త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ED Vehicle Attacked Kerala | కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం శ్రేణుల దాడి.. పినరయి విజయన్ నివాసాల్లో సోదాలతో తీవ్ర ఉద్రిక్తత

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. మహిళా అధికారులున్న ఈడీ కారు అద్దాలను సీపీఎం శ్రేణులు ధ్వంసం చేశాయి.

J

National | Published On May 27, 2026, 4.28 pm IST

ED Vehicle Attacked Kerala | కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం శ్రేణుల దాడి.. పినరయి విజయన్ నివాసాల్లో సోదాలతో తీవ్ర ఉద్రిక్తత
Advertisement

ED Vehicle Attacked Kerala | త్రినేత్ర.న్యూస్ : త్రినేత్ర.న్యూస్ : కేరళ (Kerala) రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తెకు సంబంధించిన పలు నివాసాలపై ఈడీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడులను నిరసిస్తూ సీపీఎం (CPI-M) శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగడంతో రాజధాని తిరువనంతపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏకంగా ఈడీ అధికారుల వాహనంపై దాడి చేయడంతో పరిస్థితి రణరంగాన్ని తలపించింది.

ఈడీ కారుపై రాళ్ల దాడి

తిరువనంతపురంలో ఈడీ అధికారుల బృందం ప్రయాణిస్తున్న కారును సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాళ్లు, ఇనుప రాడ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో కారులో మహిళా అధికారులు కూడా ఉండటం గమనార్హం. ఆందోళనకారుల నుంచి అధికారులను రక్షించేందుకు పోలీసులకు, భద్రతా సిబ్బందికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఉదయం నుంచి రాజధానిలో భారీ ఎత్తున పార్టీ శ్రేణులు నిరసనలకు దిగారు. కొన్నిచోట్ల పోలీసులపైకి ప్లాస్టిక్ బాటిళ్లు, హెల్మెట్లు, రాళ్లు కూడా విసిరారు. చివరకు సీనియర్ నేతలు జోక్యం చేసుకుని కార్యకర్తలను సముదాయించి, నిరసనను విరమింపజేశారు.

Image

దాడులు ఎక్కడెక్కడ జరిగాయి?

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. తిరువనంతపురంలోని పినరయి విజయన్ ప్రస్తుత నివాసంతో పాటు, కన్నూర్‌లోని ఆయన సొంత ఇల్లు, అలాగే ఆయన అల్లుడు, మాజీ మంత్రి మహ్మద్ రియాస్ కు చెందిన కోజికోడ్ నివాసంలో కూడా తనిఖీలు కొనసాగాయి. ఉదయాన్నే ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో విజయన్, ఆయన కుటుంబ సభ్యులు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. వందలాది మంది మద్దతుదారులు మాత్రం ఇంటి బయట గుమిగూడి ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Image

ఏంటి ఈ సీఎంఆర్ఎల్ (CMRL) ముడుపుల కేసు?

పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు చెందిన 'ఎక్సాలాజిక్ సొల్యూషన్స్' (Exalogic Solutions) అనే ఐటీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ మనీలాండరింగ్ కేసు నమోదైంది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) అనే సంస్థ.. వీణా కంపెనీ నుంచి ఎలాంటి సేవలు పొందకుండానే కన్సల్టెన్సీ, ఐటీ సర్వీసుల పేరుతో కోట్లాది రూపాయలు చెల్లించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

Image

2018-2019 మధ్యకాలంలోనే సుమారు రూ. 1.72 కోట్లు, ఓవరాల్ గా చూస్తే పలు దఫాలుగా రూ. 2.7 కోట్లు ఈ ఐటీ సంస్థ ఖాతాలోకి వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఇది ముమ్మాటికీ రాజకీయ లబ్ధి కోసం లేదా అక్రమ ప్రయోజనాల కోసం జరిగిన లావాదేవీ అని దర్యాప్తు సంస్థలు (SFIO, ED) అనుమానిస్తున్నాయి. ఈ కేసును కొట్టివేయాలంటూ సీఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు ఒకరోజు ముందే తిరస్కరించిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం.

కక్ష సాధింపు చర్యే అంటున్న సీపీఎం

తాజా దాడులపై సీపీఎం తీవ్రంగా స్పందించింది. ఇదంతా రాజకీయ కక్షసాధింపు చర్యేనని, ఈ సోదాలు అత్యంత హేయమైన దాడి అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు. పినరయి విజయన్ కూడా గతంలో తనపై, తన కూతురిపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేశారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా, గత నెలలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఓటమి పాలు కాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పినరయి విజయన్ కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా (Leader of Opposition) వ్యవహరిస్తున్నారు.

Advertisement
Advertisement