త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Artemis-2 | సూర్యుడిపై కన్నేసిన నాసా..! కారణాలు ఏంటో తెలుసా..?

Artemis-2 | ఆస్ట్రోనాట్స్‌కు అంతరిక్ష ప్రయాణాల సమయంలో కిరణజనిత వ్యాధులు (రేడియేషన్ సిక్‌నెస్) ప్రమాదకరమని నాసా స్పష్టం చేసింది. ఏప్రిల్‌ ఒకటిన ఆర్టెమిస్‌-2 ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. సూర్యుడు విడుదల చేసే తీవ్ర కిరణాలను భూమి చుట్టూ ఉన్న రక్షణ కవచం అడ్డుకుంటుంది.

P

International | Published On Mar 31, 2026, 6.15 pm IST

Artemis-2 | సూర్యుడిపై కన్నేసిన నాసా..! కారణాలు ఏంటో తెలుసా..?
Advertisement

Artemis-2 | ఆస్ట్రోనాట్స్‌కు అంతరిక్ష ప్రయాణాల సమయంలో కిరణజనిత వ్యాధులు (రేడియేషన్ సిక్‌నెస్) ప్రమాదకరమని నాసా స్పష్టం చేసింది. ఏప్రిల్‌ ఒకటిన ఆర్టెమిస్‌-2 ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. సూర్యుడు విడుదల చేసే తీవ్ర కిరణాలను భూమి చుట్టూ ఉన్న రక్షణ కవచం అడ్డుకుంటుంది. అయితే, వ్యోమగాములు భూమి పరిధిని దాటి చంద్రుడి దిశగా ప్రయాణించిన సమయంలో ఈ రక్షణ దొరకదు. ఇటువంటి సమయంలో సూర్యకిరణాలు నేరుగా అంతరిక్ష నౌకను తాకే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థ (NOAA) సూర్యుడి కార్యకలాపాలపై నిశితంగా నిఘా వేసి ఉంచుతోంది.

ఆర్టెమిస్–2 ప్రయాణంలో ‘ఒరియన్’ అంతరిక్ష నౌక స్పేస్‌లో ఉన్న సమయంలో సౌర తుఫాను సంభవిస్తే వ్యోమగాములు వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్ క్లాస్ ఫ్లేర్స్‌, కరోనా మాస్ ఈజెక్షన్లు వంటి ఘటనలతో అధిక పవర్‌ ఛార్జ్ కలిగిన కణాలు భూమి సహా సౌరవ్యవస్థలోకి వేగంగా చేరుకుంటాయి. భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం కొంతవరకు రక్షణగా నిలిస్తే ఐఎస్‌ఎస్‌ సైతం దాని పరిధిలోనే ఉంటుంది. అయితే ‘ఒరియన్’ స్పేస్‌ షిప్‌ మాత్రం ఈ రక్షణకు బయటగా ఉండాల్సి రానుంది. అంతరిక్ష నౌకలో, చంద్రుడి ఉపరితలంపై కిరణాల స్థాయి పెరిగే అవకాశం ఉందని నాసా భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒరియన్ నౌకను ప్రత్యేకంగా రూపకల్పన చేసింది. సౌర తుఫాను తీవ్రత పెరిగిన సందర్భంలో వెంటనే హెచ్చరికలు పంపే వ్యవస్థను ఇందులో అమర్చారు. హెచ్చరిక వచ్చిన సమయంలో ఆస్ట్రోనాట్స్‌ నౌకలోని సురక్షిత ప్రాంతంలోకి వెళ్లి తలదాచుకునేలా ఏర్పాట్లు చేసింది. ఒరియన్ నౌకలో వివిధ ప్రాంతాల్లో కిరణాల స్థాయిని కొలిచే సెన్సార్లు అమర్చారు. వ్యోమగాములు ధరించే డోసీమీటర్లు కూడా రేడియేషన్ మోతాదును నిరంతరం నమోదు చేస్తాయి.

కిరణాల స్థాయి పెరిగితే నౌకలో అలారమ్స్‌ వారిని అప్రమత్తం చేస్తాయి. అవసరమైతే నౌకలోని కొంత భాగాన్ని తాత్కాలిక రక్షణ గదిగా మార్చుకునే వీలుంది. వ్యోమగాములు కొన్ని పరికరాలు, ఇతర సామగ్రిని బయటకు తీసి వాటిని తమ చుట్టూ అమర్చి కిరణాల నుంచి రక్షణ గోడలా ఉపయోగించుకునేలా నాసా శిక్షణ ఇచ్చింది. దాంతో కొంతవరకు ప్రభావాన్ని తగ్గించవచ్చని నాసా నిపుణులు తెలిపారు. సూర్యుడి పరిస్థితులను గమనించేందుకు ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న పలు ఉపగ్రహాలను నాసా వినియోగించనుంది. ఇందులో ఇంటర్‌స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సిలరేషన్ ప్రోబ్, సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి నిర్వహిస్తున్న సోలార్ అండ్ హెలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ, అలాగే ఎన్‌వోఏఏకు చెందిన జియోస్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్‌మెంటల్ సాటిలైట్–19 వంటి ఉపగ్రహాలు ఉన్నాయి. మార్స్‌పై ఉన్న ‘పర్సివీరెన్స్’ రోవర్ కూడా భూమి నుంచి కనిపించని సూర్యుడి మరో వైపు కార్యకలాపాలను గమనించి సమాచారం అందించనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement