త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oral Cancer | నోటి క్యాన్స‌ర్ కేసుల్లో భార‌త్ టాప్‌.. ముందుగానే గుర్తిస్తే ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు..

Oral Cancer | దేశంలో నోటి క్యాన్సర్ ఓ పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారింది. ముఖ్యంగా పురుషులలో ఇది అత్యంత సాధారణంగా క‌నిపిస్తోంది. చికిత్సలో పురోగతి ఉన్నప్పటికీ ఈ వ్యాధిని ముందుగా గుర్తించ‌డంపైనే జీవనావకాశాలు ఆధార‌ప‌డి ఉంటున్నాయి. నోటి క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా ఈ విష‌యంపై నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు.

S

Lifestyle | Published On Apr 1, 2026, 12.05 pm IST

Oral Cancer | నోటి క్యాన్స‌ర్ కేసుల్లో భార‌త్ టాప్‌.. ముందుగానే గుర్తిస్తే ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు..
Advertisement

Oral Cancer | దేశంలో నోటి క్యాన్సర్ ఓ పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారింది. ముఖ్యంగా పురుషులలో ఇది అత్యంత సాధారణంగా క‌నిపిస్తోంది. చికిత్సలో పురోగతి ఉన్నప్పటికీ ఈ వ్యాధిని ముందుగా గుర్తించ‌డంపైనే జీవనావకాశాలు ఆధార‌ప‌డి ఉంటున్నాయి. నోటి క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా ఈ విష‌యంపై నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా నిర్ధారణ కావడం వల్లే ఎక్కువగా ప్రాణనష్టం జరుగుతోంద‌ని వారు చెబుతున్నారు. ముఖ్యంగా పొగ త్రాగడం, గుట్కా వంటి ప‌దార్థాల‌ వినియోగం అధికంగా ఉన్న కార‌ణంగా దేశంలో ఇది పెద్ద సమస్యగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చి (ICMR) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న నోటి క్యాన్సర్ కేసుల్లో భారత్‌లోనే అధికంగా ఉంటున్నాయ‌ని తేలింది. పొగాకు నమలడం, ధూమపానం, మద్యం సేవించడం వంటి జీవనశైలి అల‌వాట్లే ఇందుకు ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వంటి ఇన్ఫెక్షన్ల కార‌ణంగా కూడా కొన్ని కేసులు న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా యువతలో సంప్రదాయ రిస్క్ ఫ్యాక్టర్లు లేకపోయినా ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటోంద‌ని గుర్తించారు.

ప్రారంభ ద‌శ‌లో గుర్తిస్తే 90 శాతం వ‌ర‌కు జీవ‌నావ‌కాశాలు..

నోటి క్యాన్సర్ ప్రమాదకరంగా మార‌డానికి ప్రధాన కారణం దీన్ని ప్రారంభ దశలో గుర్తించ‌క‌పోవ‌డ‌మేన‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది సైలెంట్ కిల్ల‌ర్‌గా వ్యాపిస్తోంది. ప్రారంభ దశలో అయ్యే గాయాలు నొప్పిలేకుండా ఉండడంతో చాలా మంది వాటిని పట్టించుకోవ‌డం లేదు. ఫలితంగా వ్యాధి తీవ్ర దశకు చేరుకున్న తర్వాతే గుర్తిస్తున్నారు. అయితే ప్రారంభ దశలో గుర్తిస్తే 90 శాతం వరకు జీవనావకాశాలు ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక నోటి క్యాన్సర్ కేసులు ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. WHO ప్రకారం పొగాకు వినియోగమే ఇందుకు ప్రధాన కారణమ‌ని తేలింది. గుట్కా, ఖైనీ వంటి ఉత్పత్తులు ఇంకా ప్రమాదకరంగా మారాయి. ఫ‌రీదాబాద్ ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ ఆంకాలజీ డాక్ట‌ర్ సిద్ధార్థ్ శంకర్ సూద్ మాట్లాడుతూ దేశంలో పురుషుల్లో నోటి క్యాన్సర్ అత్యంత సాధారణంగా మారింద‌ని అన్నారు. ఇందులో ఎక్కువ కేసులు పొగాకు, మద్యం వినియోగం కార‌ణంగానే న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. పొగాకు, మద్యం కలిసి ఉపయోగించడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతుంద‌ని తెలిపారు.

యువ‌తలో క‌నిపిస్తున్న HPV కేసులు..

అయితే ఇప్పుడు ఈ క్యాన్స‌ర్‌ ప్రమాదం త‌న‌ స్వరూపాన్ని మార్చుకుంది. యువతలో, ముఖ్యంగా సంప్రదాయ రిస్క్ ఫ్యాక్టర్లు లేకపోయినా HPV ఇన్ఫెక్షన్‌తో సంబంధం ఉన్న కేసులు కనిపిస్తున్నాయ‌ని డాక్ట‌ర్ శంక‌ర్ సూద్‌ తెలిపారు. నోటి క్యాన్సర్ చికిత్స‌లో వ్యాధిని ముందుగా గుర్తించారా, లేదా అన్న‌ది ముఖ్యమైన అంశమ‌ని, నిర్ధారణ త‌రువాత జీవనావకాశాలను నిర్ణ‌యిస్తార‌ని తెలిపారు. ప్రారంభ దశ (Stage I, II) లో క్యాన్సర్ పూర్తిగా నయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ‌ని, ఈ దశలో శస్త్రచికిత్సతోనే 5 సంవత్సరాల జీవనావకాశాలు 80-90 శాతం వరకు పెరుగుతాయ‌ని తెలిపారు. అధునాతన దశ (Stage IV)లో చికిత్స కష్టతరమవుతుంద‌ని, ఈ దశలో 5 సంవత్సరాల జీవనావకాశం సుమారు 40 శాతానికి పడిపోతుంద‌ని ఆయన వివరించారు.

ల‌క్ష‌ణాలు సూక్ష్మంగా ఉంటాయి..

నోటి క్యాన్సర్‌ను ప్రారంభంలో గుర్తించ‌డం క‌ష్టంగా ఉంటుంద‌ని, ల‌క్ష‌ణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయ‌ని డాక్ట‌ర్ సూద్ తెలిపారు. నొప్పి లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది వాటిని ప‌ట్టించుకోర‌ని అన్నారు. ప్రారంభ ద‌శ నుంచి తీవ్ర‌మైన ద‌శ‌కు రావ‌డం నెమ్మ‌దిగా జ‌రుగుతుంద‌ని, నొప్పి లేక‌పోవ‌డం వ‌ల్ల రోగులు ల‌క్ష‌ణాల‌ను విస్మ‌రిస్తార‌ని అన్నారు. నోటి క్యాన్స‌ర్ ప్రారంభ ద‌శ‌లో నోట్లో గాయాలు మాన‌కుండా కొన్ని రోజులు లేదా నెల‌ల పాటు అలాగే ఉంటాయ‌ని, నాలుక‌పై ఎరుపు లేదా తెల్ల‌ని మ‌చ్చ‌లు క‌నిపిస్తాయ‌ని తెలిపారు. నిరంత‌ర నొప్పి లేదా అసౌక‌ర్యం ఉంటుంద‌ని, ఆహారాలు మింగ‌డం లేదా న‌మ‌ల‌డం క‌ష్టంగా అనిపిస్తుంద‌ని అన్నారు. 3 వారాల క‌న్నా ఎక్కువ‌గా మాన‌ని గాయం ఉంటే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు. నోటి క్యాన్స‌ర్‌ను ముందుగానే గుర్తిస్తే ప్ర‌భావ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని, ఈ ద‌శ‌లో చికిత్స సుల‌భంగా, త‌క్కువ ఖ‌ర్చుతో, త‌క్కువ వ్య‌వ‌ధితో, ఎక్కువ ఫ‌లితాల‌తో ఉంటుంద‌న్నారు.

నివార‌ణే అత్యుత్త‌మ మార్గం..

ICMR సూచనల ప్రకారం పొగాకు న‌మిలే వారు లేదా పొగ తాగేవారు, గుట్కా, ఖైనీ తినేవారు క్రమం తప్పకుండా నోటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల నోటి క్యాన్స‌ర్‌ను ముందుగానే గుర్తించే అవ‌కాశాలు ఉంటాయి. అయితే గుర్తింపు ముఖ్య‌మే అయిన‌ప్ప‌టికీ నివార‌ణే అత్యుత్త‌మ మార్గ‌మ‌ని తెలిపారు. WHO, ICMR తెలిపిన ప్ర‌కారం పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. మ‌ద్యం వినియోగాన్ని త‌గ్గించాలి. నోటి శుభ్ర‌త‌ను పాటించాలి. గుట్కా, ఖైనీ వంటి ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. అవ‌స‌రం అయితే HPV టీకా తీసుకోవాలి. పొగాకు వినియోగాన్ని త‌గ్గించ‌డం లేదా పూర్తిగా మానేయ‌డం ద్వారా చాలా వ‌ర‌కు నోటి క్యాన్స‌ర్ కేసుల‌ను ముందుగానే అడ్డుకోవ‌చ్చు. నోటి క్యాన్స‌ర్ తీవ్ర‌మైన వ్యాధి అయిన‌ప్ప‌టికీ ఆయా జాగ్ర‌త్త‌లు పాటిస్తే దీన్ని రాకుండా నివారించ‌వ‌చ్చు. ప్రారంభ ద‌శ‌లో గుర్తించినా కూడా ఉప‌యోగం ఉంటుంది. చివ‌రి ద‌శ‌లో గుర్తిస్తే మాత్రం జీవ‌నావ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయి. సూక్ష్మ ల‌క్ష‌ణాలు అయినా స‌రే గుర్తిస్తే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటే క్యాన్స‌ర్ బారి నుంచి ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు.

Advertisement
Advertisement