త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రేపు సిద్దిపేట సభలో దేశంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా’ ప్రారంభం

రేపు సిద్దిపేట సభలో ఇందిరమ్మ చీరలతో పాటు దేశంలోనే తొలిసారి ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారని మంత్రి పొన్నం తెలిపారు.

J

Karimnagar | Published On Nov 18, 2026, 2.18 pm IST

Ponnam Prabhakar | రేపు సిద్దిపేట సభలో దేశంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా’ ప్రారంభం

సంక్షిప్త సారాంశం

రేపు (నవంబర్ 19) సిద్దిపేటలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు దేశంలోనే తొలిసారిగా 'ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా' పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం అలింకో (ALIMCO) సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత సహాయ ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. లక్ష ఎకరాలకు సాగునీరందించే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని మంత్రి స్పష్టం చేశారు. అక్కన్నపేట–హుస్నాబాద్ నాలుగు లైన్ల రహదారికి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

Advertisement
  • గౌరవెల్లి ప్రాజెక్టుపై మంత్రి పొన్నం కీలక ప్రకటన

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (నవంబర్ 19, గురువారం) సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సభలో ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు, దేశంలోనే తొలిసారిగా 'ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా' పథకాన్ని సీఎం ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో అలింకో (ALIMCO) సంస్థ సహకారంతో దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన నిర్ధారణ శిబిరాన్ని మంత్రి ప్రారంభించి మీడియాతో మాట్లాడారు.

CM Revanth Reddy to Launch India's First Indiramma Family Insurance in Siddipet Tomorrow

దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాలు

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచితంగా సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి పొన్నం తెలిపారు. అక్కన్నపేట శిబిరంలో వినికిడి, వృద్ధాప్య, ఆరోగ్య పరీక్షలను ఆయన స్వయంగా పరిశీలించారు.

ఈ శిబిరాల్లో అర్హులను గుర్తించి ట్రై సైకిళ్లు, బ్యాటరీ వాహనాలు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, చేతి కర్రలు, నడుము, మోకాలి బెల్టులు, వెస్ట్రన్ టాయిలెట్ సీట్లను ఉచితంగా అందిస్తామని చెప్పారు.

CM Revanth Reddy to Launch India's First Indiramma Family Insurance in Siddipet Tomorrow

ఇప్పటికే సైదాపూర్, ఎల్కతుర్తిలో శిబిరాలు పూర్తవ్వగా.. ఈ నెల 20న కోహెడ, 21న చిగురుమామిడి, 25, 26 తేదీల్లో హుస్నాబాద్ పట్టణం, మండలంలో, 27న భీమదేవరపల్లిలో శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా సర్పంచులు, నాయకులు అర్హులందరికీ ఈ సమాచారం చేరవేయాలని కోరారు.

గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాదే

గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల భూసేకరణ కోసం రూ. 250 కోట్లు కేటాయించి రైతులకు పరిహారం చెల్లించామని మంత్రి పొన్నం గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసు పరిష్కారమైందని, ఎన్జీటీ (NGT) లోని కేసు కూడా త్వరలోనే కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

లక్ష ఎకరాలకు సాగునీరు అందించే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ఆగిపోయాయంటూ కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ.. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.

హుస్నాబాద్ అభివృద్ధి పనుల జాతర.. పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో హుస్నాబాద్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

అక్కన్నపేట నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్ల రహదారికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు మొదలవుతాయని చెప్పారు.

నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ కళాశాల, 250 పడకల ఆసుపత్రి, ఎల్లమ్మ చెరువు, ఇండస్ట్రియల్ పార్క్, అర్బన్ ఫారెస్ట్, కరీంనగర్ నాలుగు లైన్ల రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. గిరిజన తండాలకు రహదారులు, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

CM Revanth Reddy to Launch India's First Indiramma Family Insurance in Siddipet Tomorrow

గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ఖాతాలోకి మళ్లించుకుంటే, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం పంచాయతీలకు వచ్చే నిధులు, పన్నుల ఆదాయాన్ని ఆయా పంచాయతీలే నేరుగా ఖర్చు చేసుకునే స్వేచ్ఛ కల్పించామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, అలింకో సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement