త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Water Quality Test | మనం తాగుతున్న నీళ్లు సుర‌క్షిత‌మేనా..? ఇంట్లోనే నీటి నాణ్య‌త‌ను ఇలా టెస్ట్ చేయండి..!

Water Quality Test | మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్‌లో చోటు చేసుకున్న విషాద‌క‌ర ఘ‌ట‌న‌లో 15 మంది ప్రాణాల‌ను కోల్పోయిన విష‌యం తెలిసిందే. అలాగే ఈ ఘ‌ట‌న‌లో మ‌రికొంద‌రు ప్రాణాపాయ ప‌రిస్థితిలో హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. క‌లుషిత నీటిని తాగ‌డం వ‌ల్లే ఈ దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం అంద‌రినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

S

Lifestyle | Published On Jan 4, 2026, 6.59 am IST

Water Quality Test | మనం తాగుతున్న నీళ్లు సుర‌క్షిత‌మేనా..? ఇంట్లోనే నీటి నాణ్య‌త‌ను ఇలా టెస్ట్ చేయండి..!
Advertisement

Water Quality Test | మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్‌లో చోటు చేసుకున్న విషాద‌క‌ర ఘ‌ట‌న‌లో 15 మంది ప్రాణాల‌ను కోల్పోయిన విష‌యం తెలిసిందే. అలాగే ఈ ఘ‌ట‌న‌లో మ‌రికొంద‌రు ప్రాణాపాయ ప‌రిస్థితిలో హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. క‌లుషిత నీటిని తాగ‌డం వ‌ల్లే ఈ దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం అంద‌రినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. స్థానికంగా ఉన్న కొన్ని కాల‌నీల‌కు మురికి నీళ్లు స‌ర‌ఫ‌రా అయ్యాయ‌ని, ఆ విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలియ‌లేద‌ని, ఈ క్ర‌మంలోనే ఆ నీళ్ల‌ను తాగిన కొంద‌రు కాల‌నీల వాసులు అస్వ‌స్థ‌తకు గుర‌వ్వ‌డ‌మే కాక‌, కొంద‌రు చ‌నిపోయార‌ని అధికారులు త‌మ నివేదిక‌లో వెల్ల‌డించారు. వారికి కొంత కాలంగా మురికి నీరు స‌ర‌ఫ‌రా అవుతుంద‌ని, అందుక‌నే ఈ దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని అధికారులు తెలిపారు.

ప‌లు ర‌కాలుగా టెస్ట్ చేయాలి..

అయితే రోజూ ప్ర‌జ‌లు తాము తాగే నీటిని క‌చ్చితంగా ప‌రిశీలించాల‌ని, అలా చేయ‌కుండా నీటిని తాగితే అలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇళ్ల‌లో మ‌నం తాగేందుకు ఉప‌యోగించే నీళ్ల‌ను ప‌లు ర‌కాలుగా ప‌రీక్షించాల‌ని, అప్పుడు నీటి నాణ్య‌త తెలుస్తుంద‌ని, దీంతో ఇలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ముందుగానే చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని వారు తెలిపారు. నీటి నాణ్య‌త‌, ఆ నీరు క‌లుషితం అయిందా, లేదా అన్న వివ‌రాల‌ను తెలియ‌జేసేందుకు ప‌లు కిట్లు మ‌న‌కు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయ‌ని వివ‌రించారు. ఈ కిట్ల‌ను ఉప‌యోగించి నీళ్ల‌ను ప‌రీక్షిస్తే క‌లుషిత‌మైన నీరు గురించి సుల‌భంగా తెలిసిపోతుంద‌ని, దీంతో అలాంటి నీళ్ల‌ను తాగ‌కుండా ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చ‌ని అన్నారు.

అనేక కిట్స్ అందుబాటులో..

నీటి నాణ్య‌త‌ను ప‌రీక్షించేందుకు మన‌కు ప‌లు ర‌కాల కిట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కోలిఫామ్ అండ్ ఈ.కోలి టెస్ట్ కిట్ కూడా ఒక‌టి. ఇది నీటిలో ఉన్న కాలుష్య కార‌కాలు, సూక్ష్మ జీవులను సుల‌భంగా గుర్తిస్తుంది. 90 శాతం వ‌ర‌కు క‌చ్చిత‌త్వంతో కూడిన ఫ‌లితాల‌ను ఇస్తుంది. దీని వ‌ల్ల మురికి నీళ్ల‌ను గుర్తించ‌వ‌చ్చు. నీటిలో బ్యాక్టీరియా మోతాదు ఎంత ఉంది అన్న విష‌యం తెలిసిపోతుంది. ఈ టెస్టు కిట్ ద్వారా నీళ్ల‌ను ప‌రీక్ష చేస్తే 18 నుంచి 24 గంట‌ల్లోగా ఫ‌లితం వ‌స్తుంది. అలాగే క్లోరిన్ టెస్టింగ్ కిట్ కూడా మ‌న‌కు అందుబాటులో ఉంది. సాధార‌ణంగా మ‌న‌కు స‌ర‌ఫ‌రా అయ్యే మున్సిప‌ల్ నీటిలో సూక్ష్మ‌జీవుల‌ను నిర్మూలించేందుకు క్లోరిన్‌ను క‌లుపుతారు. ఈ క్ర‌మంలో మ‌నం తాగే నీటిలో క్లోరిన్ ఉందా, లేదా అనే విష‌యాన్ని ఈ కిట్ ద్వారా తెలుసుకోవచ్చు. సాధార‌ణంగా క్లోరిన్ క‌ల‌ప‌బ‌డిన నీళ్ల‌ను తాగ‌డానికి ఉత్త‌మ‌మైన‌విగా వైద్యులు చెబుతున్నారు. క‌నుక ఈ కిట్ ద్వారా కూడా నీటి నాణ్య‌త‌ను గుర్తించ‌వ‌చ్చు.

భిన్న ర‌కాలుగా ఉప‌యోగం..

ట‌ర్బైడిటీ టెస్ట్ ట్యూబ్ అనే మ‌రో కిట్ కూడా మ‌న‌కు ల‌భిస్తోంది. దీని స‌హాయంతో నీటిలో ఉన్న కాలుష్య కార‌కాలు లేదా మురికిని గుర్తించ‌వ‌చ్చు. నీరు మురికిగా ఉందా, శుభ్రంగా ఉందా.. అన్న విష‌యం ఈ కిట్ ద్వారా తెలుస్తుంది. దీంతో నీళ్లు స్వ‌చ్ఛంగానే ఉన్నాయా, మురికిగా ఉన్నాయా అన్న విష‌యం తెలిసిపోతుంది. నీళ్లు మురికిగా ఉన్నాయ‌ని తేలితే అలాంటి నీటిని తాగ‌కుండా ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌చ్చు. ఇలా ఈ కిట్ ప‌నిచేస్తుంది. ఇక ఆయా వాట‌ర్ టెస్టింగ్ కిట్ లు మ‌న‌కు భిన్న ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే కిట్‌ను బ‌ట్టి దాని నుంచి వ‌చ్చే ఫ‌లితానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఈ కిట్స్ ద్వారా మ‌నం తాగే నీరు ఎంత స్వ‌చ్ఛంగా ఉంది..? అన్న విష‌యం చాలా సుల‌భంగా తెలిసిపోతుంది. దీంతో ఇండోర్ లాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వచ్చు.

టీడీఎస్ లెవ‌ల్స్ కూడా..

అయితే మ‌నం తాగే నీటిలో మిన‌ర‌ల్స్ ఏమేర ఉన్నాయో తెలిపేందుకు మ‌రో కిట్ కూడా అందుబాటులో ఉంది. దీన్నే టీడీఎస్ (టోట‌ల్ డిస్సాల్వ్‌డ్ సాలిడ్స్‌) మీట‌ర్ అని కూడా అంటారు. అయితే ఇత‌ర టెస్టు కిట్‌ల‌తో పోలిస్తే ఇది కాస్త భిన్న‌మైంది. దీని ద్వారా నీళ్ల‌ను టెస్ట్ చేస్తే ఫ‌లితం కొన్ని క్ష‌ణాల్లోనే వ‌స్తుంది. టీడీఎస్ మీట‌ర్ ద్వారా నీటి టీడీఎస్ స్థాయిల‌ను గుర్తించ‌వచ్చు. టీడీఎస్ మీట‌ర్‌లో టీడీఎస్ లెవ‌ల్స్ 300 ఎంజీ ప‌ర్ లీట‌ర్ లేదా అంత‌క‌న్నా త‌క్కువ రావాలి. అలాంటి నీళ్ల‌ను స్వ‌చ్ఛ‌మైన‌విగా భావిస్తారు. నీటిలో ల‌వ‌ణాల శాతం అధికంగా ఉంటే అలాంటి నీటిని తాగ‌కూడ‌దు. అలాంటి నీరు మ‌న‌కు అప్ప‌టిక‌ప్పుడు ఎలాంటి దుష్ప్ర‌భావాల‌ను క‌లిగించ‌దు. కానీ దీర్ఘ‌కాలికంగా అలాంటి నీటిని వాడితే మాత్రం క‌చ్చితంగా శ‌రీర ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డుతుంది. క‌నుక మనం టీడీఎస్ లెవ‌ల్స్‌ను కూడా త‌ర‌చూ చెక్ చేస్తుండాలి. ఇక టీడీఎస్ స్థాయిలు 300 నుంచి 600 మ‌ధ్య ఉంటే ఆ నీళ్ల‌లో ల‌వ‌ణాల మోతాదు కాస్త ఎక్కువ‌గా ఉంద‌ని అర్థం. అలాంటి నీళ్ల‌ను తాగ‌కూడ‌దు. కానీ శ‌రీర అవ‌స‌రాల‌కు ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇక టీడీఎస్ స్థాయిలు 600 క‌న్నా అధికంగా ఉంటే అలాంటి నీళ్ల‌ను ఏ ప‌నికి కూడా ఉప‌యోగించకూడ‌దు. అవి మ‌న‌కు అన్ని ర‌కాలుగా హాని చేస్తాయి. ఇలా ఆయా టెస్టు కిట్‌ల ద్వారా నీటి నాణ్య‌త‌ను గుర్తించి మ‌న ఆరోగ్యాన్ని ర‌క్షించుకోవ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement