త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

       ఆ ఒక్క క్లిక్‌తో ఖజానా ఖాళీ: ‘Boss Scam’ పేరుతో చెలరేగుతున్న డిజిటల్ గ్యాంగ్స్!

ఒక్క క్లిక్... క్షణాల్లో మీ వాట్సాప్ వేరేవారి చేతుల్లోకి! మరుసటి క్షణమే మీ కంపెనీ అకౌంట్లోని సొమ్మంతా ఖాళీ! ఆడిట్ రిపోర్టులు, అత్యవసర ప్రభుత్వ నోటీసుల పేరిట సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు పక్కా కార్పొరేట్ శైలిలో 'బాస్ స్కామ్'తో కొత్త తరహా దోపిడీకి తెరలేపారు. కార్పొరేట్ ఫైనాన్స్ టీమ్‌లు, సీఏలనే లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ డిజిటల్ నెట్‌వర్క్ దాడితో ఇప్పుడు సరికొత్త సైబర్ కలకలం మొదలైంది."

S

Andhra pradesh | Published On Aug 7, 2026, 5.48 pm IST

       ఆ ఒక్క క్లిక్‌తో ఖజానా ఖాళీ: ‘Boss Scam’ పేరుతో చెలరేగుతున్న డిజిటల్ గ్యాంగ్స్!

సంక్షిప్త సారాంశం

మీ వాట్సాప్‌కో, ఈమెయిల్‌కో అత్యవసర నోటీసంటూ ఒక ఫైల్ వచ్చిందా... ఆ ఒక్క క్లిక్‌తో మీ కంపెనీ ఖజానా ఖాళీ అయిపోవడమే కాదు, మీరూ రోడ్డున పడే ప్రమాదం ఉంది! సామాన్యులను బురిడీ కొట్టించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన సైబర్ నేరగాళ్లు, ఇప్పుడు పక్కా కార్పొరేట్ శైలిలో రూ.కోట్లు కొల్లగొట్టే 'బాస్ స్కామ్'తో విరుచుకుపడుతున్నారు. ఆడిట్ నివేదికలు, ఆర్‌బీఐ నోటీసుల పేరిట నిశ్శబ్దంగా చొరబడుతున్న ట్రోజన్ మాల్‌వేర్‌తో వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేస్తూ కంపెనీల నిధులను మ్యూల్ ఖాతాలకు మళ్లిస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్పొరేట్ దిగ్గజాలు, సీఏలు, ఫైనాన్స్ టీమ్‌లను వణికిస్తున్న ఈ నయా సైబర్ ఉచ్చుపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది."

Advertisement

                       ‘బాస్ స్కామ్’తో కొత్త తరహా దోపిడీ.. కార్పొరేట్ ఫైనాన్స్ టీమ్‌లే టార్గెట్

"కంపెనీ ఆడిట్ నివేదిక వచ్చింది చూడండి... ఆర్‌బీఐ నుంచి అత్యవసర నోటీస్ వచ్చింది వెంటనే ఓపెన్ చేయండి..." అంటూ మీ వాట్సాప్‌కో, ఈమెయిల్‌కో ఓ ఫైల్ వస్తే ఏమాత్రం తొందరపడి క్లిక్ చేయకండి! ఆ ఒక్క క్లిక్ మీ కంపెనీ ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా, మిమ్మల్ని నడిరోడ్డున పడేస్తుంది. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు తమ దారి మార్చారు. సామాన్యులను బురిడీ కొట్టించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, పక్కా కార్పొరేట్ శైలిలో కోట్లకు కోట్లు కొల్లగొట్టే కొత్త తరహా దాడికి తెరతీశారు. అదే 'బాస్ స్కామ్'! ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్పొరేట్ దిగ్గజాలు, ఆర్థిక విభాగాలు, కంపెనీ డైరెక్టర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లను (CA) లక్ష్యంగా చేసుకుని ముమ్మరంగా సాగుతున్న ఈ ప్రమాదకర మాల్‌వేర్ దాడిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

జిప్ ఫైల్ రూపంలో నిశ్శబ్ద మాల్‌వేర్!

ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా వెలుగుచూసిన ఈ సైబర్ నేరాల వెనుక పక్కా వ్యూహం ఉంది. బాధితులకు వాట్సాప్, ఎస్ఎమ్‌ఎస్ లేదా ఈమెయిల్ ద్వారా Statement of Account.zip, 0714 Statement of Account.zip, లేదా RBI.zip, MCA.zip వంటి పేర్లతో ఒక కాంప్రెస్డ్ (.zip) ఫైల్ పంపుతారు. అది ఆదాయపన్ను శాఖనో, ఆర్‌బీఐనో పంపిన అత్యవసర నోటీసులా నమ్మిస్తారు. ఆ ఫైల్‌ను కంప్యూటర్‌లో ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఓపెన్ చేయగానే, అందులోని ట్రోజన్ మాల్‌వేర్ (Trojan Malware) క్షణాల్లో సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది. అనంతరం విండోస్ కంప్యూటర్‌లో ఓపెన్ చేసి ఉన్న వాట్సాప్ వెబ్ (WhatsApp Web) సెషన్‌ను హ్యాకర్లు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంటారు.

గొలుసుకట్టు దాడి.. బాస్ పేరిట నకిలీ హుకుం!

ఒక్కసారి వాట్సాప్ హ్యాక్ అయ్యాక ఈ మాల్‌వేర్ అక్కడితో ఆగదు. బాధితుడి ఫోన్ కాంటాక్ట్ లిస్ట్, వాట్సాప్ గ్రూపులన్నింటికీ అదే మాల్‌వేర్ ఫైల్‌ను ఆటోమేటిక్‌గా పంపుతుంది. "ఈ ఫైల్‌ను మీ కంపెనీ ఫైనాన్స్ మేనేజర్‌కు పంపి వెంటనే పరిశీలించండి" అని సందేశం జోడిస్తారు. దానిని అందుకున్న ఉద్యోగి, తమ ఉన్నతాధికారి పంపారనే నమ్మకంతో ఓపెన్ చేసి మాల్‌వేర్ ఉచ్చులో పడతారు. ఆ తర్వాత కథ వేరేలా ఉంటుంది. సంస్థల సీఈఓల ఒరిజినల్ వాట్సాప్ ఖాతా నుంచి లేదా వారి పేరుతో సేవ్ చేసిన నకిలీ నంబర్ల నుంచి ఆర్థిక విభాగం ఉద్యోగులకు "అత్యవసరంగా ఈ క్రింది ఖాతాలకు నిధులు బదిలీ చేయండి" అని మెసేజ్‌లు వెళ్తాయి. అది నిజమైన సీఈఓ ఆదేశమేనని నమ్మిన సిబ్బంది లక్షలాది రూపాయలను నేరుగా హ్యాకర్ల నకిలీ ఖాతాలకు పంపి దారుణంగా మోసపోతున్నారు.

డేంజర్ బెల్స్.. రంగంలోకి దిగిన కేంద్రం!

ఈ సైబర్ దాడి 'డిఎల్ఎల్ సైడ్‌లోడింగ్' అనే అత్యంత ఆధునిక సాంకేతికతతో యాంటీ-మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్‌లకు కూడా దొరక్కుండా జరుగుతోందని I4C సాంకేతిక విభాగం తెలిపింది. అయితే ఈ సైబర్ బెదిరింపులను తిప్పికొట్టేందుకు కేంద్రం ముమ్మర చర్యలు చేపట్టింది. I4C కి చెందిన 'సాహ్యోగ్ పోర్టల్' ద్వారా హ్యాకర్ల నియంత్రణ సర్వర్లను బ్లాక్ చేసి ఇప్పటివరకు 10,000 మందికి పైగా భారతీయులను కాపాడారు. గడిచిన నెల రోజుల్లోనే సంభావ్య బాధితులను గుర్తించి I4CMHA-G అనే ఎస్ఎమ్‌ఎస్ హెడర్ ద్వారా ఏకంగా 58,000 మందికి పైగా పౌరులకు ఆటోమేటిక్ హెచ్చరికలు పంపింది. మైక్రోసాఫ్ట్, సెర్ట్-ఇన్ (CERT-In)లతో పాటు క్విక్ హీల్, K7, నెట్ ప్రొటెక్టర్ వంటి ప్రముఖ సెక్యూరిటీ కంపెనీలకు ఈ మాల్‌వేర్ వివరాలను అందించి సిస్టమ్స్‌ను సురక్షితం చేస్తున్నారు.

ఈ సైబర్ మూకల దాడి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి!

సాంకేతికత ఎంత పెరుగుతోందో, దానికి తోడుగా సైబర్ నేరగాళ్ల దోపిడీ మార్గాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అలాంటి సందేశాలపై నిర్లక్ష్యం వహిస్తే ఘోరంగా దెబ్బతింటాం... నిరంతరం అప్రమత్తంగా ఉండటమే మనకు రక్షణగా నిలుస్తుంది!
  • వాట్సాప్‌లో లేదా ఈమెయిల్‌లో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఎలాంటి .zip లేదా .exe ఫైళ్లను తెరవకండి. ఆర్‌బీఐ లేదా ఇతర ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ వాట్సాప్‌లో ఆడిట్ నివేదికలను, నోటీసులను పంపవు.
  • మీ వాట్సాప్‌లోని Settings > Linked Devices ఆప్షన్‌లోకి వెళ్లి తరచూ తనిఖీ చేయండి. మీరు ప్రస్తుతం ఉపయోగించని వాట్సాప్ వెబ్ సెషన్లు ఉంటే వెంటనే లాగ్ అవుట్ (Log Out) చేయండి.
  • వాట్సాప్‌లో ఎంతటి ఉన్నతాధికారి నుంచి మెసేజ్ వచ్చినా... అత్యవసరంగా నిధులు బదిలీ చేయమంటే గుడ్డిగా నమ్మకండి. ఒక సాధారణ ఫోన్ కాల్ చేసి నోటిమాట ద్వారా నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయండి.
మీ ఆఫీసులో, మీ చుట్టుపక్కల ఉండే ఆర్థిక విభాగాల సిబ్బందిని, మిత్రులను ఈ కొత్త సైబర్ ముప్పు గురించి చైతన్యపరచడం మనందరి బాధ్యత. ఒకవేళ మీరు లేదా మీ సంస్థ ఈ డిజిటల్ స్కామ్ బారిన పడితే... ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. మన అప్రమత్తత మాత్రమే మన కష్టార్జితాన్ని కాపాడగలదు!
Advertisement
Advertisement