త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Superbugs In Delhi Air | ఢిల్లీలోని గాలిలో ప్ర‌మాద‌క‌ర‌ ‘సూప‌ర్ బ‌గ్స్‌’.. అస‌లేంటివి..?

Superbugs In Delhi Air | ఢిల్లీలో వాయు కాలుష్యం ప్ర‌తి ఏటా అక్క‌డి ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కాలుష్యం కార‌ణంగా ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే ఇది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు ఢిల్లీ వాసుల‌ను మ‌రో కొత్త స‌మ‌స్య భ‌య‌పెడుతోంది.

S

Lifestyle | Published On Jan 6, 2026, 11.27 am IST

Superbugs In Delhi Air | ఢిల్లీలోని గాలిలో ప్ర‌మాద‌క‌ర‌ ‘సూప‌ర్ బ‌గ్స్‌’.. అస‌లేంటివి..?
Advertisement

Superbugs In Delhi Air | ఢిల్లీలో వాయు కాలుష్యం ప్ర‌తి ఏటా అక్క‌డి ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కాలుష్యం కార‌ణంగా ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే ఇది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు ఢిల్లీ వాసుల‌ను మ‌రో కొత్త స‌మ‌స్య భ‌య‌పెడుతోంది. ఢిల్లీలోని గాలిలో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన బ్యాక్టీరియా మోతాదుకు మించి ఉంద‌ని, దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో తేలింది. ఈ మేర‌కు ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కు చెందిన ప‌రిశోధ‌కులు గ‌త ఏడాది కాలంలో అక్క‌డి గాలిపై ప‌రిశోధ‌న‌లు చేశారు. గాలిలో ఓ ర‌క‌మైన బ్యాక్టీరియా మోతాదు ఏ మేర‌కు ఉంది అనే విష‌యాల‌ను తెలుసుకునేందుకు వారు ఆ ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించారు. దీంతో వారి ప‌రిశోధ‌న‌ల్లో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

అధిక మోతాదులో ఆ బ్యాక్టీరియా..

జేఎన్‌యూ ప‌రిశోధ‌కులు గ‌త ఏడాది కాలంలో ఢిల్లీలోని ప‌లు చోట్ల గాలి శాంపిల్స్‌ను తీసి వాటిలోని బ్యాక్టీరియా మోతాదును ప‌రిశీలించారు. ఢిల్లీలో ఉన్న బ‌హిరంగ ప్ర‌దేశాలు, జ‌న సాంద్ర‌త అధికంగా ఉండే ప‌లు చోట్ల‌లో, మురికి వాడ‌ల్లో, ప్ర‌జ‌ల నివాసాల్లో లోప‌ల‌, బ‌య‌ట‌, జేఎన్‌యూ క్యాంప‌స్ ఆవ‌ర‌ణ‌లోని సివ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ వ‌ద్ద గాలి శాంపిల్స్‌ను వారు సేక‌రించారు. అనంత‌రం ఆ శాంపిల్స్‌లో ఉండే బ్యాక్టీరియా మోతాదును వారు ప‌రీక్షించారు. వేస‌వి, వ‌ర్షాకాలం, చ‌లికాలాల్లో వారు వ‌రుస‌గా ఈ శాంపిల్స్‌ను సేక‌రించారు. ఈ క్ర‌మంలో ఢిల్లీలో చాలా చోట్ల గాలిలో Staphylococcus అనే వ‌ర్గానికి చెందిన బ్యాక్టీరియా అధిక మోతాదులో ఉంద‌ని తేల్చారు. ఈ బ్యాక్టీరియా మ‌నుషుల‌కు వ్యాప్తి చెందితే చ‌ర్మ వ్యాధులు, చర్మ ఇన్ఫెక్ష‌న్లు, న్యుమోనియా, ర‌క్త సంబంధ ఇన్‌ఫెక్ష‌న్లు వంటి వ్యాధులు వ‌స్తాయ‌ని చెప్పారు.

యాంటీ బ‌యాటిక్స్ కు సైతం లొంగ‌డం లేదు..

ఈ బ్యాక్టీరియా ఇత‌ర బ్యాక్టీరియాల మాదిరిగా లేద‌ని, యాంటీ బ‌యాటిక్ డ్ర‌గ్స్‌ను సైతం 73 శాతం వ‌ర‌కు త‌ట్టుకుని జీవించ‌గ‌లుగుతున్నాయ‌ని, క‌నుక ఈ బ్యాక్టీరియా కార‌ణంగా ఏదైనా వ్యాధి సోకితే దాన్ని త‌గ్గించ‌డం కూడా క‌ష్ట‌త‌రంగా మారుతుంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. ఈ బ్యాక్టీరియా ప‌ట్ల ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. వీటిని కూడా నాశ‌నం చేసే విధంగా నూతన త‌ర‌హా ఔష‌ధాల‌ను త‌యారు చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ యాంటీ బ‌యాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నాయ‌ని, ఇలాంటి త‌రుణంలో ఢిల్లీలోని ఈ బ్యాక్టీరియా సైంటిస్టుల‌కు కొత్త స‌వాల్ విసురుతుంద‌ని అన్నారు.

ఢిల్లీలో అందుక‌నే పెరిగింది..

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప‌రిమితి ప్ర‌కారం గాలిలో ఒక క్యూబిక్ మీట‌ర్‌కు బ్యాక్టీరియా కౌంట్ 1వేయి కాల‌నీ ఫామింగ్ యూనిట్లుగా ఉండాలి. కానీ ఢిల్లీలోని గాలిలో మాత్రం ఈ ప‌రిమాణం 16వేలుగా ఉంది. అంటే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప‌రిమితి క‌న్నా ఇది 16 రెట్లు అధికం కావడం గ‌మ‌నార్హం. కాగా ఢిల్లీ గాలిలో ఉన్న ఈ బ్యాక్టీరియా అనేక యాంటీ బ‌యాటిక్ ఔష‌ధాల‌ను కూడా చాలా వ‌ర‌కు త‌ట్టుకునేవిగా ఉండ‌డంతో వీటిని యాంటీ బ‌యాటిక్ రెసిస్టెంట్ సూప‌ర్‌బ‌గ్స్‌గా పిలుస్తున్నారు. ఇక ఈ బ్యాక్టీరియా వ‌ర్షాకాలంలో మాత్రం వ‌ర్షాలు కుర‌వ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని, కానీ చ‌లికాలం, వేస‌వి కాలాల్లో మాత్రం కేవ‌లం బయ‌ట మాత్ర‌మే కాకుండా ఇళ్ల‌లో కూడా అధిక సంఖ్య‌లో ఉంటుంద‌ని తెలిపారు. అలాగే చ‌ల్లని వాతావ‌ర‌ణం, గాలి ఎక్క‌డికీ వెళ్ల‌కుండా ఒకే చోట చాలా సేపు ఉండ‌డం, కాలుష్యం వంటి కార‌ణాల్ల కూడా ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంద‌ని, ఢిల్లీలో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం అధికంగా ఉంద‌ని తేల్చారు. అయితే రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారికి, తీవ్ర‌మైన శ్వాస స‌మ‌స్య‌లు లేదా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న‌వారికి, గాయాలు, పుండ్లు అయి క‌ట్టు స‌రిగ్గా క‌ట్టుకోని వారికి, వృద్ధులు, పిల్ల‌ల‌కు ఈ బ్యాక్టీరియా సోకే ప్ర‌మాదం అధికంగా ఉంటుంద‌ని, దీని వ‌ల్ల అలాంటి వారు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెప్పారు. ఇక జేఎన్‌యూ ప‌రిశోధ‌కులు చేసిన ఈ ప‌రిశోధ‌న‌ల‌కు చెందిన వివ‌రాల‌ను నేచ‌ర్ - సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement