ-1 మందులతో అరుదైన ఆకస్మిక కంటిచూపు సమస్యకు సంబంధం ఉందంటూ వస్తున్న నివేదికలు ఆ మందులు వాడుతున్న వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భారతీయ వైద్యులు మాత్రం దీనిపై భయపడాల్సిన అవసరం లేదని, వైద్యుల సలహా లేకుండా మందులను నిలిపివేయడం లేదా మోతాదును మార్చడం చేయకూడదని సూచిస్తున్నారు.

S

Lifestyle | Published On Sep 23, 2026, 5.24 pm IST

GLP-1 Medicine | జీఎల్‌పీ-1 మందుల‌తో కంటి చూపును కోల్పోతారా.. వైద్య నిపుణుల స్ప‌ష్ట‌త‌..
Advertisement

GLP-1 Medicine | ఓజెంపిక్, వెగోవీ, జెప్‌బౌండ్ వంటి ప్రముఖ జీఎల్‌పీ-1 మందులతో అరుదైన ఆకస్మిక కంటిచూపు సమస్యకు సంబంధం ఉందంటూ వస్తున్న నివేదికలు ఆ మందులు వాడుతున్న వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భారతీయ వైద్యులు మాత్రం దీనిపై భయపడాల్సిన అవసరం లేదని, వైద్యుల సలహా లేకుండా మందులను నిలిపివేయడం లేదా మోతాదును మార్చడం చేయకూడదని సూచిస్తున్నారు. ఈ చర్చకు కేంద్రంగా ఉన్న సమస్య నాన్-ఆర్టెరిటిక్ యాంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి, సంక్షిప్తంగా ఎన్‌ఏఐఓఎన్ అని చెబుతున్నారు. కంటి నరానికి రక్త సరఫరా తగ్గినప్పుడు ఏర్పడే ఈ అరుదైన కంటి సమస్యలో సాధారణంగా ఒక కంటిలో అకస్మాత్తుగా, నొప్పి లేకుండా చూపు తగ్గే అవకాశం ఉంటుంది.

అధ్య‌య‌నాల్లో ఏం తేలింది..

సెమాగ్లుటైడ్‌కు ఎన్‌ఏఐఓఎన్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు సూచించాయి. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒక సంబంధం కనిపించడం అంటే ఆ మందే నేరుగా ఈ సమస్యకు కారణమని నిర్ధారించినట్లు కాదు. 2025లో ప్రచురితమైన ఓ విస్తృత పరిశీలనా అధ్యయనంలో సెమాగ్లుటైడ్ లేదా టిర్జెపటైడ్ తీసుకున్న వారిలో రెండు సంవత్సరాల వ్యవధిలో 0.04 శాతం మందికి ఎన్‌ఏఐఓఎన్ కనిపించింది. ఇదే సమయంలో పోలిక కోసం తీసుకున్న మరో సమూహంలో ఈ రేటు 0.02 శాతంగా ఉంది. మరోవైపు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ సెమాగ్లుటైడ్‌కు ఎన్‌ఏఐఓఎన్‌ను చాలా అరుదైన దుష్ప్రభావంగా వర్గీకరించింది. అంటే ఈ సమస్య మందు తీసుకునే ప్రతి 10వేల మందిలో గరిష్ఠంగా ఒకరికి వచ్చే అవకాశం ఉన్న స్థాయిలో ఉందని అర్థం.

ఎన్ఏఐఓఎన్ అంటే..

ఎన్‌ఏఐఓఎన్ అంటే కంటి నరానికి తగినంత రక్తప్రసరణ అందకపోవడం వల్ల వచ్చే ఆప్టిక్ నర్వ్ సమస్య. సాధారణంగా ఇది ఒక కంటిలో అకస్మాత్తుగా, నొప్పి లేకుండా చూపు తగ్గడానికి కారణమవుతుంది. గ్లెనీగల్స్ హాస్పిటల్, ఫోర్టిస్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వి. సోమ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం ఎన్‌ఏఐఓఎన్ చాలా అరుదైన సమస్య అని చెప్పారు. జీఎల్‌పీ-1 మందుల‌ను వాడుతున్నవారు వైద్యుల సలహా లేకుండా చికిత్సను నిలిపివేయకూడదని, కంటి నరానికి రక్తప్రసరణ తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుందని, సెమాగ్లుటైడ్‌కు దీనితో సంబంధం ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు సూచించినప్పటికీ, నేరుగా కారణం-ఫలిత సంబంధం ఇంకా నిర్ధారించలేదని ఆయన తెలిపారు. సాధారణంగా ఎన్‌ఏఐఓఎన్ ఏడాదికి లక్ష మందిలో సుమారు 10 మందికి కనిపించే అరుదైన సమస్యగా ఉంది.

కంటి చూపు పోతుందా..

అయితే జీఎల్‌పీ-1 మందుల వ‌ల్ల కంటి చూపు పోతుందా అంటే.. దీనికి సాధారణంగా అవును లేదా కాదు అనే సమాధానం ఇవ్వడం కష్టం. ఓజెంపిక్, వెగోవీలో సెమాగ్లుటైడ్ ఉండగా, జెప్‌బౌండ్‌లో టిర్జెపటైడ్ ఉంటుంది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ జారీ చేసిన భద్రతా హెచ్చరిక మాత్రం సెమాగ్లుటైడ్ ఉన్న మందులకు, ముఖ్యంగా ఓజెంపిక్, వెగోవీ వంటి మందులకు సంబంధించినది. 2025 జూన్‌లో యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ భద్రతా కమిటీ క్లినికల్ ట్రయల్స్, పరిశీలనా అధ్యయనాలు, మందుల వినియోగం తర్వాత నమోదైన నివేదికలు, వైద్య సాహిత్యాన్ని పరిశీలించిన అనంతరం ఎన్‌ఏఐఓఎన్‌ను సెమాగ్లుటైడ్‌కు చాలా అరుదైన దుష్ప్రభావంగా గుర్తించింది. కొన్ని పెద్ద జనాభా ఆధారిత అధ్యయనాలు సంబంధిత ప్రమాదం సుమారు రెండు రెట్లు పెరిగినట్లు సూచించాయని, అయితే చికిత్స చేసిన ప్రతి 10వేల వ్యక్తుల్లో సుమారు ఒక అదనపు కేసు మాత్రమే నమోదయ్యే స్థాయిలో ఉందని సంస్థ తెలిపింది.

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే జాగ్ర‌త్త‌..

చూపులో అకస్మాత్తుగా వచ్చే మార్పు అత్యంత ముఖ్యమైన హెచ్చరిక సంకేతం. ఎన్‌ఏఐఓఎన్‌లో సాధారణంగా ఒక కంటిలో అకస్మాత్తుగా, నొప్పి లేకుండా చూపు తగ్గ‌తుంది. చూపు వేగంగా క్షీణించడం కూడా కనిపిస్తుంది. జీఎల్‌పీ-1 మందులు తీసుకుంటున్నారా లేదా అన్నదానితో సంబంధం లేకుండా, అకస్మాత్తుగా లేదా కారణం తెలియకుండా చూపు తగ్గితే వెంటనే నేత్ర వైద్య నిపుణుడిని సంప్రదించాలని డాక్టర్ సోమ శ్రీనివాస్ సూచించారు. చూపు అకస్మాత్తుగా లేదా వేగంగా క్షీణిస్తే అది స్వయంగా తగ్గిపోతుందని వేచి చూడకుండా అత్యవసరంగా వైద్య లేదా నేత్ర వైద్య పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.

Advertisement
Advertisement