త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?

బాంబులు పడ్డాయి.. దేశాలు దద్దరిల్లాయి.. కానీ అమెరికా మాత్రం అధికారికంగా ఒక్క ‘యుద్ధం’ కూడా చేయలేదట! 1942 రెండో ప్రపంచ యుద్ధం నుంచి నేటి ఇరాన్ చర్యల వరకు, కాంగ్రెస్ ప్రకటన లేకుండా అమెరికా నడిపిస్తున్న సైనిక పోరాటాల వెనుక ఉన్న అసలు చట్టపరమైన వ్యూహం ఇదిగో.

S

International | Published On Sep 23, 2026, 6.00 am IST

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?

సంక్షిప్త సారాంశం

గత 84 ఏళ్లుగా అమెరికా కాంగ్రెస్ అధికారికంగా ఏ దేశంపైనా ‘యుద్ధ ప్రకటన’ చేయకపోయినా సరే, ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం ఆగలేదు. 'మిలిటరీ ఆపరేషన్ల' పేరిట అమెరికా సాగిస్తున్న సైనిక బలప్రయోగం వెనుక ఉన్న చారిత్రక, న్యాయపరమైన లోతుపాతుల విశ్లేషణ.

Advertisement

                          కొరియా టు ఇరాన్.. యుద్ధాలు ఎన్నో! అమెరికా లెక్కలో మాత్రం ‘యుద్ధాలు’ సున్నా!

 

భారీగా ప్రాణాలు పోయాయి.. నగరాలు శిథిలాలయ్యాయి.. వేలాది బాంబులు పేలాయి.. యుద్ధ విమానాలు నిప్పులు కురిపించాయి.. క్షిపణులు దూసుకెళ్లాయి.. ప్రభుత్వాలే కూలిపోయాయి. కొరియా నుంచి వియత్నాం వరకు.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాక్ వరకు.. ఇప్పుడు ఇరాన్ దాకా—ప్రపంచం కళ్లముందు జరిగిన భీకర పోరాటాలివి. అయినా నమ్మడానికి కష్టమైన నిజం ఒకటుంది. 1942 తర్వాత అమెరికా కాంగ్రెస్ ఒక్కసారి కూడా అధికారికంగా ‘యుద్ధం’ ప్రకటించలేదు! మరి ఇన్ని ప్రాణాలు తీసిన పోరాటాలు ఏమిటి? వాటికి అమెరికా పెట్టిన పేర్లేంటి? ‘యుద్ధం’ ప్రకటించకుండానే ఇంతటి సైనిక బలప్రయోగం ఎలా సాధ్యమైంది? ఇక్కడే అమెరికా యుద్ధ చరిత్రలో అసలు ట్విస్ట్ ఉంది. యుద్ధాలు ఆగలేదు.. వాటిని చట్టపరంగా నడిపించే పద్ధతి మారిపోయింది.

ఇరాన్‌లో బాంబుల మోత.. పేరు ‘ఎపిక్ ఫ్యూరీ’!

తాజా ఉదాహరణ ఇరాన్. 2026 ఫిబ్రవరి 28న అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) పేరుతో ఇరాన్‌పై భారీ సైనిక చర్య ప్రారంభించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ లెక్కల ప్రకారం తొలి ఏడు రోజుల్లోనే 3,000కు పైగా లక్ష్యాలపై దాడులు జరిగాయి. బీ-1, బీ-2, బీ-52 బాంబర్లు, ఎఫ్-15 నుంచి ఎఫ్-35 వరకు యుద్ధ విమానాలు, విమాన వాహక నౌకలు, క్షిపణి విధ్వంసక నౌకలను రంగంలోకి దించింది. ఇంతటి సైనిక పోరు జరిగినా ఇరాన్‌పై అమెరికా కాంగ్రెస్ నుంచి అధికారిక యుద్ధ ప్రకటన (Formal Declaration of War) మాత్రం రాలేదు. అంటే ప్రపంచం దాన్ని యుద్ధంగా పిలిచినా, అమెరికా రాజ్యాంగ చరిత్రలో మాత్రం అది రెండో ప్రపంచ యుద్ధం తరహాలో అధికారికంగా ప్రకటించిన యుద్ధం కాదు.

200 ఏళ్ల చరిత్ర.. యుద్ధ ప్రకటనలు 11 మాత్రమే!

అమెరికా చరిత్ర మొత్తంలో కాంగ్రెస్ చేసిన అధికారిక యుద్ధ ప్రకటనలు కేవలం 11. అవి ఐదు ప్రధాన యుద్ధాలకు సంబంధించినవి. 1812లో బ్రిటన్‌తో మొదలైన ఈ జాబితాలో మెక్సికో, స్పెయిన్ ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీలపై; రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్, జర్మనీ, ఇటలీ, బల్గేరియా, హంగేరీ, రొమేనియాలపై అమెరికా అధికారికంగా యుద్ధం ప్రకటించింది. చివరివి 1942 జూన్‌లో బల్గేరియా, హంగేరీ, రొమేనియాలపై యుద్ధ ప్రకటనలు వచ్చాయి. అక్కడితో జాబితా ఆగిపోయింది. అమెరికా సెనేట్ అధికారిక రికార్డు ప్రకారం ఆ తర్వాత ఒక్క అధికారిక యుద్ధ ప్రకటన కూడా లేదు.

ఆగిన యుద్ద ప్రకటన ఆగింది.. వరుస కట్టిన సైనిక పోరాటాలు !

అసలు ఆసక్తికరమైన కథ 1942 తర్వాతే మొదలవుతుంది. అమెరికా అధికారికంగా యుద్ధం ప్రకటించడం ఆపేసింది. కానీ భారీ సైనిక పోరాటాల్లో పాల్గొనడం మాత్రం ఆపలేదు.

కొరియా యుద్ధం (1950–53): మొత్తం యుద్ధానికి ఒకే ఆపరేషన్ పేరు లేదు. కీలకమైన ఇంచాన్ దాడికి ‘ఆపరేషన్ క్రోమైట్’ (Operation Chromite) అని పేరు పెట్టారు. తర్వాతి దశల్లో ‘ఆపరేషన్ కిల్లర్’ (Operation Killer), ‘ఆపరేషన్ రిప్పర్’ (Operation Ripper) వంటి పేర్లతో సైనిక చర్యలు జరిగాయి.

వియత్నాం యుద్ధం (1955–75): దాదాపు రెండు దశాబ్దాలు సాగిన ఈ పోరులో అమెరికా ప్రత్యక్ష భారీ సైనిక పాత్ర ప్రధానంగా 1965–73 మధ్య కనిపించింది. అయినా కాంగ్రెస్ అధికారికంగా యుద్ధం ప్రకటించలేదు. 1964లో ‘టాంకిన్ గల్ఫ్ తీర్మానం’ తర్వాత అమెరికా సైనిక జోక్యం భారీగా విస్తరించింది. ఉత్తర వియత్నాంపై దీర్ఘకాలిక వైమానిక దాడులకు ‘ఆపరేషన్ రోలింగ్ థండర్’ (Operation Rolling Thunder) అని పేరు పెట్టారు. చివరి దశలో భారీ వైమానిక దాడులు ‘ఆపరేషన్ లైన్‌బ్యాకర్’ (Operation Linebacker), ‘లైన్‌బ్యాకర్–2’ (Linebacker II) పేర్లతో జరిగాయి.

గల్ఫ్ పోరు (1991): ఇరాక్ కువైట్‌ను ఆక్రమించిన తర్వాత అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు రంగంలోకి దిగాయి. సైనిక సమీకరణకు ‘ఆపరేషన్ డెజర్ట్ షీల్డ్’ (Operation Desert Shield), ప్రత్యక్ష యుద్ధ చర్యలకు ‘ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్’ (Operation Desert Storm) అని పేర్లు పెట్టారు.

ఆఫ్ఘనిస్తాన్ (2001): 9/11 దాడుల తర్వాత ప్రారంభించిన ప్రధాన సైనిక చర్యకు ‘ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్’ (Operation Enduring Freedom) అని పేరు పెట్టారు. తర్వాతి దశలో ‘ఆపరేషన్ ఫ్రీడమ్స్ సెంటినెల్’ (Operation Freedom’s Sentinel) పేరును ఉపయోగించారు.

ఇరాక్ (2003): సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేపట్టిన దండయాత్రకు ‘ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్’ (Operation Iraqi Freedom) అని పేరు పెట్టారు. తర్వాతి దశలో ‘ఆపరేషన్ న్యూ డాన్’ (Operation New Dawn)పేరుతో అమెరికా సైనిక కార్యకలాపాలు కొనసాగాయి.

ఇరాన్ (2026): ఇప్పుడు అదే వరుసలో ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury). భారీ సైనిక బలప్రయోగం జరిగినా ఇరాన్‌పై కూడా కాంగ్రెస్ అధికారికంగా యుద్ధం ప్రకటించలేదు.

పేర్లు మారాయి.. లక్ష్యాలు మారాయి.. చట్టపరమైన ఆధారాలు కూడా ఒకేలా లేవు. కానీ వీటన్నింటిలో ఒక విషయం మాత్రం కామన్. దేనికీ రెండో ప్రపంచ యుద్ధం తరహాలో అమెరికా కాంగ్రెస్ అధికారిక యుద్ధ ప్రకటన చేయలేదు.

అసలు ‘యుద్ధ ప్రకటన’ ఎందుకు మాయమైంది?

దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి ఏర్పడటంతో ఒక దేశం తనకు నచ్చినప్పుడు మరో దేశంపై బలప్రయోగానికి దిగే పాత పద్ధతికి అంతర్జాతీయ చట్టాలు అడ్డుకట్ట వేశాయి. ఆత్మరక్షణ లేదా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అనుమతి వంటి చట్టబద్ధమైన కారణాలు అవసరమయ్యాయి. అమెరికాలోనూ యుద్ధం నడిపే పద్ధతి మారింది. అక్కడ ప్రతినిధుల సభ (House of Representatives), సెనేట్ (Senate) కలిపి ‘కాంగ్రెస్’ అంటారు; ఇది మన పార్లమెంట్ తరహా శాసన వ్యవస్థ. అధికారికంగా యుద్ధం ప్రకటించే అధికారం ఈ కాంగ్రెస్‌కే ఉంది. అయితే ప్రతి సైనిక చర్యకు యుద్ధ ప్రకటన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రత్యేకంగా సైనిక బలప్రయోగానికి అనుమతి ఇవ్వొచ్చు; కొన్ని పరిమిత పరిస్థితుల్లో అధ్యక్షుడు తన రాజ్యాంగ అధికారాలతోనూ సైనిక చర్యకు ఆదేశించవచ్చు. దీంతో పూర్తి స్థాయి ‘యుద్ధ ప్రకటన’ కంటే ఈ మార్గమే అధ్యక్షులకు వేగంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించింది సూటిగా చెప్పాలంటే.. యుద్ధాలు ఆగలేదు. వాటిని అధికారికంగా ‘యుద్ధం’గా ప్రకటించే పాత పద్ధతి తగ్గిపోయి, అవసరాన్ని బట్టి ‘సైనిక చర్య’ చేపట్టే విధానం ముందుకొచ్చింది.

అమెరికాకు ‘యుద్ధం’ కాదు.. ప్రపంచానికి కూడా కాదా?

ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. అమెరికా కాంగ్రెస్ యుద్ధం ప్రకటించకపోయినా రెండు దేశాల మధ్య వాస్తవంగా సైనిక బలప్రయోగం జరిగితే అంతర్జాతీయ మానవతా చట్టం దాన్ని అంతర్జాతీయ సాయుధ ఘర్షణ (International Armed Conflict)గా గుర్తించవచ్చు. అంటే అమెరికా తన చర్యకు ‘ఆపరేషన్’ అని పేరు పెట్టినంత మాత్రాన అది అంతర్జాతీయ చట్టం పరిధి నుంచి బయటకు వెళ్లదు. అక్కడ పేరు కాదు.. నేలపై నిజంగా సాయుధ ఘర్షణ జరుగుతోందా లేదా అన్నదే కీలకం. అందుకే అమెరికా గత 84 ఏళ్ల సైనిక చరిత్రను ఒక్క లైనులో చెప్పాలంటే,
పేర్లు మారాయి.. బాంబులు ఆగలేదు.. పోరాటాలు ఆగలేదు.. 1942 దగ్గర ఆగిపోయింది మాత్రం ‘అధికారిక యుద్ధ ప్రకటన’ మాత్రమే !

Advertisement
Advertisement