త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Oman CEPA | గల్ఫ్ ట్రేడ్‌లో గేమ్ ఛేంజర్ ‘ఇండియా-ఒమన్ CEPA’: హార్ముజ్ టెన్షన్స్‌కు చెక్ పెడుతూ ప్రత్యామ్నాయ రూట్!

హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వేళ ఇండియా-ఒమన్ ట్రేడ్ డీల్ (CEPA) నేడు అమల్లోకి వచ్చింది. జీరో-డ్యూటీ యాక్సెస్‌తో వచ్చిన ఈ గేమ్ చేంజర్ ఒప్పందం ప్రత్యేకతలేంటో తెలుసా?

J

International | Published On Jun 1, 2026, 3.20 pm IST

India Oman CEPA | గల్ఫ్ ట్రేడ్‌లో గేమ్ ఛేంజర్ ‘ఇండియా-ఒమన్ CEPA’: హార్ముజ్ టెన్షన్స్‌కు చెక్ పెడుతూ ప్రత్యామ్నాయ రూట్!
Advertisement
  • ఇండియా-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) నేటి నుంచి అధికారికంగా అమల్లోకి 
  • అమెరికా-ఇరాన్ వివాదంతో హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద కదలికలు స్తంభించినా, ఒమన్ వ్యూహాత్మక లొకేషన్ వల్ల ఇండియాకు సేఫ్ ట్రేడ్ రూట్
  • ఈ డీల్ ద్వారా 99.38% భారతీయ ఎగుమతులపై ఒమన్ జీరో-డ్యూటీ (సుంకం లేని) యాక్సెస్‌
  • ఇతర గల్ఫ్ దేశాల నుంచి వాణిజ్యం పడిపోయినా, 2026 ఏప్రిల్ నాటికి ఒమన్ నుంచి ఇండియాకు ఏకంగా 246% పెరిగిన దిగుమతులు 

India Oman CEPA | త్రినేత్ర.న్యూస్ : అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న వేళ, భారత వాణిజ్య రంగానికి భారీ ఊరట లభించింది. ఇండియా-ఒమన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గతేడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మస్కట్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ చారిత్రక ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఈ డీల్ అమల్లోకి రావడంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కొత్త మార్కెట్లను తెరవడం, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రైతులు, మహిళలు, మత్స్యకారులు, విద్యార్థులు, MSMEలకు గ్లోబల్ అవకాశాలు కల్పించడంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ డీల్ ఎందుకంత ప్రత్యేకం?

ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల 'హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)' గుండా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు వినియోగంలో 20 శాతం, సముద్ర మార్గంలో జరిగే ఆయిల్ ట్రేడ్‌లో 25 శాతం ఈ ఇరుకైన జలసంధి గుండానే జరుగుతుంది. ఇరాన్ ఆంక్షల వల్ల సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈల నుంచి ఇండియాకు ఆయిల్, గ్యాస్ సరఫరా దెబ్బతిని క్రూడాయిల్ ధరలు పెరిగాయి.

కానీ, ఇక్కడే ఒమన్ (Oman) భౌగోళిక లొకేషన్ ఇండియాకు ఆపద్బాంధవుడిలా మారింది. హార్ముజ్ జలసంధిపై ఆధారపడే ఇతర గల్ఫ్ దేశాల్లా కాకుండా, ఒమన్ తీరప్రాంతం నేరుగా అరేబియా సముద్రం (Arabian Sea), గల్ఫ్ ఆఫ్ ఒమన్‌ను ఆనుకుని ఉంటుంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "సలాలా, దుక్మ్ వంటి ఒమన్ ప్రధాన పోర్టులు హార్ముజ్ జలసంధి అవతల ఉండటం వల్ల, గల్ఫ్‌లో ఎలాంటి సంక్షోభం వచ్చినా వాణిజ్యానికి, ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా ఉండదు" అని విశ్లేషించారు.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

గల్ఫ్ ఉద్రిక్తతల ప్రభావం ఇతర దేశాల వాణిజ్యంపై స్పష్టంగా కనిపించింది. 2025 ఏప్రిల్‌లో 15 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రధాన గల్ఫ్ దేశాల దిగుమతులు, 2026 ఏప్రిల్ నాటికి 9.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఎగుమతులు కూడా 4.4 బిలియన్ డాలర్ల నుంచి 2.7 బిలియన్ డాలర్లకు తగ్గాయి.

కానీ ఒమన్ వ్యవహారం మాత్రం ఇందుకు భిన్నం. ఇండియా-ఒమన్ మధ్య దిగుమతులు ఏకంగా 246.4 శాతం పెరిగి 430 మిలియన్ డాలర్ల నుంచి దాదాపు 1.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇందులో ముడి చమురు, యూరియా కొనుగోళ్లదే పైచేయి. అదే సమయంలో ఒమన్‌కు భారత ఎగుమతులు కేవలం 10.3 శాతం మాత్రమే తగ్గాయి.

ఇండియాకు కలిగే లాభాలు ఏంటి?

CEPA ఒప్పందం ద్వారా ఒమన్ మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. గతంలో కేవలం 15.3% ఎగుమతులకు మాత్రమే జీరో-డ్యూటీ (టారిఫ్ మినహాయింపు) ఉండగా, ఇప్పుడు ఏకంగా 99.38% భారతీయ ఎగుమతులకు జీరో-డ్యూటీ యాక్సెస్ లభించింది.

రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, క్రీడా సామాగ్రి, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాలకు పూర్తి టారిఫ్ మినహాయింపు లభిస్తుంది.

2026 ఆర్థిక సంవత్సరంలో ఒమన్‌కు భారత ఎగుమతులు $3.64 బిలియన్లుగా ఉన్నాయి. ఇందులో పెట్రోల్ ($781 మిలియన్లు), నాఫ్తా ($746 మిలియన్లు), ఐరన్ అండ్ స్టీల్, బియ్యం కీలక పాత్ర పోషించాయి.

కొన్ని ఉత్పత్తులపై ఒమన్ ఇంతకుముందు 100% వరకు డ్యూటీ వసూలు చేసేది. ఇప్పుడు ఆ సుంకాలన్నీ రద్దు కావడంతో, స్థానిక మార్కెట్లో భారతీయ బ్రాండ్ల సేల్స్ అమాంతం పెరిగే అవకాశముంది.

ఒమన్‌కు దక్కే ప్రయోజనాలు ఏంటి?

ఈ డీల్ ద్వారా కేవలం ఇండియాకే కాకుండా ఒమన్‌కు కూడా భారీ ప్రయోజనాలున్నాయి. ఇండియాలో తన మార్కెట్‌ను విస్తరించుకునేందుకు ఒమన్ ప్రధానంగా ఎనర్జీ, ఫెర్టిలైజర్స్, ముడిసరుకుల (Industrial raw materials) పైనే దృష్టి పెట్టింది.

దీనికి ప్రతిఫలంగా, ఒమన్ నుంచి వచ్చే 78% ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం చేస్తుంది.

2026 ఆర్థిక సంవత్సరంలో ఒమన్ నుంచి భారత్ $7.2 బిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. అందులో ముడి చమురు ($1.6 బిలియన్లు), LNG ($1.2 బిలియన్లు), ఎరువులు ($843 మిలియన్లు) ఉన్నాయి.

మొత్తం మీద కేవలం 55 లక్షల జనాభా, $110 బిలియన్ల GDP ఉన్న ఒమన్, ఈ 'CEPA' ఒప్పందంతో గల్ఫ్ వాణిజ్యంలో ఇండియాకు ఒక నమ్మకమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయ గేట్‌వేగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement
Advertisement