త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta Platforms | మెటా ప్లాట్‌ఫామ్స్ ఒక ప‌బ్లిక్ న్యూసెన్స్‌.. న్యూమెక్సికో కోర్టు షాకింగ్ తీర్పు.. సంస్థ‌కు రూ.5400 కోట్ల జ‌రిమానా..

Meta Platforms | అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర కోర్టు మెటాకు మరో భారీ షాకిచ్చింది. చిన్నారుల‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కలిగించే ప్రమాదాలపై ప్రజలను హెచ్చరించడంలో మెటా విఫలమైందని తేల్చిన న్యూ మెక్సికో న్యాయమూర్తి బ్రయాన్ బీడ్‌షెయిడ్ మెటాపై అదనంగా 567 మిలియన్ డాలర్ల‌ (సుమారు రూ.5400 కోట్లు) జ‌రిమానా విధించారు.

S

International | Published On Aug 7, 2026, 5.57 pm IST

Meta Platforms | మెటా ప్లాట్‌ఫామ్స్ ఒక ప‌బ్లిక్ న్యూసెన్స్‌.. న్యూమెక్సికో కోర్టు షాకింగ్ తీర్పు.. సంస్థ‌కు రూ.5400 కోట్ల జ‌రిమానా..
Advertisement

Meta Platforms | అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర కోర్టు మెటాకు మరో భారీ షాకిచ్చింది. చిన్నారుల‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కలిగించే ప్రమాదాలపై ప్రజలను హెచ్చరించడంలో మెటా విఫలమైందని తేల్చిన న్యూ మెక్సికో న్యాయమూర్తి బ్రయాన్ బీడ్‌షెయిడ్ మెటాపై అదనంగా 567 మిలియన్ డాలర్ల‌ (సుమారు రూ.5400 కోట్లు) జ‌రిమానా విధించారు. దీంతో చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశంలో మెటాపై విధించిన అతిపెద్ద జరిమానాగా ఇది నిలిచింది. ఇప్పటికే ఇదే కేసులో మెటాకు 375 మిలియన్ డాలర్ల జరిమానా విధించగా, తాజా తీర్పుతో మొత్తం జరిమానా 942 మిలియన్ డాలర్లకు చేరింది. న్యాయమూర్తి బ్రయాన్ బీడ్‌షెయిడ్ తన తీర్పులో మెటాను ప్రజలకు ఇబ్బంది కలిగించే పబ్లిక్ న్యూసెన్స్ గా అభివర్ణించారు. గాలి కాలుష్యం ఎలా సమాజానికి హానికరమో, అదే విధంగా మెటా ప్లాట్‌ఫామ్‌లు పిల్లలకు మానసిక నష్టమ‌ని, లైంగిక దోపిడీ ప్రమాదాలను పెంచుతున్నాయని అన్నారు. అందుకే ఈ జరిమానా మొత్తాన్ని భవిష్యత్తులో ఇటువంటి నష్టాలను తగ్గించే ప్రత్యేక నిధిగా ఉపయోగించాలని ఆదేశించారు. మెటాను ఒక ఫ్యాక్టరీతో పోల్చిన న్యాయమూర్తి ప్రకటనలు, కంటెంట్ ఆ సంస్థ ఉత్పత్తులైతే, పిల్లలకు కలిగే మానసిక నష్టం, లైంగిక దోపిడీ ఆ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యం లాంటివని పేర్కొన్నారు.

అప్పీల్ చేస్తామ‌న్న మెటా..

కాగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లను నిర్వహిస్తున్న మెటా ఈ తీర్పును అంగీకరించడం లేదు. కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ తీర్పుతో విభేదిస్తున్నామని, దీనిపై అప్పీల్ చేస్తామని తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్‌లను సురక్షితంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, హానికర కంటెంట్, దుర్వినియోగదారులను గుర్తించి తొలగించడంలో ఉన్న సవాళ్ల గురించి ఎప్పటికప్పుడు పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మెటా పేర్కొంది. టీనేజ్ వినియోగదారుల భద్రత విషయంలో తమ పనితీరుపై విశ్వాసం ఉందని, వాస్తవాలను వక్రీకరించే ఆరోపణలను కోర్టులో ఎదుర్కొంటామని తెలిపింది. ఇప్పటికే విధించిన 375 మిలియన్ డాలర్ల జరిమానాపైనా మెటా అప్పీల్ చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. పిల్లల భద్రత అంశంలో మెటాపై ఒక రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా దావా గెలిచిన తొలి ఘటన ఇదే కావ‌డం విశేషం.

మెటాపై అనేక కేసులు..

అమెరికాలో ఇలాంటి అంశాలపై మెటా ప్రస్తుతం వేలాది కేసులను ఎదుర్కొంటోంది. న్యూ మెక్సికో కేసుతోపాటు ఈ ఏడాది ప్రారంభంలో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మరో కీలక కేసులో కూడా వ్యసనపరచే విధంగా ప్లాట్‌ఫామ్‌లను రూపొందించిన సంస్థ‌గా మెటాను పరిగణించవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) మాజీ యూరప్ వైస్ ప్రెసిడెంట్ బ్రూస్ డైస్లీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ భారీ జరిమానా మెటా ఆదాయంతో పోలిస్తే సముద్రంలో ఒక చుక్క లాంటిదేనని అన్నారు. మెటా తాజా ఆర్థిక ఫలితాల ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కంపెనీ 61 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 28 శాతం ఎక్కువ కావ‌డం విశేషం. అయితే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా పరిస్థితులు మారుతున్నాయనే సంకేతంగా ఈ తీర్పును చూడవచ్చని బ్రూస్ డైస్లీ అభిప్రాయపడ్డారు.

సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు చిక్కులే..

మాజీ బ్రిటిష్ సేఫ్‌గార్డింగ్ మంత్రి జెస్ ఫిలిప్స్ మాట్లాడుతూ అమెరికాలో బిగ్ టెక్ కంపెనీలపై జరుగుతున్న కోర్టు పోరాటాలు యూకేకు కూడా మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తాయని, అమెరికాతో దౌత్య సంబంధాలు దెబ్బతింటాయనే భయం తగ్గుతుందని చెప్పారు. ఈ కేసు 2023లో న్యూ మెక్సికో రాష్ట్ర అటార్నీ జనరల్ దాఖలు చేసిన దావాతో ప్రారంభమైంది. మెటా ప్లాట్‌ఫామ్‌లు పిల్లలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టాయని, లైంగికంగా అసభ్యకరమైన కంటెంట్‌తోపాటు లైంగిక నేరస్థులతో పరిచయాలకు అవకాశం కల్పించాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. విచారణ తొలి దశలో న్యూ మెక్సికో అన్యాయ వ్యాపార పద్ధతుల చట్టాన్ని మెటా పలుమార్లు ఉల్లంఘించిందని కోర్టు తేల్చింది. ముఖ్యంగా మెటా రికమెండేషన్ అల్గోరిథమ్‌లు యువ వినియోగదారులను హానికర కంటెంట్, ప్రమాదకర వ్యక్తుల వైపు మళ్లిస్తున్నాయని గుర్తించింది.

మెటాకు ఇదే భారీ జరిమానా..

వినియోగదారులకు ఏ కంటెంట్ చూపించాలో ఆటోమేటిగ్గా ఎంపిక చేసే వ్యవస్థలే రికమెండేషన్ అల్గోరిథమ్‌లు కాగా, విచారణ రెండో దశలో న్యాయమూర్తి మెటా చర్యలు పబ్లిక్ న్యూసెన్స్ స్థాయికి చేరాయని తీర్పునిచ్చారు. అంటే ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే కాకుండా సమాజ ఆరోగ్యం, భద్రతపై విస్తృత ప్రభావం చూపుతున్న అంశంగా పేర్కొన్నారు. పిల్లల భద్రత విషయంలో మెటాపై విధించిన అత్యంత భారీ జరిమానా ఇదే కాకుండా, ఒక సోషల్ మీడియా సంస్థను పబ్లిక్ న్యూసెన్స్ గా కోర్టు ప్రకటించడం కూడా ఇదే తొలిసారి. తన తీర్పులో న్యాయమూర్తి, ఫ్యాక్టరీ నుంచి వచ్చే విషపూరిత కాలుష్యం స్వచ్ఛమైన గాలిపై ప్రజల హక్కును ఎలా దెబ్బతీస్తుందో, అదే విధంగా మెటా ప్లాట్‌ఫామ్‌ల వల్ల పిల్లలకు కలిగే హానికర ప్రభావాలు కూడా సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఈ ప్రభావాలు కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకే పరిమితం కాకుండా మొత్తం ఇంటర్నెట్‌లోకి, చివరికి వాస్తవ జీవితంలోనూ వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా పిల్లలు, వారి కుటుంబాలు మాత్రమే కాకుండా పాఠశాలలు, ఆసుపత్రులు, చట్ట అమలు సంస్థలపై కూడా అదనపు సామాజిక భారం పడుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

న‌ష్ట‌పోయిన పిల్ల‌ల చికిత్స‌కు..

తీర్పు ప్రకారం మెటా ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక నిధిని ఈ హానికర ప్రభావాలను తగ్గించే కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంటుంది. మొత్తం 420 మిలియన్ డాలర్లు ఇప్పటికే మెటా ప్లాట్‌ఫామ్‌ల వల్ల నష్టపోయిన పిల్లలకు చికిత్స అందించేందుకు, తగిన క్లినికల్, ప్రవర్తనా ఆరోగ్య సేవలు అందించే కార్యక్రమాలకు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. మరో భాగం నిధులను అవగాహన, నివారణ చర్యలకు వినియోగించాల‌ని, ఇందులో ఉపాధ్యాయులు, ఆరోగ్య నిపుణులకు సోషల్ మీడియా వల్ల పిల్లలకు కలిగే నష్టాలను ఎలా గుర్తించాలి, ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాలని పేర్కొంది. అలాగే మెటా వెంటనే అమలు చేయాల్సిన పలు కీలక ఆదేశాలను కూడా కోర్టు జారీ చేసింది.

మెటాకు త‌క్ష‌ణ ఆదేశాలు..

18 ఏళ్లలోపు వినియోగదారుల ఖాతాలను పెద్దలకు ఎలాంటి సిఫార్సుల ద్వారా చూపించకూడదు. అలాగే పెద్దలు మైనర్ వినియోగదారులకు నేరుగా సందేశాలు పంపకుండా నిరోధించాలి. మైనర్ వినియోగదారులు నగ్న చిత్రాలను పంపడం లేదా స్వీకరించడం పూర్తిగా నిషేధించాలి. పిల్లల లైంగిక దోపిడీకి పాల్పడే పెద్దలపై వన్ స్ట్రైక్ పాలసీ అమలు చేసి, ఒక్కసారి ఉల్లంఘన జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలి. 18 ఏళ్లలోపు వినియోగదారులకు లైక్ ల సంఖ్య కనిపించకుండా చేయాలి. ప్రతి రోజు రాత్రి 10 నుంచి ఉదయం 7 గంటల వరకు మైనర్లకు పుష్ నోటిఫికేషన్‌లు పంపకూడదు. అలాగే పాఠశాలలు నడిచే రోజుల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వారాంతాలు మినహా నోటిఫికేషన్‌ల‌ను నిలిపివేయాలి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో 18 ఏళ్లలోపు వినియోగదారుల వినియోగాన్ని నెలకు గరిష్టంగా 90 గంటలకు పరిమితం చేయాలి. అంటే రోజుకు సుమారు మూడు గంటల వినియోగ పరిమితి అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.

వ‌చ్చేవారం మ‌రో విచార‌ణ‌..

పిల్లల భద్రత కోసం యూకే, యూరోపియన్ యూనియన్ కూడా మెటా సహా సోషల్ మీడియా సంస్థలు ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలను ఆన్‌లైన్‌లో గుర్తించడం లేదా వారిని సంప్రదించే అవకాశాలను తగ్గించే వ్యవస్థలపై ఇటీవల దృష్టి సారిస్తున్నాయి. అలాగే అనేక దేశాలు పిల్లలను పూర్తిగా సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచే చట్టాల దిశగా కూడా అడుగులు వేస్తున్నాయి. యూకే తాజాగా 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి నిషేధించడంతో పాటు, అంతకంటే పెద్ద వయసు టీనేజర్లు కూడా రాత్రి వేళల్లో సోషల్ మీడియా ఉపయోగించకుండా క‌ర్ఫ్యూ విధించే ప్రతిపాదనను ప్రకటించింది. కాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో వచ్చే వారం మెటాపై మరో కీలక విచారణ ప్రారంభం కానుంది. పిల్లల గోప్యతా చట్టాలను మెటా ఉల్లంఘించిందంటూ మూడు అమెరికా రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌ మరో కేసు దాఖలు చేశారు.

Advertisement
Advertisement