త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aerial Yoga | హైద‌రాబాద్ న‌గ‌రంలో సరికొత్త ఫిట్ నెస్ ట్రెండ్‌.. ఏరియ‌ల్ యోగా..

Aerial Yoga | ఎప్పుడూ ఆగకుండా పరుగెత్తే నగరం హైదరాబాద్‌లో ఇప్పుడు ఫిట్‌నెస్‌ ఓ కొత్త మలుపు తిరిగింది. నేలపై కాదు, గాలిలో తేలుతూ సాధన చేసే ఏరియల్ యోగా (Aerial Yoga) నగరవాసులను ఆకర్షిస్తున్న తాజా వెల్‌నెస్ ట్రెండ్‌గా మారింది.

S

Lifestyle | Published On Feb 2, 2026, 7.24 am IST

Aerial Yoga | హైద‌రాబాద్ న‌గ‌రంలో సరికొత్త ఫిట్ నెస్ ట్రెండ్‌.. ఏరియ‌ల్ యోగా..
Advertisement

Aerial Yoga | ఎప్పుడూ ఆగకుండా పరుగెత్తే నగరం హైదరాబాద్‌లో ఇప్పుడు ఫిట్‌నెస్‌ ఓ కొత్త మలుపు తిరిగింది. నేలపై కాదు, గాలిలో తేలుతూ సాధన చేసే ఏరియల్ యోగా (Aerial Yoga) నగరవాసులను ఆకర్షిస్తున్న తాజా వెల్‌నెస్ ట్రెండ్‌గా మారింది. శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత.. రెండింటినీ ఒకేసారి అందించే ఈ యోగా విధానం హైదరాబాద్‌లో వేగంగా ఆదరణ పొందుతోంది. సాంప్రదాయ యోగా మాదిరిగా మ్యాట్‌పై కాకుండా, పైకప్పు నుంచి వేలాడదీసిన బలమైన సిల్క్ హామాక్‌ సహాయంతో ఏరియల్ యోగా చేస్తారు. శరీరాన్ని మడతపెట్టడం, సమతుల్యం సాధించడం, కొన్నిసార్లు తలక్రిందులుగా వేలాడటం కూడా ఇందులో భాగమే. చూడటానికి కాస్త కష్టంగా అనిపించినా, తొలిసారి ప్రయత్నించే వారు కూడా ఇది ఎంత సుర‌క్షిత‌మైనదో, ఎంత సపోర్టివ్‌గా ఉంటుందో చూసి ఆశ్చర్యపోతుంటారు. హామాక్‌ జాయింట్స్, వెన్నెముకపై ఒత్తిడి తగ్గించి, లోతైన స్ట్రెచింగ్‌ను సులభం చేస్తుంది.

1980ల‌లో మొద‌లు..

ఏరియల్ యోగా మూలాలపై వేర్వేరు అభిప్రాయాలున్నాయి. 1980లలో సర్కస్ కళాకారులు ఫ్యాబ్రిక్ హామాక్‌లను విన్యాసాల కోసం వినియోగించడం నుంచి ఈ పద్ధతికి ఆదరణ పెరిగింది. తరువాత క్రిస్టోఫర్ హారిసన్ అభివృద్ధి చేసిన AntiGravity Yoga ఆధునిక ఏరియల్ యోగాకు పునాది వేసిందని చెప్పవచ్చు. 2006లో న్యూయార్క్‌లో మిచెల్ డోర్టిగ్నాక్ సంప్రదాయ యోగాసనాలను గాల్లో సాధన చేసే విధానంతో Unnata Aerial Yoga ని నెల‌కొల్పారు. భారతీయ యోగాతో కూడా దీనికి అనుబంధం ఉందన్న చర్చలు వినిపిస్తుంటాయి.

అనేక లాభాలు..

ఏరియల్ యోగా చూడటానికి ఆకర్షణీయంగానే కాదు, ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఇస్తుంది. హామాక్‌ సహాయంతో డీప్‌ స్ట్రెచింగ్ సాధ్యమ‌వుతుంది. దీనివ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. గాలిలో బ్యాలెన్స్ వల్ల స్టెబిలైజింగ్ మజిల్స్ యాక్టివ్ అవుతాయి. దీని వ‌ల్ల శారీర‌క భంగిమ మెరుగు ప‌డుతుంది. వెన్నెముకకు సహజమైన డీకంప్రెషన్ లభిస్తుంది. సమతుల్యం, సమన్వయం పెరుగుతాయి. స్ట్రెస్ తగ్గుతుంది. గాల్లో తేలుతున్న అనుభూతి మనసును ప్రశాంతం చేస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ప్రయోజనాలతో సాధారణ వర్క‌వుట్లకు బదులుగా ఏరియల్ యోగాను చాలా మంది ఎంచుకుంటున్నారు.

ఏరియ‌ల్ యోగా క్లాసులు..

ఏరియ‌ల్‌ యోగాను ప్రాక్టీస్ చేసేందుకు లేదా రోజూ వ్యాయామంలా చేసేందుకు న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో స్టూడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. గ‌చ్చిబౌలిలోని నానక్‌రాంగూడ‌లో ఉన్న ఖాజాగూడ స్టూడియో అనంత‌లో నెల‌వారి ఫీజు రూ.5వేల నుంచి రూ.7వేల‌కు ఉద‌యం, సాయంత్రం బ్యాచ్‌ల‌లో ఏరియ‌ల్ యోగాను సాధన చేయ‌వ‌చ్చు. వారాంతాల్లో ఉద‌యం క్లాసుల‌ను కూడా నిర్వ‌హిస్తున్నారు. అలాగే కొండాపూర్, సైనిక్‌పురిల‌లో అన‌హ‌ట యోగా జోన్‌లో నెల‌కు రూ.3500 నుంచి రూ.4500కు ఏరియ‌ల్ యోగాను నేర్చుకోవ‌చ్చు. గ‌చ్చిబౌలిలోని ఫిట్ నెస్ లైఫ్ స్టైల్ యోగా (FLY)లో రూ.5వేల నెల‌వారి ఫీజుకు ఈ యోగాను ప్రాక్టీస్ చేయ‌వ‌చ్చు. ఇక్క‌డ ట్ర‌య‌ల్ సెష‌న్ల‌ను రూ.300కే నిర్వ‌హిస్తున్నారు.

సుల‌భంగా ప్రాక్టీస్‌..

కొండాపూర్‌లోని కృష్ణ యోగాశాల‌లో నెల‌కు రూ.4వేల నుంచి రూ.6వేల ఫీజుకు ఏరియ‌ల్ యోగా సెష‌న్ల‌ను నిర్వ‌హిస్తున్నారు. టీచ‌ర్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. హీల్ ఓ మంత్ర ఆధ్వ‌ర్యంలో నెల‌కు రూ.4వేల ఫీజుకు చిన్న చిన్న బ్యాచ్‌ల‌లో బిగిన‌ర్ ఫ్రెండ్లీ ఏరియ‌ల్ యోగా క్లాసుల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇలా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఔత్సాహికుల కోసం ఏరియల్ యోగా శిక్ష‌ణ క్లాసుల‌ను నిర్వ‌హించే సంస్థ‌లు కూడా వెలుస్తున్నాయి. అయితే దీన్ని ప్రాక్టీస్ చేసే వారు ముందుగా ట్ర‌య‌ల్ సెష‌న్ల‌లో పాల్గొన‌డం మంచిద‌ని, దీంతో ఈ యోగా విధానంపై ఒక అవ‌గాహ‌న వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వేగంగా మారుతున్న జీవ‌న‌శైలి, న‌గ‌ర జీవ‌న విధానంలో ఆరోగ్యంగా ఉండ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది. కానీ ఏరియ‌ల్ యోగాతో అది చాలా సుల‌భంగా సాధ్య‌మ‌వుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement