Diego Garcia | హిందూ మహాసముద్రంలో దూసుకొచ్చిన ఇరాన్ మిస్సైల్స్..! డియాగో గార్సియా దీవి చరిత్ర తెలుసా..?
Diego Garcia | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా కీలక మలుపు తిరిగాయి. సుమారు 4వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డియాగో గార్సియా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ రెండు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. అవి లక్ష్యాన్ని తాకకపోయినా.. ఇరాన్ మిస్సైల్ సామర్థ్యంపై పాశ్చాత్య దేశాలు వేసుకున్న అంచనాలన్నీ పటాపంచలయ్యాయి.
International | Published On Mar 22, 2026, 9.30 pm IST
Diego Garcia | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా కీలక మలుపు తిరిగాయి. సుమారు 4వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డియాగో గార్సియా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ రెండు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. అవి లక్ష్యాన్ని తాకకపోయినా.. ఇరాన్ మిస్సైల్ సామర్థ్యంపై పాశ్చాత్య దేశాలు వేసుకున్న అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. యూఎస్ వద్ద ఇరాన్ దాడులను అడ్డుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ.. ఆ దేశం ఏర్పాటు చేసుకున్న వైమానిక స్థావరాలన్నీ ఇరాన్ మిస్సైల్స్ పరిధిలోనే ఉన్నాయన్న విషయం సుస్పష్టమైంది. ఈ నేపథ్యంలో డియాగో గార్సియా చరిత్ర ఏంటీ? ఇది అమెరికాకు కీలకం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..!
డియాగో గార్సియా దీవి ఎక్కడుంది?
డియాగో గార్సియా అనేది చాగోస్ దీవుల సమూహంలో అతిపెద్ద దీవి. ఇది హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న ఓ పడగడపు దిబ్బ. ప్రస్తుతం ఇది అమెరికా-బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 17 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న దీవి భౌగోళికంగా అత్యంత కీలక స్థానంలో ఉంది. రెడ్ సీ (బాబ్-ఎల్-మండెబ్ జలసంధి), దక్షిణ చైనా సముద్రం (మలక్కా జలసంధి) మధ్య దాదాపు సమదూరంలో సుమారు 3వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర మార్గాలపై నిఘా వేయడం సులభమవుతుంది. అలాగే, యుద్ధ క్షేత్రాలకు దూరంగా ఉండడం వల్ల భద్రతాపరంగా అత్యంత అనుకూలమైన స్థావరంగా భావిస్తుంటారు.
డియాగో గార్సియా చరిత్ర

డియాగో గార్సియా దీవి చరిత్ర విషయానికి వస్తే.. 18వ శతాబ్దం చివరి వరకు ఈ దీవిలో శాశ్వత నివాసం లేదు. ఆ తర్వాత ఫ్రెంచ్ పాలకులు ఆఫ్రికా, భారత్ నుంచి కార్మికులను తీసుకువచ్చి కొబ్బరి తోటల్లో పని చేయించేవారు. 1814లో ఈ దీవులు బ్రిటన్ ఆధీనంలోకి వెళ్లాయి. అయితే, డియాగో గార్సియా వ్యూహాత్మకంగా కీలకమని భావించిన అమెరికా, బ్రిటన్ కలిసి ఇక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ ప్రక్రియలో 1968 నుంచి 1973 మధ్యకాలంలో సుమారు 1,500 నుంచి 2వేల మంది స్థానిక చాగోషియన్లను బలవంతంగా వారిని ఇక్కడి నుంచి తరలించారు. సరైన పునరావాసం లేకుండా, తగిన పరిహారం ఇవ్వకుండా మారిషస్, సెషెల్స్ పంపించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దీవిని పూర్తిగా ఖాళీ చేసేందుకు ఇక్కడున్న వందలాది జంతువులను చంపివేశారు.
బ్రిటన్ చెర నుంచి..
చాగోస్ దీవులపై బ్రిటన్ ఆక్రమణకు వ్యతిరేకంగా దీర్ఘకాల న్యాయపోరాటం జరిగింది. 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) కీలక తీర్పు ఇచ్చింది. చాగోస్ దీవులను మారిషస్ నుంచి వేరు చేయడం అక్రమమని పేర్కొంది. దాన్ని తిరిగి మారిషస్‌కు అప్పగించాలని ఆదేశించింది. అయితే, బ్రిటన్ ఈ ఆదేశాలను అమలు చేయడంలో ఆలస్యం చేసింది. చివరికి 2025 మేలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, చాగోస్ దీవుల సార్వభౌమాధికారాన్ని మారిషస్‌కు బదిలీ చేసే ఒప్పందంపై సంతకం చేశారు. అయితే, డియాగో గార్సియా సైనిక స్థావరాన్ని మాత్రం కొనసాగించారు. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటన్, మారిషస్ నుంచి ఈ దీవిని మరో 99 సంవత్సరాలకు 101 యూరోపియన్ మిలియన్ డాలర్లకు అద్దెకు తీసుకొని సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
ట్రంప్–స్టార్మర్ మధ్య వివాదం
డియాగో గార్సియా, చాగోస్ దీవుల అంశం అమెరికా-బ్రిటన్ సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. 1966లో బ్రిటన్, డియాగో గార్సియాను అమెరికాకు లీజుకు ఇచ్చింది. అప్పటి నుంచి అమెరికా అక్కడ భారీ సైనిక స్థావరాన్ని అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో 2025లో బ్రిటన్, చాగోస్ దీవులను మారిషస్‌కు అప్పగించే ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం తప్పిదమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త చర్యకు ముందు బ్రిటన్ చర్చల్లో పాల్గొన్నప్పటికీ, యుద్ధంలో నేరుగా పాల్గొనడంపై ఆసక్తి చూపించలేదు. అమెరికా ఈ స్థావరాన్ని ఇరాన్‌పై దాడులకు వినియోగించాలన్న ప్రతిపాదనపై బ్రిటన్ స్పందించలేదు. ట్రంప్ పలుమార్లు కీర్ స్టార్మర్‌పై విమర్శలు గుప్పించారు. అయినా స్టార్మర్ మాత్రం ఇరాన్‌తో యుద్ధంలో దీవిని వాడుకునేందుకు అనుమతి ఇవ్వలేదు.
అమెరికాకు కీలకం..
డియాగో గార్సియా అమెరికాకు వ్యూహాత్మకంగా అత్యంత కీలక కేంద్రం. దీన్ని ‘మునగని విమాన వాహక నౌక’గా పేర్కొంటారు. ఈ ప్రాంతంలో అమెరికాకు ఉన్న రెండు ప్రధాన బాంబర్ స్థావరాల్లో ఇది ఒకటి. మరోటి గువామ్‌లో ఉంది. ఇక్కడ 12వేల అడుగుల పొడవైన రన్‌వే ఉంటుంది. బీ1, బీ2, బీ52 వంటి భారీ బాంబర్ విమానాలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. 1979 ఇరాన్ విప్లవం తర్వాత దీన్ని విస్తృతంగా అభివృద్ధి చేశారు. అణు సబ్‌మరైన్లు, మిస్సైల్ నౌకలు నిల్వ ఉన్నాయి. భారీ స్థాయిలో ఆయుధాలు, సరఫరాలు నిల్వ చేసే సదుపాయం ఉంది. దీంతో ఆసియా, ఆఫ్రికా, గల్ఫ్ ప్రాంతాలకు అమెరికా తన సైన్యాన్ని వేగంగా పంపేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, సాంప్రదాయ సైనిక వినియోగంతో పాటు, శాటిలైట్ ట్రాకింగ్, అంతరిక్ష పర్యవేక్షణ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది. 1990–91 గల్ఫ్ యుద్ధం, 2001 ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, 2003 ఇరాక్ యుద్ధ ప్రారంభ దశల్లో ఇక్కడి నుంచి అనేక వైమానిక దాడులు జరిగాయి.
ఈ దీవిపై ఇరాన్ దాడి ఎందుకు..?
ఇటీవల ఉద్రిక్తతల నేపథ్యంలో చివరకు డియోగో గార్సియా స్థావరాన్ని ఇరాన్‌పై దాడులకు ఉపయోగించుకునేందుకు అమెరికాకు బ్రిటన్ అనుమతి ఇచ్చింది. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. బ్రిటన్ నిర్ణయం ఆ దేశ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేస్తుందని హెచ్చరించారు. అలాగే, స్వీయ రక్షణ హక్కును తాము ఉపయోగించుకుంటామన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం మధ్యకాలంలో ఇరాన్ 4వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డియాగో గార్సియాపై రెండు మిస్సైల్స్‌ను ప్రయోగించింది. అయితే, డియోగో గార్సియా కేవలం ఒక దీవి కాదని.. ప్రపంచ భౌగోళిక, సైనిక సమీకరణలో కీలకపాత్ర పోషించే వ్యూహత్మక కేంద్రం. ప్రస్తుత ఉద్రిక్తతలు భవిష్యత్‌లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






