L-Carnitine | ఎల్-కార్నిటైన్ సప్లిమెంట్లు నిజంగానే బరువును తగ్గిస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
L-Carnitine | బరువు తగ్గించే సప్లిమెంట్లు ప్రస్తుతం మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయాయి. వాటిలో ఎక్కువగా కనిపించే పదార్థాల్లో ఎల్-కార్నిటైన్ ఒకటి. దీన్ని ఫ్యాట్ బర్నింగ్ కాంపౌండ్‌గా ప్రచారం చేస్తూ జిమ్ కు వెళ్లేవారు, ఫిట్నెస్ ప్రేమికులు, వెయిట్ లాస్ ప్రయత్నాలు చేస్తున్నవారిని ఆకర్షిస్తున్నారు.
L-Carnitine | బరువు తగ్గించే సప్లిమెంట్లు ప్రస్తుతం మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయాయి. వాటిలో ఎక్కువగా కనిపించే పదార్థాల్లో ఎల్-కార్నిటైన్ ఒకటి. దీన్ని ఫ్యాట్ బర్నింగ్ కాంపౌండ్‌గా ప్రచారం చేస్తూ జిమ్ కు వెళ్లేవారు, ఫిట్నెస్ ప్రేమికులు, వెయిట్ లాస్ ప్రయత్నాలు చేస్తున్నవారిని ఆకర్షిస్తున్నారు. అయితే ఇది నిజంగానే అదనపు బరువును తగ్గించడంలో సహాయపడుతుందా? లేక మరో ఓవర్‌హైప్ అయిన సప్లిమెంటేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎల్-కార్నిటైన్ కొంతమందిలో వెయిట్ లాస్‌కు సహాయపడే అవకాశం ఉన్నా, ఇది మిరాకిల్ సొల్యూషన్ మాత్రం కాదు. ఫ్యాట్ మెటబాలిజాన్ని ఇది సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ స్థిరమైన బరువు తగ్గుదల కోసం సరైన డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మంచి నిద్ర, దీర్ఘకాల జీవనశైలి మార్పులే ప్రధాన పాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఎల్-కార్నిటైన్ శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక అమినో యాసిడ్ డెరివేటివ్. దీని ప్రధాన పని ఫ్యాటీ యాసిడ్స్‌ను మైటోకాండ్రియాలోకి తరలించడం. మైటోకాండ్రియాను కణాల ఎనర్జీ ఫ్యాక్టరీలుగా పరిగణిస్తారు. అక్కడ ఫ్యాట్ ఉపయోగకరమైన ఎనర్జీగా మారుతుంది.
ఈ ఆహారాల ద్వారా సహజంగానే..
శరీరానికి ఎల్-కార్నిటైన్ సహజంగా మాంసం, చేపలు, చికెన్, పాల ఉత్పత్తుల ద్వారా లభిస్తుంది. అదనంగా ఇది సప్లిమెంట్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. వెయిట్ లాస్, అథ్లెటిక్ పనితీరు, ఎనర్జీ లెవల్స్ పెంపు కోసం దీనిని మార్కెటింగ్ చేస్తున్నారు. శరీరం ఫ్యాట్‌ను ఎనర్జీగా ఉపయోగించుకునే విధానాన్ని మెరుగుపరచడం ద్వారా ఎల్-కార్నిటైన్ కొంతమేర వెయిట్ మేనేజ్మెంట్కు ఉపయోగపడుతుంది. అయితే దీని ప్రభావం ఎక్కువగా కాకుండా పరిమితంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎల్-కార్నిటైన్ సప్లిమెంట్లను తీసుకుంటే ఫ్యాట్ మెటబాలిజం మెరుగు పడుతుంది. శరీరంలో శక్తి ఉత్పత్తి క్రమబద్దంగా ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో త్వరగా అలసిపోకుండా ఉంటారు. వర్కవుట్ పనితీరు మెరుగు పడుతుంది. ఎక్సర్ సైజ్ చేసిన తరువాత వేగంగా రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఇవన్నీ భారీగా సంభవించవు. పరిమిత మోతాదులోనే, కేవలం కొందరిలోనే ప్రభావం చూపిస్తాయి. అందువల్ల సప్లిమెంట్లను తీసుకునే ముందు వైద్యుల సలహాను అడగాల్సి ఉంటుంది.
బరువు తగ్గడం సాధ్యమే.. కానీ..
కొన్ని అధ్యయనాల్లో తేలిన ప్రకారం, ఫిజికల్ యాక్టివిటీతోపాటు కేలరీ నియంత్రిత డైట్ పాటించినప్పుడు ఎల్-కార్నిటైన్ స్వల్పంగా ఫ్యాట్ లాస్‌కు సహాయపడుతుందని వెల్లడైంది. కానీ జీవనశైలిలో మార్పులు లేకుండా కేవలం సప్లిమెంట్స్ మాత్రమే తీసుకుంటే గణనీయమైన ఫలితాలు రావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ సప్లిమెంట్ కూడా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని భర్తీ చేయలేదని వైద్యులు చెబుతున్నారు. శరీరం తీసుకునే కేలరీల కంటే ఎక్కువ కేలరీలను ఖర్చు చేసినప్పుడే బరువు తగ్గుదల జరుగుతుంది. దీనికోసం పలు సూచనలను పాటించాల్సి ఉంటుంది. పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ క్రమం తప్పకుండా వేళకు తీసుకోవాలి. రోజూ శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలి. స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ వ్యాయామాలు చేయాలి. కార్డియో వర్కవుట్స్ చేయాలి. సరిపడా నిద్ర ఉండాలి. హార్మోన్లు సమతుల్యంలో ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇవన్నీ పాటిస్తే ఎల్-కార్నిటైన్ వల్ల ఇంకా ఎక్కువ ఫలితం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎల్-కార్నిటైన్ ఎనర్జీ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. కానీ అతిగా తినడం, అలసత్వ జీవనశైలి, నిద్రలేమిని మాత్రం ఇది సరిచేయలేదు.

వీరికి ఎక్కువ ప్రయోజనం లభించే అవకాశం..
కొన్ని వర్గాల వారికి ఎల్-కార్నిటైన్ సప్లిమెంటేషన్ ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో సహజంగా దీని స్థాయిలు తక్కువగా ఉండేవారిలో ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శాకాహారం మాత్రమే తినేవారు, వృద్ధులు, మెటబాలిక్ వ్యాధులు ఉన్నవారు, తీవ్రమైన అలసట సమస్య ఉన్నా, పోషకాహార లోపాలు ఉన్నా.. అలాంటి వారు ఈ సప్లిమెంట్లను తీసుకుంటే ఎక్కువ ఫలితం లభించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే డాక్టర్‌ను సంప్రదించి సప్లిమెంట్లను తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యులు సూచించిన మోతాదుల్లో తీసుకుంటే ఎల్-కార్నిటైన్ ను సాధారణంగా సురక్షితంగానే పరిగణిస్తారు. అయితే కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. వికారం, పొట్టలో అసౌకర్యం, డయేరియా, కడుపులో మంట లేదా నొప్పి, శరీరం నుంచి చేపల వాసన రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీ వ్యాధులు, లివర్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దీర్ఘకాలం వాడే ముందు డాక్టర్ సలహా తప్పనిసరి అని చెబుతున్నారు.
నేరుగా ఫ్యాట్‌ను కరిగించదు..
ఎల్-కార్నిటైన్ నేరుగా ఫ్యాట్‌ను కరిగిస్తుందనే నమ్మకం చాలామందిలో ఉంది. కానీ నిపుణుల ప్రకారం ఇది తప్పుదారి పట్టించే ప్రచారం. ఈ సప్లిమెంట్ ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియకు సహకరిస్తుంది. కానీ నిజమైన ఫ్యాట్ లాస్ మాత్రం శారీరక శ్రమ, సరైన ఆహారం వల్లే జరుగుతుంది. అలాగే ఎక్కువ మోతాదులో తీసుకుంటే త్వరగా ఫలితాలు వస్తాయని భావించడం కూడా పొరపాటే. అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ పెరగదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సప్లిమెంట్స్‌పై ఆధారపడే ముందు ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్మించుకోవడం చాలా ముఖ్యం. రెగ్యులర్‌గా వ్యాయామం చేసే వారికి ఎల్-కార్నిటైన్ ఒక సపోర్టివ్ ఆప్షన్‌గా ఉపయోగపడుతుంది. కానీ వెయిట్ లాస్‌కు ప్రధాన మార్గంగా దీనిని చూడకూడదని సూచిస్తున్నారు. సప్లిమెంట్స్ కంటే పూర్తి ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, వాస్తవికమైన వెయిట్ లాస్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వైద్యపరంగా ఆమోదించిన సప్లిమెంట్స్ మాత్రమే ఉపయోగించాలని, దీర్ఘకాల వినియోగానికి ముందు డాక్టర్‌ను సంప్రదించాలని అంటున్నారు.
ఎల్-కార్నిటైన్ వెయిట్ మేనేజ్మెంట్లో స్వల్ప సహాయం చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో కలిపి ఉపయోగించినప్పుడు కొంత ప్రయోజనం ఉంటుంది. కానీ వేగంగా బరువు తగ్గించే షార్ట్‌కట్ మాత్రం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాల ఫలితాలు మాత్రం సరైన ఆహారం, శారీరక శ్రమ, మంచి నిద్ర, క్రమశిక్షణతో కూడిన జీవనశైలివల్లే సాధ్యమవుతాయి.
తాజావార్తలు
- ●Air india Plane Crash | విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్.. రూ.105 కోట్లతో పునర్నిర్మాణం
- ●iPhone | ఐఫోన్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం.. చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కున్నా ఇట్టే పసిగడుతుంది..
- ●Prof Nageshwar | అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు : మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్
- ●Ebola | ఆ మహిళకు ఎబోలా లేదు : కర్ణాటక ఆరోగ్య మంత్రి
- ●ED Vehicle Attacked Kerala | కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం శ్రేణుల దాడి.. పినరయి విజయన్ నివాసాల్లో సోదాలతో తీవ్ర ఉద్రిక్తత
- ●Stock Markets | సెన్సెక్స్ వరుసగా రెండో రోజు డౌన్.. మిడ్‌క్యాప్స్ దుమ్మురేపాయి..

Air india Plane Crash | విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్.. రూ.105 కోట్లతో పునర్నిర్మాణం

iPhone | ఐఫోన్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం.. చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కున్నా ఇట్టే పసిగడుతుంది..

Prof Nageshwar | అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు : మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్

Ebola | ఆ మహిళకు ఎబోలా లేదు : కర్ణాటక ఆరోగ్య మంత్రి






