త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Youtube Payments | 1 కోటి వీడియో వ్యూస్‌కు యూట్యూబ్ ఎంత చెల్లిస్తుంది..? అందులో ఆదాయం ఎలా వ‌స్తుంది..?

Youtube Payments | డిజిటల్ యుగంలో యూట్యూబ్ కేవలం వీడియోలు చూసే ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే కాకుండా, లక్షల మంది క్రియేటర్లకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కొత్తగా ఛానల్ ప్రారంభించే ప్రతి ఒక్కరి మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఒక్కటే. యూట్యూబ్‌లో 1 కోటి వ్యూస్ వస్తే ఎంత సంపాదించొచ్చు? అని సందేహాలు వ‌స్తుంటాయి.

S

Technology | Published On Jan 19, 2026, 9.53 am IST

Youtube Payments | 1 కోటి వీడియో వ్యూస్‌కు యూట్యూబ్ ఎంత చెల్లిస్తుంది..? అందులో ఆదాయం ఎలా వ‌స్తుంది..?
Advertisement

Youtube Payments | డిజిటల్ యుగంలో యూట్యూబ్ కేవలం వీడియోలు చూసే ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే కాకుండా, లక్షల మంది క్రియేటర్లకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కొత్తగా ఛానల్ ప్రారంభించే ప్రతి ఒక్కరి మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఒక్కటే. యూట్యూబ్‌లో 1 కోటి వ్యూస్ వస్తే ఎంత సంపాదించొచ్చు? అని సందేహాలు వ‌స్తుంటాయి. సోషల్ మీడియాలో దీనిపై ఎన్నో అంచనాలు, వదంతులు వినిపిస్తుంటాయి. కానీ వాస్తవం మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. యూట్యూబ్ లో ఆదాయం ఎలా వస్తుంది? ఎంత వస్తుంది? ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది? అనే విష‌యాల‌ను ప‌లువురు టెక్ నిపుణులు పూర్తిగా వివ‌రిస్తున్నారు.

రెండు అంశాలు కీల‌కం..

యూట్యూబ్ క్రియేటర్లకు నేరుగా డబ్బు చెల్లించదు. వీడియోల్లో వచ్చే ప్రకటనల (Ads) ద్వారానే ఆదాయం వస్తుంది. మీ వీడియోపై యాడ్ రన్ అయినప్పుడు, దాన్ని ప్రేక్షకులు చూసినా లేదా క్లిక్ చేసినా, దానికి యూట్యూబ్ ద్వారా ఆదాయం లభిస్తుంది. దీన్నే Ad Revenue అంటారు. ఈ ఆదాయాన్ని నిర్ణయించడంలో ముఖ్యంగా రెండు అంశాలు కీలకంగా ఉంటాయి. ఒక‌టి CPM, రెండోది RPM. CPM అంటే Cost Per Mille అని అర్థం వ‌స్తుంది. అంటే.. 1000 వ్యూస్‌కు అడ్వర్టైజర్ ఎంత చెల్లిస్తాడో సూచిస్తుంది. RPM అంటే Revenue Per Mille అని అర్థం వ‌స్తుంది. అంటే.. 1000 వ్యూస్‌కు క్రియేటర్ చేతికి వచ్చే నిజమైన ఆదాయంగా చెప్ప‌వ‌చ్చు. ఇక భారత్‌లో CPM సాధారణంగా తక్కువగా ఉంటుంది. అందువల్ల RPM కూడా అమెరికా, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. క‌నుక ఆయా దేశాల క్రియేట‌ర్ల‌తో పోలిస్తే భార‌త క్రియేట‌ర్ల‌కు యూట్యూబ్ ద్వారా చాలా త‌క్కువ మొత్తంలో ఆదాయం వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఈ విభాగాల్లో ఆదాయం ఎక్కువ‌..

భారత్‌లో సాధారణంగా 1 కోటి వ్యూస్‌కు రూ.8 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది స్థిరమైన మొత్తం కాదు. కొన్ని ఛాన‌ల్స్‌కు ఇంకా తక్కువ రావచ్చు, మరికొన్నింటికి ఎక్కువ రావచ్చు. ముఖ్యంగా మీ కంటెంట్ ఈ కేటగిరీల్లో ఉంటే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.  ఫైనాన్స్,  టెక్నాలజీ, ఎడ్యుకేషన్, బిజినెస్ వంటి విభాగాల్లో క్రియేట‌ర్లు క్రియేట్ చేసే వీడియోల‌కు అధిక మొత్తంలో ఆదాయం వ‌స్తుంది. ఈ వీడియోల‌కు వ‌చ్చే యాడ్స్‌కు అడ్వ‌ర్ట‌యిజ‌ర్లు ఎక్కువ చెల్లిస్తారు. క‌నుక ఈ విభాగాల్లో వీడియోల‌ను క్రియేట్ చేస్తే మంచిది. దీంతో అధిక మొత్తంలో ఆదాయం పొంద‌వ‌చ్చు. ఇక ఈ విభాగాల్లో యాడ్స్ విలువ ఎక్కువగా ఉంటుంది. క‌నుక CPM, RPM కూడా పెరుగుతాయి. దీని వ‌ల్ల క్రియేట‌ర్ కు కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు వ‌స్తాయి.

బ్రాండ్ డీల్స్‌..

యూట్యూబ్ ఆదాయం కేవలం వ్యూస్ సంఖ్యపై మాత్రమే ఆధారపడదు. మరెన్నో అంశాలు కీలకంగా ఉంటాయి. వీడియో నిడివి, వీడియోలో వచ్చే యాడ్స్ సంఖ్య, వీడియోపై ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్ ఎలా ఉంది,  ప్రేక్షకులు ఏ దేశం నుంచి చూస్తున్నారు,  వాచ్ టైమ్ ఎంత వ‌స్తుంది.. అన్న వివ‌రాల ఆధారంగా వీడియోల‌కు డ‌బ్బులు వ‌స్తాయి. ఇక విదేశాల నుంచి ఎక్కువ వ్యూస్ వస్తే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అయితే ప్ర‌ముఖ ట్యూబర్లు కేవ‌లం యూట్యూబ్‌లో వీడియోల‌కు వ‌చ్చే ప్రకటనలపై మాత్రమే ఆధారపడరు. వారు మరిన్ని మార్గాల్లో కూడా భారీగా డ‌బ్బును సంపాదిస్తారు. ఈ క్ర‌మంలోనే వారు వివిధ బ్రాండ్ల‌తో డీల్స్ కుదుర్చుకుని వారి ప్రొడ‌క్ట్స్ లేదా సేవ‌ల‌కు త‌మ వీడియోల్లో ప్రచారం చేస్తారు. ఇలా బ్రాండ్ పార్ట్‌న‌ర్‌షిప్ ద్వారా క్రియేట‌ర్లు డ‌బ్బులు సంపాదిస్తారు. స‌బ్ స్క్రైబ‌ర్ల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటే అలాంటి క్రియేట‌ర్ల‌కు బ్రాండ్లు అధిక మొత్తంలో డ‌బ్బులు చెల్లించి మ‌రీ  ప్ర‌క‌ట‌న‌లు ఇస్తుంటాయి. దీని వ‌ల్ల క్రియేట‌ర్ల‌కు భారీ ఎత్తున ఆదాయం వ‌స్తుంది. కొంద‌రు క్రియేట‌ర్లు బెట్టింగ్ వంటి యాప్స్‌కు ప్ర‌మోష‌న్ చేస్తూ ఈ విధంగానే అధిక మొత్తంలో డ‌బ్బుల‌ను సంపాదిస్తున్నారు. అయితే అదంతా అక్ర‌మం క‌నుక అలా చేయ‌కూడ‌దు.

అఫిలియేట్ మార్కెటింగ్‌..

ఇక కొన్ని ర‌కాల వీడియోల‌కు కొన్ని బ్రాండ్లు ప్ర‌త్యేకంగా స్పాన్స‌ర్‌షిప్ చేస్తుంటాయి. దీని వల్ల కూడా డ‌బ్బు వ‌స్తుంది. అలాగే యూట్యూబ్ వీడియోల కింద డిస్క్రిప్ష‌న్‌లో అమెజాన్ వంటి ఈ-కామ‌ర్స్ సైట్ల‌కు చెందిన లింకుల‌ను పెట్టి వాటి ద్వారా కూడా అఫిలియేట్ మార్కెటింగ్ రూపంలో డ‌బ్బును సంపాదించ‌వ‌చ్చు. మీ వీడియోల‌ను చూసే నెటిజ‌న్లు ఆ లింకుల‌ను క్లిక్ చేసి వాటిల్లో ఉండే ప్రొడ‌క్ట్‌ల‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే అప్పుడు అమెజాన్ మీకు క‌మిష‌న్ రూపంలో డ‌బ్బును చెల్లిస్తుంద‌న్న‌మాట‌. అలా ఎన్ని ఎక్కువ సేల్స్ జ‌రిగితే అంత ఎక్కువ క‌మిస‌న్ మీకు వ‌స్తుంది. వీడియోల‌ను అధిక సంఖ్య‌లో చూసినా లేదా స‌బ్ స్క్రైబ‌ర్లు అధికంగా ఉన్నా ఇలా ఎక్కువ క‌మిష‌న్ పొంద‌వ‌చ్చు.

చాన‌ల్ మెంబ‌ర్‌షిప్ ద్వారా కూడా..

ఇక చివ‌రిగా చాన‌ల్ మెంబ‌ర్‌షిప్ ద్వారా కూడా క్రియేట‌ర్లు ఆర్జించ‌వ‌చ్చు. మీరు ఏదైనా రంగంలో నిష్ణాతులు అయి అందులో ఇత‌రుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌ద‌ల‌చి కోర్సుల‌ను ఏర్పాటు చేస్తే అప్పుడు వారి కోస‌మే ప్ర‌త్యేకంగా మెంబ‌ర్స్ ఓన్లీ వీడియోల‌ను చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో నెల‌వారి మెంబ‌ర్ షిప్‌ను పొందే స‌బ్ స్క్రైబ‌ర్లు మాత్ర‌మే ఆ వీడియోల‌ను చూస్తారు. వారు నెల నెలా త‌మ మెంబ‌ర్ షిప్‌ను రెన్యువ‌ల్ చేసుకుంటారు. దీంతో నెల నెలా క్రియేట‌ర్‌కు ఆదాయం ల‌భిస్తుంది. అలాగే శిక్ష‌ణ వీడియోల‌ను పెట్ట‌కున్నా కేవ‌లం మెంబ‌ర్ల కోస‌మే ప్ర‌త్యేక‌మైన వీడియోల‌ను క్రియేట్ చేసి కూడా అందుబాటులో ఉంచ‌వ‌చ్చు. వాటి ద్వారా కూడా క్రియేటర్ల‌కు మెంబ‌ర్‌షిప్ ద్వారా ఆదాయం ల‌భిస్తుంది. ఇక చాలా సందర్భాల్లో బ్రాండ్ డీల్స్ ద్వారా వచ్చే ఆదాయం యూట్యూబ్ AdSense కన్నా ఎక్కువగా ఉంటుంది.

యూట్యూబ్‌లో 1 కోటి వ్యూస్ అంటే భారీ సంఖ్యే. కానీ అది స్థిరమైన ఆదాయానికి హామీ కాదు. కంటెంట్ రకం, ప్రేక్షకుల దేశం, యాడ్స్ విలువ.. ఇవన్నీ కలిసే మీ అసలు ఆదాయాన్ని నిర్ణయిస్తాయి. సరైన కంటెంట్ వ్యూహం, నాణ్యమైన వీడియోలు, ఓర్పు ఉంటే యూట్యూబ్ నిజంగానే కెరీర్‌గా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుక‌నే కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఇందులో స‌క్సెస్ అవ‌గ‌లుగుతారు. అయితే గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే ఎవ‌రైనా ఇందులో రాణించ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement