Trump vs Venezuela | ప్రస్తుతం వెనిజులా దేశం పరిస్థితి దారుణంగా ఉంది. ఆ దేశ ప్రెసిడెంట్‌ని బందీగా చేసి యూఎస్‌కి తీసుకెళ్లిన అమెరికా.. వెనిజులాలో కొత్త ప్రెసిడెంట్ వచ్చినా తమ మాటే నెగ్గాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నది. తాజాగా వెనిజులా దేశానికి ట్రంప్ చమురు విషయంలో అల్టిమేటం జారీ చేశారు. వెనిజులా దేశాన్ని కూడా తానే పాలిస్తాను అనే విధంగా ఉన్నాయి ట్రంప్ వ్యాఖ్యలు. ప్రస్తుతం యూఎస్‌కి 30 మిలియన్ బ్యారెళ్ల చమురుని వెనిజులా పంపిస్తుంది. కానీ.. ఇక నుంచి 30 కాదు 50 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ని యూఎస్‌కి మార్కెట్ ధరకే పంపించాలని ట్రంప్ వెనిజులాకి అల్టిమేటం జారీ చేశారు. ఇరు దేశాల ప్రజల లబ్ధి కోసమే మార్కెట్ ధరకు యూఎస్ ఆయిల్‌ని తీసుకుంటుందని.. ఆ డబ్బులను వెనిజులా, యూఎస్ ప్రజల కోసమే వెచ్చిస్తామని ట్రంప్ ప్రకటించారు. వెనిజులా దేశం అభివృద్ధి చెందేందుకు యూఎస్ కట్టుబడి ఉందన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యానించారు. క్షణాల్లో పడిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలు ట్రంప్ ఈ ప్రకటన చేయగానే యూఎస్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ధరలు 1.3 శాతం పడిపోయాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్‌కి క్రూడ్ ఆయిల్ ధర 56.39 డాలర్లుగా ఉంది. త్వరలోనే వెనిజులాలోని ఆయిల్ కంపెనీలతో వైట్ హౌస్ అధికారులు సమావేశం అయి యూఎస్‌కి పంపించే చమురుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.