త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heart Diseases | ఫిట్‌గా ఉన్నాం, గుండె జ‌బ్బులు రావ‌ని అనుకోకండి.. ఇది తెలిస్తే, ఇంకా జాగ్ర‌త్త‌గా ఉంటారు..!

Heart Diseases | నిన్న మొన్న‌టి వ‌ర‌కు గుండె జ‌బ్బులు అంటే కేవ‌లం వృద్ధుల‌కు లేదా పొగ‌తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం వంటి అల‌వాట్లు ఉన్న‌వారికే వస్తాయ‌ని భావించేవారు. కానీ తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న మాత్రం ఆ అభిప్రాయాన్ని కూడా పూర్తిగా మార్చేసింది.

S

Lifestyle | Published On Feb 3, 2026, 12.03 pm IST

Heart Diseases | ఫిట్‌గా ఉన్నాం, గుండె జ‌బ్బులు రావ‌ని అనుకోకండి.. ఇది తెలిస్తే, ఇంకా జాగ్ర‌త్త‌గా ఉంటారు..!
Advertisement

Heart Diseases | నిన్న మొన్న‌టి వ‌ర‌కు గుండె జ‌బ్బులు అంటే కేవ‌లం వృద్ధుల‌కు లేదా పొగ‌తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం వంటి అల‌వాట్లు ఉన్న‌వారికే వస్తాయ‌ని భావించేవారు. కానీ తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న మాత్రం ఆ అభిప్రాయాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. హైద‌రాబాద్ కు చెందిన 37 ఏళ్ల ఓ వ్య‌క్తి రోజూ 5 కిలోమీట‌ర్లు ర‌న్నింగ్ చేసేవాడు, పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించడం వంటి అల‌వాట్లు లేవు. జంక్ ఫుడ్ తిన‌డు, నిద్ర కూడా స‌రిగ్గానే ఉండేది. కానీ ఒక్క‌సారిగా ఛాతిలో నొప్పి వ‌చ్చింది. అనుమానం వ‌చ్చి హాస్పిట‌ల్‌లో చేరి ప‌రీక్ష‌లు చేయించుకోగా అత‌ని ర‌క్త నాళాల్లో బ్లాక్స్ వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. దీంతో అత‌ను నిర్ఘాంత‌పోయాడు. అయితే అత‌ని ప‌రిస్థితి కాస్త తీవ్రంగా మార‌డంతో వైద్యులు అత‌నికి రెండు స్టెంట్లు వేశారు. ఈ విష‌యాన్ని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్ సయ్యద్ అక్రమ్ అలీ త‌న ఇన్‌స్టా ఖాతాలో వెల్ల‌డించారు.

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని క‌లిగి ఉన్నా కూడా..

గుండె జ‌బ్బులు అంటే సాధార‌ణంగా ఆయా అంశాల‌కు చెందిన వారికే వ‌స్తాయ‌న్న భావ‌న‌ను తాజా సంఘ‌ట‌న పూర్తిగా చెరిపేసింది. ఇవి ఎవ‌రికైనా ఎప్పుడైనా రావ‌చ్చ‌ని స్పష్ట‌మైంది. నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు స‌రైన జీవ‌న‌శైలిని పాటించినా కూడా హార్ట్ డిసీజ్ వ‌చ్చే రిస్క్ అధికంగా ఉంటుంద‌ని తేలింది. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతోంది, ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని క‌లిగి ఉన్న వ్య‌క్తుల‌కు కూడా ఇలా గుండె జ‌బ్బులు ఎందుకు వ‌స్తున్నాయి..? అన్న అంశంపై డాక్ట‌ర్ అక్ర‌మ్ అలీ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. శారీరకంగా ఫిట్‌గా కనిపించడం అంటే గుండె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని కాదు. జన్యుపరమైన కారణాలు, కొలెస్ట్రాల్, దీర్ఘకాలిక ఒత్తిడి, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్, నిద్రలేమి.. ఇవి కూడా చాలాసార్లు మనం ఊహించిన‌దానికంటే అధిక‌ పాత్ర పోషిస్తాయి. అందుక‌నే చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతుంటారు. వాస్త‌వానికి గుండె జ‌బ్బులకు జీవ‌న‌శైలి ఒక్క‌టే కాదు, ఇంకా అనేక కార‌ణాలు ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by DrSyedakram Ali (@dr.syedakramali)

వీటి గురించి చాలా మందికి తెలియ‌దు..

కుటుంబంలో త‌ల్లి లేదా తండ్రి, అంత‌కు ముందు ఉన్న త‌రాల‌కు చెందిన వారికి గుండె జ‌బ్బులు ఉన్నా, లేదా చిన్న‌త‌నంలో గుండె జ‌బ్బుల బారిన ప‌డినా యుక్త వ‌య‌స్సులో లేదా ఇంకా పెద్ద‌య్యాక గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం పెరుగుతుంద‌ని డాక్ట‌ర్ అక్ర‌మ్ అలీ తెలిపారు. అలాగే సాధార‌ణంగా మ‌న‌కు క‌నిపించ‌ని లైపో ప్రోటీన్ ఎ అనే కొలెస్ట్రాల్ కూడా ఉంటుంద‌ని, ఇది జ‌న్యు ప‌ర‌మైన ప్ర‌మాద‌క‌ర‌మైన కొలెస్ట్రాల్ జాబితాకు చెందుతుంద‌ని, దీని స్థాయిలు సాధార‌ణ కొలెస్ట్రాల్ టెస్టుల్లో తెలియ‌వ‌ని అన్నారు. ఇది కూడా గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌వుతుంద‌ని అన్నారు. అదేవిధంగా రోజూ శారీర‌క లేదా మాన‌సిక ఒత్తిడి తీవ్రంగా ఉండ‌డం, శ‌రీరంలో ఆయా అవ‌యవాల్లో అంత‌ర్గ‌తంగా ఉండే వాపులు, నిద్ర‌లేమి.. వంటివ‌న్నీ గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు కార‌ణం అవుతాయ‌ని తెలిపారు.

ఫిట్ గా ఉన్నామ‌ని నిర్ల‌క్ష్యం వద్దు..

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రు ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని క‌లిగి ఉండ‌డంతోపాటు ప‌లు ర‌కాల టెస్టుల‌ను త‌ర‌చూ చేయించుకుంటే గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదాన్ని చాలా వ‌ర‌కు త‌గ్గించ‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబ‌డిన వారు లైపో ప్రోటీన్ (ఎ), హెచ్‌ఎస్-సీఆర్‌పీ, అపోబీ, హెచ్‌బీఏ1సీ, ఫాస్టింగ్ ఇన్సులిన్, విటమిన్ డి, హోమోసిస్టీన్, అవసరమైతే ట్రెడ్‌మిల్ టెస్ట్, కరోన‌రీ కాల్షియం స్కోర్ వంటి టెస్టులు చేయించుకోవాల‌ని సూచించారు. వీటి వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టి అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని, దీంతో ప్రాణాపాయ ప‌రిస్థితులు ఏర్ప‌డ‌కుండా ఉంటాయ‌ని, గుండె ఆరోగ్యాన్ని ర‌క్షించుకోవ‌చ్చ‌ని అన్నారు. ఫిట్‌గా ఉన్నామన్న భావ‌న‌తో చాలా మంది ప‌రీక్ష‌లు చేయించుకోకుండా నిర్ల‌క్ష్యం చేస్తారు. వారు స‌రిగ్గా ఉంటే ఓకే. కానీ తెలియ‌ని విష‌యాల వల్ల రిస్క్ ఉంటే మాత్రం అది గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు కార‌ణం అవుతుంది. క‌నుక పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు. ముందస్తు గుర్తింపు వ‌ల్ల ప్రాణాలను కాపాడుకోవ‌చ్చు, అని డాక్టర్ అక్రమ్ అలీ హెచ్చరించారు.

Advertisement
Advertisement