Gadi Eizenkot | నెతన్యాహుకు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎయిజెన్‌కాట్‌కు తొలి అవకాశం
Gadi Eizenkot | ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు గట్టి ప్రత్యర్థిగా ఎదిగిన ప్రతిపక్ష నేత, యషార్ పార్టీ అధినేత గాడి ఎయిజెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం కల్పించాలని అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది.
International | Published On Nov 8, 2026, 4.23 pm IST
- ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ కీలక నిర్ణయం
- 40 ఏళ్ల సైనిక అనుభవం.. రాజకీయాల్లోనూ దూకుడు
- గాజా యుద్ధంలో కుమారుడిని కోల్పోయిన మాజీ ఆర్మీ చీఫ్
- యషార్ పార్టీ అధినేతగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు
Gadi Eizenkot | ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు గట్టి ప్రత్యర్థిగా ఎదిగిన ప్రతిపక్ష నేత, యషార్ పార్టీ అధినేత గాడి ఎయిజెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం కల్పించాలని అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. 120 మంది సభ్యులున్న పార్లమెంట్ (నెస్సెట్)లో ఎయిజెన్‌కాట్‌కు 67 మంది సభ్యుల మద్దతు లభించగా.. నెతన్యాహుకు 46 మంది మద్దతు తెలిపారు. మరో ఏడుగురు సభ్యులు ఎవరినీ సమర్థించలేదు. ఈ నేపథ్యంలో ఎయిజెన్‌కాట్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హెర్జోగ్ నిర్ణయించారు. జాతీయ అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఎయిజెన్‌కాట్ ప్రకటించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా తమ పార్టీ పనిచేసేలా అన్ని ప్రయత్నాలు చేస్తానని తెలిపారు.
మొరాకో వలస కుటుంబం నుంచి..
66 ఏళ్ల గాడి ఎయిజెన్‌కాట్ 1960 మే 19న ఇజ్రాయెల్‌లోని టిబెరియాస్‌లో మొరాకో నుంచి వలస వచ్చిన యూదు కుటుంబంలో జన్మించారు. తొమ్మిది మంది సంతానంలో రెండో వ్యక్తి. సాధారణ ఆర్థిక నేపథ్యమున్న కుటుంబంలో పెరిగిన ఆయనకు ఐదుగురు పిల్లలు. చిన్నతనంలో టిబెరియాస్, ఐలాట్ ప్రాంతాల్లో పెరిగారు. రాజకీయాల్లోకి రాకముందు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ రక్షణ దళాల్లో (ఐడీఎఫ్) పనిచేశారు. 1978లో గొలానీ బ్రిగేడ్‌లో సైనికుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 2015 నుంచి 2019 వరకు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2015 ఫిబ్రవరి 16న అప్పటి ప్రధాని నెతన్యాహు ఆయనను ఈ అత్యున్నత పదవిలో నియమించారు. దాదాపు 41 ఏళ్ల సైనిక సేవ అనంతరం పదవీ విరమణ చేశారు. సైన్యంలో పనిచేసిన కాలంలో గొలానీ బ్రిగేడ్ కమాండర్‌గా, వెస్ట్‌బ్యాంక్‌లోని జుడియా అండ్ సమారియా డివిజన్ అధిపతిగా, ఆర్మీ ఆపరేషన్స్ విభాగం అధిపతిగా, నార్తర్న్ కమాండ్ చీఫ్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. 2013లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులయ్యారు. సైనిక క్రమశిక్షణ, వ్యూహాత్మక నిర్ణయాల్లో తనదైన ముద్ర వేశారు.
నెతన్యాహుతో విభేదాలు..
నెతన్యాహుతో ఒకప్పుడు సన్నిహిత సంబంధాలున్న ఎయిజెన్‌కాట్.. కాలక్రమంలో రాజకీయ, వ్యూహాత్మక అంశాల్లో ఆయనకు దూరమయ్యారు. 2023 అక్టోబర్‌లో హమాస్ దాడుల అనంతరం నెతన్యాహు ఏర్పాటు చేసిన అత్యవసర ప్రభుత్వంలో చేరారు. యుద్ధ కేబినెట్‌లో పరిశీలక సభ్యుడిగా కూడా వ్యవహరించారు. అయితే యుద్ధానికి స్పష్టమైన వ్యూహం రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందని, జాతీయ భద్రత కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపిస్తూ 2024 జూన్‌లో బెన్నీ గాంట్జ్‌తో కలిసి ప్రభుత్వానికి రాజీనామా చేశారు. అక్టోబర్ 7 దాడులకు దారితీసిన భద్రతా వైఫల్యాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
యుద్ధంలో కుమారుడిని కోల్పోయి..
గాజా యుద్ధం ఎయిజెన్‌కాట్ వ్యక్తిగత జీవితాన్నీ తీవ్రంగా ప్రభావితం చేసింది. 2023 డిసెంబర్‌లో గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ సందర్భంగా ఆయన కుమారుడు గాల్ ఎయిజెన్‌కాట్ మరణించారు. యుద్ధంలో ఆయన ఇద్దరు మేనల్లుళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ రాజకీయాల్లో చురుగ్గా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడి సమాధి వద్ద చేసిన ప్రతిజ్ఞే తన రాజకీయ లక్ష్యానికి బలమని 2026 ఏప్రిల్‌లో ఓ వ్యాసంలో పేర్కొన్నారు. తన కుమారుడు, అతడి సహచరులు చేసిన త్యాగం వృథా కాకూడదని ప్రతినబూనినట్లు తెలిపారు.
సైన్యం నుంచి రాజకీయాల్లోకి..
సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత భద్రత, వ్యూహాత్మక వ్యవహారాలపై పనిచేశారు. 2022లో బెన్నీ గాంట్జ్ నేతృత్వంలోని నేషనల్ యూనిటీ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. నెస్సెట్‌కు ఎన్నికై విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిటీలోనూ పనిచేశారు. 2025 సెప్టెంబర్‌లో నేషనల్ యూనిటీ నుంచి విడిపోయి సొంతంగా యషార్ పార్టీని స్థాపించారు. హీబ్రూ భాషలో యషార్ అంటే నిజాయితీ, నేరుగా వ్యవహరించడం అనే అర్థాలు ఉన్నాయి. జాతీయ భద్రత బలోపేతం, అక్టోబర్ 7 దాడులపై దర్యాప్తు, అన్ని వర్గాలకూ సైనిక లేదా జాతీయ సేవ తప్పనిసరి చేయడం ఆయన పార్టీ ప్రధాన ఎజెండా.
హమాస్ పాలనకు ముగింపు పలకడమే లక్ష్యం
పాలస్తీనా, గాజా అంశాల్లో ఎయిజెన్‌కాట్ వైఖరి కూడా కీలకం కానుంది. గాజాలో హమాస్ పాలనకు 18 నెలల్లో ముగింపు పలుకుతామని ఆయన ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక అమలు చేయాలని, అవసరమైతే లక్ష్యిత సైనిక చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. నెతన్యాహు అధికారంలో కొనసాగినంతకాలం గాజాలో హమాస్ పాలన అంతం కాదని విమర్శించారు. వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ నిరంతర నియంత్రణ కొనసాగితే ద్విజాతి రాజ్యం ఏర్పడే ప్రమాదముందని గతంలో హెచ్చరించారు. అది యూదు రాజ్య స్థాపన లక్ష్యానికే విఘాతమని పేర్కొన్నారు. అల్ట్రా ఆర్థడాక్స్ యూదు పురుషులకూ సైనిక సేవ తప్పనిసరి చేయాలని ఆయన కోరుతున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుపై సవాళ్లు
ఎయిజెన్‌కాట్‌కు అధ్యక్షుడు 28 రోజుల గడువు ఇవ్వనున్నారు. అవసరమైతే మరో 14 రోజులు పొడిగించే అవకాశం ఉంది. అయితే 67 మంది సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ 61 మంది సభ్యుల మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. అరబ్ పార్టీల మద్దతు తీసుకోవడంపై ఆయన కూటమిలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీలతోనూ సైనిక సేవ అంశంలో విభేదాలున్నాయి. మరోవైపు నెతన్యాహు జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎయిజెన్‌కాట్ విభిన్న పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Israel Elections | నెతన్యాహుకి షాక్.. అతిపెద్ద కూటమిగా అవతరించినా.. మెజార్టీకి దూరంగా..
అక్టోబర్ 30, 2026

Yuval Blumberg | ట్రంప్ ఉన్న ఈ రెండేళ్లలోనే ఇరాన్ పని పూర్తి చేయాలి.. లేదంటే ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు
అక్టోబర్ 25, 2026

Israeli PM Netanyahu | అమెరికా అధ్యక్షుడితో ఇజ్రాయెల్‌కు ముప్పు.. భారత్‌తో సంబంధాలు చాలా అవసరం : నెతన్యాహు
అక్టోబర్ 19, 2026
తాజావార్తలు
- ●Diwali Snack Ideas | దీపావళి హౌస్ పార్టీకి గెస్టులు వస్తున్నారా? గంటల తరబడి వంట వద్దు.. ఈ 3 వెరైటీ స్నాక్స్ పెడితే గెస్టులు ఫిదా!
- ●CM Revanth Reddy | మహిళా శక్తే నా శక్తి.. మీ ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి చేర్చింది
- ●Diwali Muhurat Trading | దీపావళి ముహూర్త ట్రేడింగ్‌లో లాభాల వెలుగులు.. ఆరేళ్ల రికార్డు ఊపుతో 'సంవత్ 2083'కి గ్రాండ్ వెల్కమ్!
- ●Chennai | డబుల్స్ టైటిల్‌పై వైష్ణవి, రుతుజ కన్ను
- ●PM Modi | నక్సలిజంపై విజయం.. సైనికులతో దీపావళి వేడుకలు
- ●Telugu youth dies in USA | అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. జగిత్యాల జిల్లాలో విషాదఛాయలు

Diwali Snack Ideas | దీపావళి హౌస్ పార్టీకి గెస్టులు వస్తున్నారా? గంటల తరబడి వంట వద్దు.. ఈ 3 వెరైటీ స్నాక్స్ పెడితే గెస్టులు ఫిదా!

CM Revanth Reddy | మహిళా శక్తే నా శక్తి.. మీ ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి చేర్చింది

Diwali Muhurat Trading | దీపావళి ముహూర్త ట్రేడింగ్‌లో లాభాల వెలుగులు.. ఆరేళ్ల రికార్డు ఊపుతో 'సంవత్ 2083'కి గ్రాండ్ వెల్కమ్!

Chennai | డబుల్స్ టైటిల్‌పై వైష్ణవి, రుతుజ కన్ను



