త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kashmir donations to Iran | నగదు నుంచి బంగారం వరకు.. యుద్ధంలో నష్టపోయిన ఇరాన్‌కు కశ్మీరీల భారీ విరాళాలు.. “థ్యాంక్యు ఇండియా” అన్న ఇరాన్!

ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన ఇరాన్ ప్రజలను ఆదుకోవడానికి కశ్మీరీలు ముందుకొచ్చారు. యుద్ధ బాధితుల కోసం నగదు, బంగారం, పశువులను విరాళంగా ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

J

International | Published On Mar 23, 2026, 3.53 pm IST

Kashmir donations to Iran | నగదు నుంచి బంగారం వరకు.. యుద్ధంలో నష్టపోయిన ఇరాన్‌కు కశ్మీరీల భారీ విరాళాలు.. “థ్యాంక్యు ఇండియా” అన్న ఇరాన్!
Advertisement

Kashmir donations to Iran | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ ప్రజలను ఆదుకునేందుకు కశ్మీరీలు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. కశ్మీర్‌లోని బద్గామ్, బారాముల్లా జిల్లాలకు చెందిన ప్రజలు మానవతా దృక్పథంతో భారీ విరాళాల సేకరణను చేపట్టారు. ఈద్-ఉల్-ఫితర్ వేడుకల అనంతరం, వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరించారు. ప్రజలు కేవలం నగదు మాత్రమే కాకుండా బంగారం, వెండి ఆభరణాలు, పశువులు, సాంప్రదాయ రాగి వస్తువులను సైతం విరాళంగా ఇవ్వడం గమనార్హం.

భారతీయుల దాతృత్వంపై ఇరాన్ ప్రశంసలు

భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం (Iranian Embassy) కశ్మీరీల దాతృత్వంపై హర్షం వ్యక్తం చేసింది. వారు విరాళాలు ఇస్తున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ భారతీయుల మానవత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

https://x.com/Iran_in_India/status/2035720329319108879

"మానవతా దృక్పథంతో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచిన కశ్మీర్ ప్రజలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు చూపించిన ఈ దయను మేమెప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్యు ఇండియా," అని ఇరాన్ ఎంబసీ 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేసింది.

కంటతడి పెట్టిస్తున్న వితంతువు విరాళం

ఈ విరాళాల సేకరణలో చిన్నాపెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. చాలా మంది మహిళలు తమ వ్యక్తిగత బంగారు ఆభరణాలను, విలువైన వస్తువులను విరాళంగా ఇచ్చారు. కశ్మీర్‌కు చెందిన ఒక వితంతువు.. 28 ఏళ్ల క్రితం చనిపోయిన తన భర్త జ్ఞాపకార్థం ఇన్నేళ్లుగా భద్రంగా దాచుకున్న ఒక బంగారు కానుకను విరాళంగా ఇచ్చారు.

https://x.com/Iran_in_India/status/2035729890931302885

దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. "కశ్మీర్‌కు చెందిన ఒక సోదరి, తన భర్త జ్ఞాపకంగా దాచుకున్న బంగారాన్ని ఇరాన్ ప్రజల కోసం విరాళంగా ఇచ్చారు. మీ కన్నీళ్లు, స్వచ్ఛమైన భావోద్వేగాలే ఇరాన్ ప్రజలకు కొండంత అండ," అని పేర్కొంది.

చిన్నపిల్లల నుంచి ఎమ్మెల్యే వరకు..

కొంతమంది తమ పశువులను సైతం విరాళంగా ఇవ్వగా, చిన్నపిల్లలు తమ పాకెట్ మనీని, పండుగ కోసం దాచుకున్న డబ్బును విరాళంగా అందించారు. బద్గామ్ ఎమ్మెల్యే ముంతాజిర్ మెహదీ ఈ సహాయక చర్యల కోసం తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.

https://x.com/Iran_in_India/status/2035791765618512255

శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతానికి చెందిన ఐజాజ్ అహ్మద్ మాట్లాడుతూ, "ఇజ్రాయెల్, దాని మద్దతుదారులు ఇరాన్‌పై బలవంతంగా రుద్దిన ఈ యుద్ధం వల్ల భారీ విధ్వంసం జరిగింది. ఇరాన్ ప్రజలను ఆదుకోవడం ద్వారా నాగరిక ప్రపంచం వారికి అండగా నిలవాలి" అని అన్నారు.

యుద్ధంలో నష్టపోయిన తమ దేశానికి సాయం చేయాలని కోరుతూ ఇరాన్ ఎంబసీ వారం క్రితం సోషల్ మీడియాలో బ్యాంక్ ఖాతా వివరాలను పంచుకుంది. అప్పటి నుంచి ఈ విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సేకరించిన నిధులను ఇరాన్ ఎంబసీ, అధికారిక సహాయక సంస్థల ద్వారా నేరుగా బాధితులకు చేర్చనున్నారు. భారత్, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా సాంస్కృతిక, వాణిజ్య, దౌత్య సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement