త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pumpkin Seeds | రోజూ గుమ్మ‌డి విత్త‌నాల‌ను తింటే గుండె ఆరోగ్యం ప‌దిలం.. వెల్ల‌డించిన న్యూట్రిష‌నిస్టు..

Pumpkin Seeds | రోజూ సాయంత్రం స‌మ‌యంలో చాలా మంది స్నాక్స్ పేరిట చిరు తిళ్ల‌ను తింటుంటారు. నూనెలో వేయించిన ఆహారాలు, స్వీట్లు, కేక్‌లు, బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్‌ను అధికంగా తింటారు. ఇవ‌న్నీ ఆరోగ్యానికి అత్యంత హాని చేస్తాయ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. సాయంత్రం స‌మ‌యంలో ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌ను తింటే ఎంతో ఉప‌యోగం ఉంటుంద‌ని అంటున్నారు.

S

Lifestyle | Published On Feb 23, 2026, 8.41 am IST

Pumpkin Seeds | రోజూ గుమ్మ‌డి విత్త‌నాల‌ను తింటే గుండె ఆరోగ్యం ప‌దిలం.. వెల్ల‌డించిన న్యూట్రిష‌నిస్టు..
Advertisement

Pumpkin Seeds | రోజూ సాయంత్రం స‌మ‌యంలో చాలా మంది స్నాక్స్ పేరిట చిరు తిళ్ల‌ను తింటుంటారు. నూనెలో వేయించిన ఆహారాలు, స్వీట్లు, కేక్‌లు, బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్‌ను అధికంగా తింటారు. ఇవ‌న్నీ ఆరోగ్యానికి అత్యంత హాని చేస్తాయ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. సాయంత్రం స‌మ‌యంలో ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌ను తింటే ఎంతో ఉప‌యోగం ఉంటుంద‌ని అంటున్నారు. అలాంటి స్నాక్స్‌లో గుమ్మ‌డికాయ విత్త‌నాలు ముఖ్య పాత్ర పోషిస్తాయ‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు బెంగ‌ళూరులోని నాగ‌ర్భావిలో ఉన్న ఫోర్టిస్ హాస్పిట‌ల్ న్యూట్రిష‌నిస్ట్ డాక్ట‌ర్ భార‌తి కుమార్ గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తిన‌డంపై ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. గుమ్మ‌డి విత్త‌నాల్లో పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయ‌ని తెలిపారు. వీటిని రోజూ ఒక టేబుల్ స్పూన్ మోతాదులో పెనంపై కాస్త వేయించి సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ రూపంలో తింటే మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు.

గుండె జ‌బ్బులు రాకుండా..

గుమ్మ‌డికాయ విత్త‌నాల్లో ఫైబ‌ర్‌తోపాటు ఫైటోస్టెరాల్స్ అనే స‌మ్మేళ‌నాలు, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌)ను పెంచుతాయి. ఈ విత్త‌నాల్లో ఉండే మెగ్నిషియం, పొటాషియం ర‌క్త నాళాల‌ను వెడ‌ల్పుగా చేస్తాయి. దీని వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను దీర్ఘ‌కాలంపాటు ఆహారంలో భాగం చేసుకుంటే ర‌క్త‌నాళాల గోడ‌ల‌కు జ‌రిగే న‌ష్టాన్ని నివారించ‌వ‌చ్చు. ఇది గుండె జ‌బ్బులు రాకుండా అడ్డుకుంటుంది. గుండె కండ‌రాలు వాపుల‌కు గుర‌య్యే ప్ర‌భావం త‌గ్గుతుంది. దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్‌ల‌ను నివారించ‌వ‌చ్చు. గుమ్మ‌డి విత్త‌నాల్లో ప్రోటీన్లు, ఫైబ‌ర్ అధిక మొత్తాల్లో ఉంటాయి. ఇవి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. దీంతో డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది.

ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

గుమ్మ‌డి విత్త‌నాల‌ను నేరుగా తిన‌డం ఇష్టం లేక‌పోతే వాటిని ఓట్స్‌, స్మూతీలు వంటి ఆహారాల‌పై చ‌ల్లుకుని తీసుకోవ‌చ్చ‌ని డాక్ట‌ర్ భార‌తి కుమార్ తెలిపారు. స్మూతీ బౌల్స్, స‌లాడ్స్‌, ఓట్ మీల్‌, సిరియ‌ల్స్‌, ఎనర్జీ బార్స్‌, పెరుగు వంటి ఆహారాల‌పై గుమ్మ‌డి విత్త‌నాల‌ను చ‌ల్లి తీసుకోవ‌చ్చు. ఈ విత్త‌నాల్లో కొవ్వులు ఉంటాయి క‌నుక నేరుగా తింటే కొంద‌రికి వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అందువ‌ల్ల ఈ విత్త‌నాల‌ను పెనంపై కాస్త వేయించి తింటే ఆయా స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. గుమ్మ‌డి విత్త‌నాలు అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉన్న‌ప్పటికీ వీటిని రోజూ ఒక టేబుల్ స్పూన్‌కు మించి తీసుకోకూడ‌ద‌ని డాక్ట‌ర్ కుమార్ తెలిపారు. గుమ్మ‌డి విత్త‌నాల‌లో సోడియం అధికంగా ఉంటుంది. క‌నుక సోడియం ఉండే ఇత‌ర ఆహారాల‌ను తీసుకోవ‌డం మానేయాలి. లేదంటే శ‌రీరంలో సోడియం స్థాయిలు పెరిగి ర‌క్త‌పోటు స‌మ‌స్య అధిక‌మ‌వుతుంది. జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, జింక్‌, మెగ్నిషియం సప్లిమెంట్ల‌ను వాడుతున్న వారు డాక్ట‌ర్‌ను సంప్ర‌దించిన అనంత‌రం ఈ గింజ‌ల‌ను తినాల‌ని డాక్ట‌ర్ కుమార్ చెప్పారు.

Advertisement
Advertisement