త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Type 2 Diabetes | చైనా సైంటిస్టుల అద్భుతం.. టైప్ 2 డ‌యాబెటిస్‌ను రివ‌ర్స్ చేశారు..

Type 2 Diabetes | చైనాలోని శాస్త్రవేత్తలు టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో సంచలనాత్మక ముందడుగు వేశామని ప్రకటించారు. స్టెమ్ సెల్ థెరపీ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా టైప్ 2 డయాబెటిస్‌ను రివర్స్ చేయగలిగామని వారు పేర్కొన్నారు. టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తే జీవితాంతం మందుల‌ను వాడాల్సిందే కానీ ఈ వ్యాధిని న‌యం చేయ‌లేరు.

S

Health | Published On Feb 22, 2026, 6.36 am IST

Type 2 Diabetes | చైనా సైంటిస్టుల అద్భుతం.. టైప్ 2 డ‌యాబెటిస్‌ను రివ‌ర్స్ చేశారు..
Advertisement

Type 2 Diabetes | చైనాలోని శాస్త్రవేత్తలు టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో సంచలనాత్మక ముందడుగు వేశామని ప్రకటించారు. స్టెమ్ సెల్ థెరపీ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా టైప్ 2 డయాబెటిస్‌ను రివర్స్ చేయగలిగామని వారు పేర్కొన్నారు. టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తే జీవితాంతం మందుల‌ను వాడాల్సిందే కానీ ఈ వ్యాధిని న‌యం చేయ‌లేరు. షుగ‌ర్ లెవ‌ల్స్ ను ఎల్ల‌ప్పుడూ నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డ‌మే టైప్ 2 డ‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎదుర‌య్యే అతి పెద్ద స‌వాల్‌. దీన్ని అధిగ‌మిస్తూ చైనా సైంటిస్టులు ఏకంగా టైప్ 2 డ‌యాబెటిస్‌ను న‌యం చేసే చికిత్స‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు. టైప్ 2 డ‌యాబెటిస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న భార‌త్ వంటి దేశాల‌కు ఈ ప‌రిణామం కీల‌కంగా మారుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

టైప్-2 డయాబెటిస్ అంటే..?

టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు వైద్యులు సాధారణంగా మందులు ఇస్తారు. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ అయినా స‌రే షుగ‌ర్ మ‌రీ నియంత్రించ‌లేకుండా ఉంటే అప్పుడు టైప్ 1 లో మాదిరిగా కొంద‌రు పేషెంట్ల‌కు ఇన్సులిన్‌ను కూడా ఇస్తారు. షుగ‌ర్ సాధార‌ణ స్థాయికి వ‌చ్చాక ఇన్సులిన్‌ను తీసేసి మందుల‌ను కొన‌సాగిస్తారు. అయితే ఒకసారి ఇన్సులిన్ లేదా మందుల‌పై ఆధారపడితే శ‌రీరం దానికి అల‌వాటు ప‌డిపోతుంది. దీని వ‌ల్ల జీవితాంతం మందుల‌ను వాడాల్సి వ‌స్తుంది.

స్టెమ్ సెల్స్‌ను బీటా సెల్స్‌గా అభివృద్ధి..

చైనా పరిశోధకుల ప్రకారం, వారు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా ఆరోగ్యకరమైన ప్యాంక్రియాస్ కణాలను శరీరంలోకి మార్పిడి చేశారు. ఈ కణాలు సహజంగా ఇన్సులిన్ నియంత్రణ చేసే విధంగా పనిచేశాయి. ఈ ప్రయోగాత్మక చికిత్స ఫలితంగా, చికిత్స పొందిన రోగులు ఇకపై ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేదా డయాబెటిస్ మందులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయిందని వారు తెలిపారు. ఈ ప్రయోగంలో రోగి శరీరంలో నుంచే తీసుకున్న స్టెమ్ సెల్స్‌ను ఉపయోగించారు. స్టెమ్ సెల్స్‌కు ప్రత్యేకత ఏమిటంటే, అవి అవసరాన్ని బట్టి వివిధ రకాల కణాలుగా మారగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ల్యాబ్‌లో ఈ స్టెమ్ సెల్స్‌ను రసాయన సంకేతాలు, జన్యు మార్గనిర్దేశంతో ప్యాంక్రియాటిక్ ఐలెట్ సెల్స్‌గా మారుస్తారు. ఆ తర్వాత వాటిని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా సెల్స్‌గా అభివృద్ధి చేస్తారు.

విజ‌య‌వంతమైన చికిత్స‌..

ఈ బీటా సెల్స్‌ను సమూహాలుగా పెంచి, ప్యాంక్రియాస్ కణజాలం మాదిరిగానే పనిచేసేలా తయారు చేస్తారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల‌ని గుర్తించి, అవసరమైనప్పుడు ఇన్సులిన్ విడుదల చేస్తాయి. అనంతరం ఈ కణాలను రోగి శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఈ ప్రయోగంలో భాగంగా ఇద్దరు రోగుల పొత్తికడుపు భాగంలో ఈ కణాలను ప్లాంట్ చేశారు. అవి రక్తనాళాలతో కలిసిపోయి, శరీరం తిరస్కరించకుండా స్వీకరించడంతో చికిత్స విజయవంతమైంది. ఈ చికిత్స ఫలితంగా, మార్పిడి చేసిన కణాలు సహజ ప్యాంక్రియాస్ బీటా సెల్స్‌లా పనిచేస్తూ రక్తంలో చక్కెర స్థాయిల‌ను నియంత్రించాయి. దీంతో బయటి నుంచి ఇన్సులిన్ అవసరం పూర్తిగా తొలగిపోయింది.

టైప్-2 డయాబెటిస్‌కు స్టెమ్ సెల్ థెరపీ ఒక కొత్త ఆశగా కనిపిస్తున్నప్పటికీ, దీనిపై జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితం పరిమిత సంఖ్యలో రోగులపై మాత్రమే ఆధారపడింది. ఇది అందరికీ సరిపోతుందో లేదో తెలుసుకోవాలంటే పెద్ద స్థాయి క్లినికల్ ట్రయల్స్ అవసరమ‌ని అంటున్నారు. దీర్ఘకాల భద్రత, దుష్ప్రభావాలు, వివిధ వయస్సులవారిపై ప్రభావం వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ చికిత్సను సాధారణ వైద్యంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అయినప్పటికీ, టైప్-2 డయాబెటిస్ చికిత్సలో దీన్ని ఒక కీలక మలుపుగా వైద్య ప్రపంచం భావిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement