త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Tariffs | భార‌త్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిద‌శ‌కు బిల్లు

US Tariffs | రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భార‌త్‌కు (India) భారీ షాక్ ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. ఇండియాతోపాటు చైనా, మ‌రో మూడు దేశాల‌పై 100 శాతం వ‌ర‌కు సుంకాలు (US Tariffs) విధించేందుకు వీలు క‌ల్పించే బిల్లును అమెరికా ప్ర‌తినిధుల సభలో (House of Representatives) ప్ర‌వేశ‌పెట్టింది.

G

International | Published On Sep 16, 2026, 7.40 am IST

US Tariffs | భార‌త్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిద‌శ‌కు బిల్లు
Advertisement

US Tariffs | త్రినేత్ర‌.న్యూస్‌: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భార‌త్‌కు (India) భారీ షాక్ ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. ఇండియాతోపాటు చైనా, మ‌రో మూడు దేశాల‌పై 100 శాతం వ‌ర‌కు సుంకాలు (US Tariffs) విధించేందుకు వీలు క‌ల్పించే బిల్లును అమెరికా ప్ర‌తినిధుల సభలో (House of Representatives) ప్ర‌వేశ‌పెట్టింది. దీనిపై గురువారం తుది ఓటింగ్ జరుగ‌నుంది. రష్యాపై ఆంక్షలు (Russian Energy) విధిస్తూ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకొస్తున్న ఈ బిల్లుపై అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్, డెమొక్రాటిక్ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ, బుధవారం నాటి ప్రాథమిక ఓటింగ్‌లో 214-211 ఓట్ల స్వల్ప తేడాతో ఈ బిల్లు తదుపరి దశకు చేరింది. గురువారం జరిగే తుది ఓటింగ్‌లో ఈ బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుందని అధికార పార్టీకి చెందిన స‌భ్యులు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల మృతిచెందిన సెనెట‌ర్ లిండ్సే ఓ. గ్రాహ‌మ్ (Lindsey O Graham) పేరుతో శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026ను అమెరికా సెనెట్ 86-11 తేడాదో ఆమోదించింది. తాజాగా ప్ర‌తినిధుల స‌భ ముందుకు వ‌చ్చింది.ఈ బిల్లు ద్వారా రష్యా (Russian Oil) నుంచి అత్యధికంగా ముడి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే టాప్-5 దేశాలపై భారీ టారిఫ్‌లు విధించే అధికారం ట్రంప్ (Donald Trump) ప్ర‌భుత్వానికి ల‌భిస్తుంది. ఈ టారిఫ్‌లు గరిష్ఠంగా 100 శాతం వరకు ఉండ‌వ‌చ్చని సవరణలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఆంక్షల పరిధిలోకి భారత్, చైనా (China), స్లోవేకియా, హంగేరి, అజర్‌బైజాన్ దేశాలు వస్తాయని అమెరికా సెనేటర్లు స్పష్టం చేశారు. రష్యాపై ఉన్న ప్రస్తుత ఆంక్షలను తప్పించుకోవడానికి సహాయం చేస్తున్న టాప్ 5 దేశాలపై కూడా ఈ సుంకాలు విధించే అవకాశం ఉంది. అయితే ఏ దేశంపై ఎంత శాతం సుంకం విధించాలనేది అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) నిర్ణయిస్తారు.

100 శాతం టారిఫ్ అంటే..

సవరణలోని సెక్షన్ 113 ప్రకారం, చట్టం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లోగా సంబంధిత దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై గరిష్ఠంగా 100 శాతం వరకు అదనపు సుంకం విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. ఈ సుంకం ఇప్పటికే ఉన్న ఇతర డ్యూటీలు, పన్నులు, ఫీజులకు అదనంగా ఉంటుందని సవరణలో స్పష్టం చేశారు. అయితే ఇది వెంటనే భారత్‌పై 100 శాతం టారిఫ్ పడుతుందని అర్థం కాదు. టారిఫ్ రేటును 0 నుంచి 100 శాతం మధ్య నిర్ణయించే అవకాశం ఉంటుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తున్న దేశాలకు సుంకాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంది.

హౌస్‌లో తీవ్ర వ్యతిరేకత

దాదాపు ఏడాదికి పైగా జరిగిన చర్చల అనంతరం, ఆగస్టు నెలలో అమెరికా సెనేట్ (US Senate) ఈ బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించింది. సీనియర్ సెనేటర్, ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన లిండ్సే గ్రాహం మరణం తర్వాత ఈ బిల్లుకు ఇరు పార్టీల మద్దతు లభించింది. కానీ, ప్రతినిధుల సభ (హౌస్)లో మాత్రం అడ్డంకి ఎదురైంది. అమెరికా వ్యాపార భాగస్వామ్య దేశాలపై సుంకాలు విధించే అదనపు అధికారాలను అధ్యక్షుడికి కట్టబెట్టడాన్ని డెమొక్రాట్ సభ్యులు వ్యతిరేకించారు. మరోవైపు, ఈ ఆంక్షల వల్ల అమెరికా దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని కొందరు రిపబ్లికన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement