త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jaishankar | దేశ ప్ర‌యోజ‌నాల ఆధారంగానే మా ఇంధ‌న విధానం: విదేశాంగ మంత్రి జైశంక‌ర్

Jaishankar | తమ ఇంధన విధానం దేశ ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ (Jaishankar) స్ప‌ష్టం చేశారు. అంత‌ర్జాతీయ ఇంధ‌న మార్కెట్లు, దేశాల మ‌ధ్య భాగ‌స్వామ్యాలు మారినా భార‌త్ త‌న స్వ‌తంత్ర నిర్ణ‌యాధికారాన్ని వ‌దులుకోద‌ని తేల్చిచెప్పారు.

G

International | Published On Feb 15, 2026, 11.11 am IST

Jaishankar | దేశ ప్ర‌యోజ‌నాల ఆధారంగానే మా ఇంధ‌న విధానం: విదేశాంగ మంత్రి జైశంక‌ర్
Advertisement

Jaishankar | త్రినేత్ర‌.న్యూస్‌: తమ ఇంధన విధానం దేశ ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ (Jaishankar) స్ప‌ష్టం చేశారు. అంత‌ర్జాతీయ ఇంధ‌న మార్కెట్లు, దేశాల మ‌ధ్య భాగ‌స్వామ్యాలు మారినా భార‌త్ త‌న స్వ‌తంత్ర నిర్ణ‌యాధికారాన్ని వ‌దులుకోద‌ని తేల్చిచెప్పారు. భార‌త్ ఎప్ప‌టికీ వ్యూహాత్మ‌క స్వ‌యం ప్ర‌తిప‌త్తికే క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. వాణిజ్య ఒప్పందం సంద‌ర్భంగా ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్ల‌ను (Russia Oil) నిలిపివేస్తామ‌ని భార‌త్ త‌మ‌కు హామీ ఇచ్చింద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ స‌హా మంత్రుల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జైశంక‌ర్‌.. ఇంధ‌న కొనుగోళ్ల విష‌యంలో రాజ‌కీయ ఒత్తిళ్లు ప‌నిచేయ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. అది జాతీయ ప్ర‌యోజ‌నాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చారు.

స్వయం ప్రతిపత్తి అనేది భారత పరిణామ క్రమంలో ఒక భాగంగా ఉందన్నారు. తాము వ్యూహాత్మక స్వతంత్ర నిర్ణయాధికారానికి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఇది మా చరిత్ర, పరిణామ క్రమంలో ఒక భాగం. భారతదేశంలోని అన్ని రాజకీయ వర్గాల్లోనూ దీనికి మద్దతు లభిస్తుంది.

ఇక ఇంధన అంశాల విషయానికి వస్తే, ఇప్పుడున్నది చాలా క్లిష్టమైన మార్కెట్. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో లాగానే భారత్‌లోని కంపెనీలు కూడా చమురు లభ్యత, ధరలు, రిస్క్‌లను పరిగణనలోకి తీసుకుంటాయ‌న్నారు. తమ ప్రయోజనాలకు ఏది ఉత్తమమని భావిస్తాయో ఆ నిర్ణయాలే తీసుకుంటాయ‌ని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా విషయాలు మారుతున్నాయి. మనలో చాలా మంది నిరంతరం లెక్కలు వేసుకుంటూ, మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నామ‌ని తెలిపారు. అన్ని విషయాల్లో తాము అందరితో ఏకీభవించకపోవచ్చు, కానీ సామరస్యపూర్వకంగా వ్యవహరించి, ఉమ్మడి ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించగలిగితే మార్గం సుగమం అవుతుంద‌ని న‌మ్ముతున్నాన‌ని చెప్పారు.

కాగా, ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేయ‌బోమ‌ని భార‌త్ హామీ ఇచ్చింద‌ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అదే వేదిక‌పై ప్ర‌క‌టించారు. వాణిజ్య ఒప్పందం దిశ‌గా ఇరుదేశాల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లో భార‌త్ ఈ మేర‌కు స్ప‌ష్ట‌త ఇచ్చింద‌ని పున‌రుద్ఘాటించారు. నేప‌థ్యంలో జైశంక‌ర్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.
Russia Oil,

Advertisement
Advertisement