త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Semaglutide Medicine | బ‌రువు త‌గ్గించే సెమాగ్లూటైడ్ మందులు ఇక చ‌వ‌క ధ‌ర‌ల‌కే.. డాక్ట‌ర్ స‌ల‌హా లేకుండా వాడొద్దు..

Semaglutide Medicine | ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. 2019 గ్లోబ‌ల్ బ‌ర్డెన్ ఆఫ్ డిసీజ్ స్ట‌డీ ప్ర‌కారం టైప్ 2 డ‌యాబెటిస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 6.2 శాతం మంది ప్ర‌జ‌ల‌కు వ‌చ్చింద‌ని, దీని కార‌ణంగా సుమారు 50 కోట్ల మంది ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని తేలింది.

S

Lifestyle | Published On Mar 22, 2026, 11.48 am IST

Semaglutide Medicine | బ‌రువు త‌గ్గించే సెమాగ్లూటైడ్ మందులు ఇక చ‌వ‌క ధ‌ర‌ల‌కే.. డాక్ట‌ర్ స‌ల‌హా లేకుండా వాడొద్దు..
Advertisement

Semaglutide Medicine | ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. 2019 గ్లోబ‌ల్ బ‌ర్డెన్ ఆఫ్ డిసీజ్ స్ట‌డీ ప్ర‌కారం టైప్ 2 డ‌యాబెటిస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 6.2 శాతం మంది ప్ర‌జ‌ల‌కు వ‌చ్చింద‌ని, దీని కార‌ణంగా సుమారు 50 కోట్ల మంది ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని తేలింది. భ‌విష్య‌త్తులో ప‌రిస్థితి మ‌రింత తీవ్ర‌త‌రం అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే టైప్ 2 డ‌యాబెటిస్‌ను త‌గ్గించేందుకు మందులు లేవు. దాన్ని అదుపులో ఉంచేందుకే మందులు ఉన్నాయి. వాటిని జీవితాంతం వాడాల్సిందే. ఇక టైప్ 2 డ‌యాబెటిస్‌కు అనేక ఔషధాలు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ సెమాగ్లుటైడ్ (Semaglutide) ఔష‌ధాలు మాత్రం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నాయి. ఇవి షుగ‌ర్‌ను గ‌ణనీయంగా కంట్రోల్ చేయ‌డ‌మే కాకుండా అధిక బ‌రువును కూడా 15 నుంచి 20 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఎంతో మంది రోగులు ఈ ఔష‌ధాల‌తో స‌త్ఫ‌లితాల‌ను పొందుతున్నారు కూడా. దీంతో ఈ ఔష‌ధాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా డిమాండ్ బాగా పెరిగింది.

రూ.12వేల ఖ‌ర్చు ఇప్పుడు రూ.2వేలే..

టైప్ 2 డ‌యాబెటిస్‌కు ఉప‌యోగించే సెమాగ్లూటైడ్ ఔష‌ధాలు చాలా అధిక ధ‌ర‌తో అందుబాటులో ఉన్నాయి. కేవ‌లం కొద్ది మంది పేషెంట్లు మాత్ర‌మే ఈ మందుల‌ను కొనే స్థోమ‌త‌ను క‌లిగి ఉంటున్నారు. అయితే సెమాగ్లూటైడ్ మందుల‌కు భార‌త్‌లో ఈ నెల 20వ తేదీతో పేటెంట్ ముగియ‌డంతో ప‌లు దేశీయ కంపెనీలు కూడా ఈ మందుల‌కు జ‌న‌రిక్ ఔష‌ధాను విడుద‌ల చేశాయి. స‌న్ ఫార్మా, డాక్ట‌ర్ రెడ్డీస్, జైడ‌స్ లైఫ్ సైన్సెస్ సంస్థ‌లు ఒజెంపిక్‌కు ప్ర‌త్యామ్నాయంగా, చ‌వ‌క ధ‌ర‌ల‌కే జ‌న‌రిక్ సెమాగ్లూటైడ్ ఔష‌ధాల‌ను ప్ర‌వేశపెట్టాయి. దీంతో డ‌యాబెటిస్ రోగుల‌కు ఎంతో మేలు జ‌ర‌గ‌నుంది. చాలా త‌క్కువ ధ‌ర‌కే వారికి సెమాగ్లూటైడ్ ఔష‌ధాలు ల‌భ్యం కానున్నాయి. గ‌తంలో నెల‌కు రూ.12వేలు అయ్యే ఖ‌ర్చు ఇప్పుడు నెల‌కు రూ.2వేలు మాత్ర‌మే కానుంది. ఇది ఎంతో మంది రోగుల‌కు ప్ర‌యోజ‌న‌కరం అవుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే ఈ మందుల వ‌ల్ల ఇంకో ప్ర‌మాదం కూడా పొంచి ఉంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

డాక్ట‌ర్ సూచ‌న లేకుండానే వాడ‌కం..

సెమాగ్లూటైడ్ ఔష‌ధాలు షుగ‌ర్‌ను త‌గ్గించ‌డ‌మే కాకుండా, బ‌రువును గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌డంలో దోహ‌దం చేస్తాయి. దీంతో చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్ లేక‌పోయినా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌న్న కార‌ణంతో ఈ మందుల‌ను వాడుతున్నారు. అయితే ఈ మందులు ఇప్పుడు భార‌త్‌లో మరింత చ‌వ‌క ధ‌ర‌ల‌కు ల‌భ్యం కానుండడంతో ఇంకా ఎక్కువ మంది ఈ మందుల‌ను తీసుకునే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంటున్నారు. అయితే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు ఈ మందుల‌ను వాడితే ఓకే, కానీ స్వ‌త‌హాగా తీసుకుంటే మాత్రం తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో ఈ మందుల ప‌ట్ల అవ‌గాహన పెరుగుతున్న నేప‌థ్యంలో చాలా మంది సెమాగ్లూటైడ్ ఔష‌ధాల‌ను డాక్ట‌ర్ సూచ‌న లేకుండానే వాడుతున్నార‌ని తేలింద‌ని, అలా వాడ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఇక కొంద‌రు డాక్ట‌ర్లు, బ‌రువు త‌గ్గించే డైట్ సెంట‌ర్లు ఈ ఔష‌ధాల‌ను దుర్వినియోగం చేసే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని అంటున్నారు.

దుర్వినియోగం చేసే అవ‌కాశం..

సెమాగ్లూటైడ్ ఔష‌ధాలు మార్కెట్‌లో రెండు ర‌కాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇంజెక్ష‌న్లు, ట్యాబ్లెట్ల రూపంలో ల‌భిస్తున్నాయి. ఖ‌రీదైన సెమాగ్లూటైడ్ ఇంజెక్ష‌న్‌ల‌కు గాను ఆయా దేశీయ ఫార్మా కంపెనీలు తాజాగా చ‌వ‌కైన జ‌న‌రిక్ వెర్ష‌న్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టాయి. కానీ ట్యాబ్లెట్ల‌లో మాత్రం ఇంకా జ‌న‌రిక్ సెమాగ్లూటైడ్ మందులు రాలేదు. అయితే వాటిని కూడా ఫార్మా కంపెనీలు మార్కెట్‌లో జ‌న‌రిక్ వెర్ష‌న్‌ల‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయా మందులు త‌క్కువ ధ‌ర‌ల‌కు ల‌భిస్తే డాక్ట‌ర్ సూచ‌న లేకుండానే చాలా మంది వాడే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలాగే కొంద‌రు డాక్ట‌ర్లు లేదా బ‌రువు త‌గ్గించే డైట్ సెంట‌ర్లు ఈ ఔష‌ధాల‌ను అధికంగా వినియోగించి వాటిని దుర్వినియోగం చేసి ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ముప్పు క‌లిగించే అవ‌కాశం ఉంద‌ని కూడా అంటున్నారు. అందువ‌ల్ల ఈ ఔష‌ధాల వినియోగంపై వారు ప‌లు హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేశారు.

తీవ్ర‌మైన సైడ్ ఎఫెక్ట్స్‌..

సెమాగ్లూటైడ్ ఔష‌ధాలు కూడా ఇత‌ర అల్లోప‌తి మందుల‌లాగే సైడ్ ఎఫెక్ట్స్‌ను ఇస్తాయి. నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వాడ‌క‌పోతే తీవ్ర దుష్పరిణామాలు సంభ‌వించే ప్ర‌మాదం ఉంటుంది. సెమాగ్లూటైడ్ ఔష‌ధాల‌ను వైద్యులు రోగుల‌కు ముందుగా త‌క్కువ డోసుల్లో ఇస్తారు. ఆ డోసుల‌కు రోగులు స్పందించే విధానాన్ని బ‌ట్టి వైద్యులు డోసు పెంచుతూ వెళ్తారు. కాలానుగుణంగా రోగుల‌లో వ‌చ్చే మార్పులు, చికిత్స‌కు స్పందించే తీరు, వ్యాధి త‌గ్గుముఖం ప‌ట్టే ప‌రిస్థితి వంటి అంశాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బేరీజు వేసి రోగుల‌కు డోసుల‌ను త‌ర‌చూ మారుస్తారు. ఇలా ఈ ఔష‌ధాల‌తో చికిత్స చేస్తారు. అందువ‌ల్ల ఇవేవీ తెలియ‌కుండా రోగులు త‌మంత‌ట తామే ఈ ఔష‌ధాల‌ను వాడ‌డం ప్ర‌మాక‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక సెమాగ్లూటైడ్ ఔష‌ధాలను వాడ‌డం మొద‌లు పెట్టిన త‌రువాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, ఆహారం అస‌లు తిన‌క‌పోవ‌డం, ఆక‌లి పూర్తిగా త‌గ్గ‌డం లేదా ఆక‌లి లేక‌పోవ‌డం, విరేచ‌నాలు లేదా మ‌ల‌బ‌ద్ద‌కం అవ‌డం, త‌ల‌నొప్పి, త‌ల‌తిర‌గ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. రోగులు ఔష‌ధ చికిత్స‌కు స్పందిస్తే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కొద్ది రోజుల‌కు వాటంత‌ట అవే మాయ‌మ‌వుతాయి. కానీ సైడ్ ఎఫెక్ట్స్ అస‌లు ఎంత‌కూ త‌గ్గ‌డం లేదంటే రోగుల‌కు వైద్యులు చికిత్స‌ను ఆపేస్తారు. క‌నుక రోగులు ఇవి తెలియ‌కుండా సొంతంగా చికిత్స చేసుకోకూడ‌దు.

వీరు వాడ‌కూడ‌దు..

సెమాగ్లూటైడ్ ఔష‌ధాలు కొంద‌రిలో తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్‌ను క‌లిగించే ప్ర‌మాదం ఉంటుంది. ఈ ఔష‌ధాల‌ను వాడ‌డం వ‌ల్ల క్లోమ‌గ్రంథి (ప్యాంక్రియాస్‌) వాపులు రావ‌డం, పిత్తాశ‌య స‌మ‌స్య‌లు, తీవ్ర‌మైన జీర్ణ స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌డం, థైరాయిడ్ స‌మ‌స్య‌లు రావడం జ‌రుగుతుంది. క‌నుక వైద్యుల స‌ల‌హా లేకుండా సెమాగ్లూటైడ్ ఔష‌ధాల‌ను వాడ‌డం అత్యంత ప్ర‌మాద‌కరం. మందులు చ‌వ‌క‌గా ల‌భిస్తున్నాయ‌ని, బ‌రువు త‌గ్గిస్తాయ‌ని చాలా మంది వీటిని వాడాల‌ని చూస్తున్నార‌ని, అది మంచిది కాద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క్లోమ‌గ్రంథి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, థైరాయిడ్ క్యాన్స‌ర్ ఉన్నా, తీవ్ర‌మైన జీర్ణ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు, టైప్ 1 డ‌యాబెటిస్ ఉన్న‌వారు సెమాగ్లూటైడ్ మందుల‌ను వాడ‌కూడ‌దు. త‌క్కువ ధ‌ర‌ల‌కు ల‌భిస్తున్నా డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాకే ఎవ‌రైనా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సొంతంగా వైద్యం చేసుకోవ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌రం.

Advertisement

తాజావార్తలు

Advertisement