త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cycling | సైకిల్ తొక్క‌డం నేర్పిస్తూ.. రూ.35 ల‌క్ష‌లు సంపాదించాడు..

Cycling | డ‌బ్బు సంపాదించే మార్గాల కోసం చాలా మంది అన్వేషిస్తుంటారు. కొంద‌రు ఆన్‌లైన్‌లో పాత వ‌స్తువుల‌ను విక్ర‌యిస్తారు. ఇంకొంద‌రు త‌మ‌కు ఉన్న హాబీల‌ను డ‌బ్బు సంపాదించే మార్గాలుగా మలుచుకుంటారు. కొంద‌రు కేవ‌లం వీడియోల‌ను పోస్ట్ చేయ‌డం ద్వారానే డ‌బ్బు సంపాదిస్తారు.

S

Lifestyle | Published On Jan 20, 2026, 12.24 pm IST

Cycling | సైకిల్ తొక్క‌డం నేర్పిస్తూ.. రూ.35 ల‌క్ష‌లు సంపాదించాడు..
Advertisement

Cycling | డ‌బ్బు సంపాదించే మార్గాల కోసం చాలా మంది అన్వేషిస్తుంటారు. కొంద‌రు ఆన్‌లైన్‌లో పాత వ‌స్తువుల‌ను విక్ర‌యిస్తారు. ఇంకొంద‌రు త‌మ‌కు ఉన్న హాబీల‌ను డ‌బ్బు సంపాదించే మార్గాలుగా మలుచుకుంటారు. కొంద‌రు కేవ‌లం వీడియోల‌ను పోస్ట్ చేయ‌డం ద్వారానే డ‌బ్బు సంపాదిస్తారు. అయితే చైనాలో ఓ విద్యార్థి కూడా ఇదే తరహాలో ఆలోచించి, చాలా మంది పట్టించుకోని ఒక విషయాన్ని గమనించాడు. పెద్ద నగరాల్లో సైక్లింగ్ లేన్లు పెరుగుతున్నా, పెద్దలు, పిల్లలు చాలామందికి సైకిల్ తొక్కడం రావడం లేదని అత‌డు గ‌మ‌నించాడు. అదే అతడికి అనూహ్యమైన ఆదాయ మార్గంగా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, లీ అనే మాస్టర్స్ విద్యార్థి గత రెండు సంవత్సరాల్లో సైకిల్ తొక్కడం నేర్పించి దాదాపు 39,000 అమెరికన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ.35 లక్షలకుపైగా సంపాదించాడు. దీంతో సామాజిక మాధ్య‌మాల్లో అత‌ని వార్త వైర‌ల్ అవుతోంది.

చాలా మందికి రాదు..

చదువుతో పాటు సైక్లింగ్ తరగతులు నిర్వహిస్తున్న లీ ఇప్పటికే వందల మందికి శిక్షణ ఇచ్చాడు. సాధారణ జీవన నైపుణ్యాన్ని వ్యాపారంగా మార్చుకుని, పట్టుదలతో కొనసాగిస్తే ఎంత స్థిరమైన ఆదాయం వస్తుందో దీనిద్వారా స్పష్టమవుతోంది. షాంఘై యూనివర్సిటీ ఆఫ్ స్పోర్ట్స్‌లో స్పోర్ట్స్ ఎడ్యుకేషన్‌లో మూడో సంవత్సరం మాస్టర్స్ విద్య‌ను అభ్యసిస్తున్న లీకి ఈ ఆలోచన ఖాళీ సమయంలో వచ్చింది. సైక్లింగ్ కమ్యూటింగ్, వినోదం కోసం ప్రాచుర్యం పెరుగుతున్నప్పటికీ, చాలా మంది పట్టణవాసులకు సైకిల్ తొక్కడం రాకపోవడాన్ని గమనించాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ స్నేహితుడితో కలిసి ఈ అవసరాన్ని గుర్తించి చిన్న వ్యాపారంగా ప్రారంభించాడు. ఆ స్నేహితుడికి ఉద్యోగం దొరకడంతో తప్పుకున్నప్పటికీ, లీ మాత్రం ఒంటరిగా కొనసాగించాడు. యూనివర్సిటీలో చేరిన తర్వాత సోషల్ మీడియాలో శిక్షణ వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. రెండు నెలల్లోనే త‌న‌కు సైకిల్ తొక్క‌డం నేర్చుకునే తొలి విద్యార్థి లభించాడు. అప్పటి నుంచి ఈ సైడ్ బిజినెస్ క్రమంగా వృద్ధి చెందుతూ వచ్చింది.

700 మందికి శిక్ష‌ణ‌.. 110 డాల‌ర్లు ఫీజు..

లీ సైక్లింగ్ ప్యాకేజీ పేరిట ఓ కోర్సును అందిస్తున్నాడు. దీని ఫీజు 800 యువాన్లు, అంటే సుమారు 110 డాలర్లు. కోర్సు ముగిసే సరికి సైకిల్ తొక్కడం తప్పకుండా వస్తుందని అతడు హామీ ఇస్తున్నాడు. పెద్దల‌కు సాధారణంగా రెండు క్లాసులు సరిపోతాయి. ఒక్కో క్లాస్ గంటన్నర నుంచి రెండు గంటల వరకూ ఉంటుంది. పిల్లలకు మాత్రం ఏకాగ్రత, శారీరక శక్తి తక్కువగా ఉండటంతో మరికొన్ని క్లాసులు అవసరం అవుతాయి. ఇప్పటివరకు నాలుగేళ్ల వయసు నుంచి 68 ఏళ్ల వరకు దాదాపు 700 మందికి శిక్షణ ఇచ్చినట్టు లీ తెలిపాడు. వీరిలో ఎక్కువ మంది 20-30 ఏళ్ల మధ్య వయసు వారే కాగా, దాదాపు 70 శాతం మంది మహిళలే కావడం విశేషం. మార్కెట్ ఇంత పెద్దదిగా ఉంటుందని తాను ఊహించలేదని లీ ఈ సంద‌ర్భంగా మీడియాకు తెలిపాడు. ఓ మహిళా విద్యార్థిని తన జీవితంలో ఎప్పటినుంచో ఉన్న కోరిక‌ను తీర్చుకోవాలనే ఉద్దేశంతో సైకిల్ నేర్చుకుందని స్థానిక మీడియాకు తెలిపింది. కేవలం ఒక గంటలోనే సైకిల్ తొక్కగలగడంతో ఆనందంతో తన కుమార్తెకు ఫోన్ చేసి చెప్పింది. ఈ క్ర‌మంలో అలా అలా లీ సైక్లింగ్ ప్యాకేజీకి అంత‌టా గుర్తింపు ల‌భించి అత‌ను పాపుల‌ర్ అయ్యాడు. సైకిల్ తొక్క‌డం నేర్పించే నిపుణుడిగా మారాడు.

భ‌విష్య‌త్తులో మ‌రింత విస్త‌ర‌ణ‌..

తనకు ఉన్న స్పోర్ట్స్ సైన్స్ పరిజ్ఞానం శిక్షణలో ఎంతో ఉపయోగపడుతుందని లీ చెబుతున్నాడు. ఒక విద్యార్థితో పది నిమిషాలు గడిపితే, ఎంత సమయంలో అతడు నేర్చుకుంటాడో అంచనా వేయగలనని, చాలాసార్లు తాను ఊహించినదానికంటే వేగంగానే వారు నేర్చుకుంటారని వివరించాడు. చిన్ననాటి ప్రమాదాల వల్ల భయపడే వారికి ప్రత్యేకంగా ఓపికతో మాట్లాడి, మానసిక భయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పాడు. కాగా ఈ ఏడాది జూన్‌లో లీ తన మాస్టర్స్ పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత శిక్షణ పద్ధతులను మరింత మెరుగుపరుచుకుని, షాంఘైతో పాటు జెజియాంగ్, జియాంగ్సు వంటి సమీప ప్రావిన్సులకు కూడా తన సేవలను విస్తరించాలనుకుంటున్నాడు. తూర్పు చైనాలో సైక్లింగ్‌పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, ఈ చిన్న ఆలోచన అతడికి పెద్ద అవకాశంగా మార‌నుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement