త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earbuds | మ‌హిళ చెవిలో పేలిన ఇయ‌ర్‌బ‌డ్స్.. వాడ‌డంలో జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

Earbuds | వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వినియోగం రోజురోజుకీ పెరుగుతున్న నేప‌థ్యంలో చెవుల భద్రతపై ఆందోళన కలిగించే ఓ సంఘ‌ట‌న‌ వెలుగులోకి వచ్చింది. టర్కీలో ఓ మహిళ ఇయర్‌బడ్స్ ధ‌రించి వాడుతున్న‌ సమయంలో అవి పేలిపోయి ఆమె వినికిడి శ‌క్తి కోల్పోయింది. దీంతో ఇయర్‌బడ్స్ వాడ‌డంలో చాలా మందిలో ఆందోళ‌న నెల‌కొంది.

S

Health | Published On Feb 8, 2026, 11.17 am IST

Earbuds | మ‌హిళ చెవిలో పేలిన ఇయ‌ర్‌బ‌డ్స్.. వాడ‌డంలో జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..
Advertisement

Earbuds | వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వినియోగం రోజురోజుకీ పెరుగుతున్న నేప‌థ్యంలో చెవుల భద్రతపై ఆందోళన కలిగించే ఓ సంఘ‌ట‌న‌ వెలుగులోకి వచ్చింది. టర్కీలో ఓ మహిళ ఇయర్‌బడ్స్ ధ‌రించి వాడుతున్న‌ సమయంలో అవి పేలిపోయి ఆమె వినికిడి శ‌క్తి కోల్పోయింది. దీంతో ఇయర్‌బడ్స్ వాడ‌డంలో చాలా మందిలో ఆందోళ‌న నెల‌కొంది. ఈ ఘటనను సంబంధిత బ్రాండ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఓ యూజర్ షేర్ చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్ ఇయర్‌బడ్స్ వాడుతున్న సమయంలో అవి అకస్మాత్తుగా పేలిపోయాయని అతడు పేర్కొన్నాడు. ఈ ఘటనపై స్పందించిన తయారీ సంస్థ, పేలిపోయిన ఇయర్‌బడ్స్‌ను పరిశీలించినప్పటికీ పేలుడుకు గల క‌చ్చితమైన కారణాన్ని గుర్తించలేకపోయామని వెల్లడించింది. ఈ ప్రకటనతో ఇయర్‌బడ్స్ సేఫ్టీపై మరింత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

60/60 నియమాన్ని పాటించాలి..

ఈ నేపథ్యంలో సీనియర్ ఈఎన్‌టీ నిపుణుడు డాక్ట‌ర్ వివేక్ కుమార్ పాఠ‌క్ కీలక సూచనలు చేశారు. ఇయర్‌బడ్స్ వినియోగం ఇప్పుడు చాలా మందికి తప్పనిసరి భాగంగా మారిందని, పూర్తిగా మానేయడం కష్టమేనని చెప్పారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించడంతో పాటు చెవుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని సూచించారు. ఇయర్‌బడ్స్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం వినికిడి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చని డాక్టర్ తెలిపారు. మధ్యమధ్యలో విరామాలు తీసుకోవడం ద్వారా చెవులపై ఒత్తిడి తగ్గి, అంతర్గత చెవి నష్టం నుంచి రక్షణ లభిస్తుందన్నారు. ఈ సందర్భంలో 60/60 నియమాన్ని పాటించాలని సూచించారు. అంటే 60 డెసిబెల్స్ శబ్దాన్ని గరిష్టంగా 60 నిమిషాల వరకు మాత్రమే వినాలి. ఇది చెవులకు అవసరమైన విశ్రాంతిని అందించి, వినికిడి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

శుభ్రం చేయ‌డం ముఖ్యం..

ఇయర్‌బడ్స్ తరచూ వేడి, తేమకు లోనవుతుంటాయి. చెవిలో ఉండే మైన, చర్మపు క‌ణాలు, దుమ్ము వంటి వాటితో పరికరం లోపలి భాగాలు దెబ్బతిని ప్రమాదాలకు దారితీయవచ్చు. కాబట్టి ఇయర్‌ఫోన్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం. అలాగే చెవులను కూడా శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శుభ్రం చేసే సమయంలో పొడిగా ఉండే మృదువైన వ‌స్త్రాన్ని మాత్రమే ఉపయోగించాలని, ఇంట్లో వాడే క్లీనింగ్ ద్రావణాలు, ఆల్కహాల్ లేదా ఆయిల్ ఉత్పత్తులను వాడకూడదని హెచ్చరించారు. ఇవి ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌ను దెబ్బతీసి పరికరం పనితీరును ప్రభావితం చేస్తాయి. అలాగే రాత్రంతా చార్జింగ్‌లో పెట్టడం మానుకోవడం ద్వారా పరికరం లైఫ్‌ పెరుగుతుందని, ప్రమాదాల అవకాశాలు తగ్గుతాయని తెలిపారు.

చెవుల పరిశుభ్రత వ్యక్తిగత ఆరోగ్యానికి కీలకమని డాక్టర్ వివేక్ కుమార్ పాఠక్ అన్నారు. ఇయర్‌బడ్స్ వాడుతున్నప్పుడు చెవిలో వేడి ఎక్కువగా అనిపించడం, దురద, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరికరాన్ని తీసేయాలని సూచించారు. అటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి, చెవులకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదా నష్టం జరిగిందా అని పరీక్షించుకోవడం అవసరమని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement