Ramachandra Rao | తెలంగాణను తెచ్చింది బీఆర్ఎస్సో, కాంగ్రెస్సో కాదు.. తెచ్చింది బీజేపీ
కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పుడు ఆరోపణలన్నారు. కేసీఆర్.. అబద్ధపు ప్రచారాలతో శని, దరిద్రం అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Ramachandra Rao | తెలంగాణను తాము తీసుకొచ్చామని కాంగ్రెస్ పార్టీ అంటుంది.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తామే తెలంగాణ తెచ్చామని అంటున్నారు. కానీ ఆ రెండు పార్టీలు అసలు వాస్తవాలను దాచిపెడుతున్నాయి. తెలంగాణను తీసుకొచ్చింది బీజేపీనే.. అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పుడు ఆరోపణలన్నారు. కేసీఆర్.. అబద్ధపు ప్రచారాలతో శని, దరిద్రం అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
మరో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభావంతో కేంద్రం డీపీఆర్ తిరస్కరించిందన్న కేసీఆర్ వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. డీపీఆర్‌పై కేంద్రం అడిగిన ప్రశ్నలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మొదలయ్యాయి, తెలంగాణలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఏమీ జరగలేదు. తిమ్మిని బమ్మిని చేసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న కేసీఆర్ మాటలు కేవలం రాజకీయ నాటకం. వాస్తవాలు ప్రజల ముందుంచకుండా సెంటిమెంట్ రాజకీయం చేయడమే కేసీఆర్ ధ్యేయం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎక్కడా అన్యాయం చేయలేదు.. చేయదు. తెలంగాణలో కొన్ని నెలల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి చేస్తున్న ఓటీపీ రాజకీయాలు ఇక నడవవు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్.. ఏవేవో కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టారు. అందుకే ప్రజలు కేసీఆర్‌కు వీఆర్‌ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్) ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఓటుశాతం క్రమేణా పెరుగుతోంది. ప్రజల మన్ననలు అపూర్వంగా లభిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సరైన అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. గతంలో బీఆర్ఎస్‌కు సుమారు 8 వేల మంది సర్పంచులు ఉండగా, ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆ సంఖ్య కేవలం 2 వేలకే పడిపోయింది. అదే సమయంలో బీజేపీ 164 నుంచి వెయ్యి మంది సర్పంచులకు పెరిగింది. ఇది బీజేపీ బలం ఎంత పెరిగిందో స్పష్టంగా చూపిస్తోంది. బీజేపీకి పెరుగుతున్న ప్రజాబలం, విశ్వాసాన్ని చూసి భయపడి ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ మళ్లీ బయటకు వచ్చారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. కేసీఆర్ చెప్పే అబద్ధాలకంటే వాస్తవాలు వారికి బాగా తెలుసు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ సభ్యత లేకుండా బూతులతో విరుచుకుపడుతున్నారు. ఆ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ గౌరవప్రదమైన రాజకీయాలే చేస్తుంది. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌కు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
తెలంగాణ కోసం గట్టిగా వాదించింది బీజేపీనే
తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీ కీలకంగా పాల్గొంది. పార్లమెంటులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు వచ్చినప్పుడు టీఆర్ఎస్ సభ్యులు లేనప్పటికీ, బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ కోసం గట్టిగా వాదించారు. బీజేపీ కృషితోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది.
కేసీఆర్ గత పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వంపై అబద్ధాలతోనే కాలయాపన చేశారు. ఆయన ఇటీవల మాట్లాడిన మాటలన్నీ అసత్యాలే. కృష్ణా జలాల విషయంలో మొత్తం 811 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని సంతకం పెట్టి మన రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు.
పాలమూరు – రంగారెడ్డి అంశంపై కేసీఆర్‌కు సూటి ప్రశ్నలు
కేంద్రంపై విమర్శలు చేస్తున్న కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ పథకాలతో జరుగుతున్న మేలును, కేంద్ర పథకాలను అడ్డుకుంటున్న తీరును ప్రజలకు స్పష్టం చేయాలి. ఈరోజు భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో రైతుల పరిస్థితి మెరుగుపడిందంటే అది కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్లనే. ఒకప్పుడు రూ.3,000 ధర ఉన్న యూరియా మోదీ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వల్ల ఈరోజు రైతులకు కేవలం రూ.300 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో పథకం తెచ్చి కనీసం సగం మొత్తాన్ని కూడా సక్రమంగా ఇవ్వలేదు. ఎన్నికల ముందు కొంత ఇచ్చి, తర్వాత ఆపేశారు. ధనవంతులు, జమీందార్లకు ఇచ్చారు గానీ పేద రైతులకు అందలేదు. రైతుబంధును సగం మోతాదులో ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశవ్యాప్తంగా సుమారు రూ.11 లక్షల కోట్లను పంపిణీ చేయగా, తెలంగాణ రైతులకు రూ.3.7 లక్షల కోట్ల మేర లబ్ధి జరిగింది. ‘బీజ్ సే బజార్ తక్’ అనే నినాదంతో ఇరిగేషన్ నుంచి మార్కెట్ వరకు రైతుకు అండగా మోదీ ప్రభుత్వం నిలిచింది. దేశవ్యాప్తంగా పీఎం ఫసల్ బీమా యోజన అమలవుతుంటే తెలంగాణలో మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు రైతులకు అందకుండా అడ్డుకుంది. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా పేద ప్రజలకు దూరం చేశారు. ఇవి అన్నీ కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనాలన్నారు.
నేను గతంలో ఎంఎల్సీగా ఉన్న సమయంలో కౌన్సిల్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించాను. క్రాప్ ఇన్సూరెన్స్, ఫసల్ బీమా, కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎందుకు అమలు చేయడం లేదని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఒక్కటే— “విలేజ్ యూనిట్ బాగుంది, ఫార్మర్ యూనిట్ అయితే కష్టం” అని చెప్పి ఈ పథకాలను ప్రోత్సహించలేదంటూ తప్పించుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం ఫసల్ బీమా యోజనను తెలంగాణ రైతులకు అందకుండా అడ్డుకున్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా తెలంగాణ ప్రజలకు సరైన రీతిలో అందకుండా చేశారు. కరోనా సమయంలో అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పేదల నుంచి దూరం చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన కింద దేశవ్యాప్తంగా రూ. 93,000 కోట్ల నిధులు కేటాయించి 112 ప్రాజెక్టులను చేపట్టారు. వర్షాలపై ఆధారపడకుండా చిన్న చిన్న ఇరిగేషన్ పనులు, కాలువల మరమ్మతులు, నీటి నిల్వల అభివృద్ధి కోసం ఈ పథకం అమలవుతోంది. తెలంగాణలో కూడా నెట్టంపాడు, రాజోలిబండ, కల్వకుర్తి, నారాయణపేట, కోవెల్ సాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులు, పూర్తి చేయడంపై కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది.
ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన కింద మాత్రమే తెలంగాణకు రూ.1,000 కోట్లకు పైగా నిధులు కేటాయించబడ్డాయి. కాలువల రిపేర్లు, చిన్న ఇరిగేషన్ పనుల కోసం ఈ నిధులు ఇచ్చాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటి గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? గత టీఆర్ఎస్ సర్కారు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని నిరంతరం అవమానించే ప్రయత్నం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారు. పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా బీజేపీ ప్రభుత్వం లేకపోయినా అక్కడి ముఖ్యమంత్రి ప్రధానికి గౌరవం ఇస్తారు. కానీ తెలంగాణలో మాత్రం అది కూడా చేయలేదు. ఇది బాధాకరమైన విషయం. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్లతెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది, రాష్ట్రానికి అవమానం జరిగింది. అందుకే ప్రజలు వారికి వీఆర్‌ఎస్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ రెండు సంవత్సరాల్లో కూడా వారు చేసింది శూన్యం. ఈరోజు తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుబంధు పథకం పేరుతో గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు. అదే పరిస్థితి ప్రస్తుతం కూడా కొనసాగుతోంది.
పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా ఎక్కడా స్పష్టమైన ప్రాధాన్యం ఇవ్వలేదు. కేవలం నీటి పేరుతో రాజకీయాలు చేయడమే తప్ప, రైతుల కోసం నిజమైన ప్రయత్నం జరగలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో గత సీఎం కేసీఆర్ గారు నీటిని, తెలంగాణ సెంటిమెంట్‌ను రాజకీయ ఆయుధంగా వాడుకున్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాల్సిన సమయంలో మళ్లీ ఓడిపోయిన రాజకీయాల నుంచి బయటపడలేక ఇప్పుడు మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో వాస్తవాలేంటో ప్రజలకు తెలిసేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నేను ఎంఎల్సీగా ఉన్నప్పుడు స్వయంగా ఆ సమావేశానికి హాజరయ్యాను. అప్పుడు టీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక తెలంగాణ సెంటిమెంట్ ముగిసిపోతుంది. అందుకే పాలమూరు–రంగారెడ్డిని సెంటిమెంట్ ట్రంప్ కార్డ్‌లా పెండింగ్‌లో ఉంచుతామని వారు స్వయంగా చెప్పారు. ఇది రైతుల కోసం కాదు, తెలంగాణ అభివృద్ధి కోసం కాదు. నీటిని, నిధులను, నియామకాలను కేవలం రాజకీయ సెంటిమెంట్ కోసం వాడుకున్నారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే, కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకు ఎందుకు సంతకం పెట్టారు? ఉత్తర–దక్షిణ తెలంగాణ మధ్య వివక్ష ఎందుకు తీసుకొచ్చారు? నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎందుకు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు? ఎందుకు మరమ్మతులు చేయలేదు? కల్వకుర్తి, రాజోలిబండ, కోయలకొండ, వెలిగొండ, నారాయణపేట, కోవెల్ సాగర్ వంటి ప్రాజెక్టులను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాల పాటు ఉమ్మడి బాధ్యతలు ఉన్నప్పటికీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో కూడా ఈ సమస్యలపై మీరు ఏం చేశారు? ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలకు వెళ్లలేదు, మరోసారి కోర్టుకు వెళ్లి వ్యవహారాన్ని మరింత ఆలస్యం చేశారు. బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంశాల్లో కూడా సరైన వాదనలు వినిపించలేదు. దీని వల్ల నష్టం జరిగింది అంటేజజ అది పూర్తిగా టీఆర్ఎస్ పాలన వల్లే. కేసీఆర్ ఇన్నాళ్లకు బయటికి వచ్చి తెలంగాణ ప్రజలకు ఏదో చేసేస్తున్నామంటూ మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణకు కావాల్సింది సెంటిమెంట్ కాదు – సుస్థిర అభివృద్ధి. పిల్లల భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు. టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా వాటర్ సెంటిమెంట్‌తో ఆడుకోవడమే తప్ప ప్రజలకు న్యాయం చేయలేదు. కాంగ్రెస్ పాలనలో రాజశేఖర్ రెడ్డి హయాంలో నీటిని దొంగతనంగా తీసుకెళ్లారు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం బహిరంగంగానే 299 టీఎంసీలకు సంతకం పెట్టి నష్టం చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రైతుల కోసం కాదు, కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసమే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాయి. తమ వైఫల్యాలను దాచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి దశలో తెలంగాణకు సమయానికి స్పందించింది. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం కోర్టులు, ఆలస్యాల పరంపరతో రాజకీయం చేసి, తెలంగాణకు తీరని నష్టం వాటిల్లేలా చేసింది. కేవలం బీజేపీని బద్నాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ కు చేసిన అన్యాయాన్ని, అసలైన వాస్తవాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు కళ్లకు కట్టేలా చూపించిన వెదిరె శ్రీరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నిజాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేసేలా ప్రతి జిల్లాలో ఈ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. నీటి సమస్యపై బీజేపీ ప్రత్యేక స్టడీ టీమ్ కూడా ఏర్పాటు చేస్తుంది. తెలంగాణలో ఉన్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టును బీజేపీ నాయకులు స్వయంగా తిరిగి, ఎక్కడెక్కడ నష్టం జరిగింది, ఏ ప్రాజెక్టులో ఏ లోపాలున్నాయి, ఇకపై ఏమేం చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై సమగ్ర అధ్యయనం చేయనున్నాం. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తిస్థాయి అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న కొత్త ప్రాజెక్టులు గానీ, పాత ప్రాజెక్టుల రీ-అలైన్‌మెంట్ గానీ .. వాటివల్ల నిజంగా రైతులకు ఏమైనా ప్రయోజనం కలిగిందా అనే విషయాన్ని ప్రజలే ఆలోచించాలని రాంచందర్ రావు హితువు పలికారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



