త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU Non Teaching Staff JAC Dharna | ఓయూలో కదం తొక్కిన నాన్-టీచింగ్ ఉద్యోగులు.. మహా ధర్నాకు అఖిలపక్ష నేతల సంపూర్ణ మద్దతు

ఉస్మానియా యూనివర్సిటీ నాన్-టీచింగ్ ఉద్యోగుల మహా ధర్నా హోరెత్తింది. ఈటల, కవిత, ఆర్.కృష్ణయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు నేతలు మద్దతు తెలిపారు.

J

Hyderabad | Published On Nov 10, 2026, 7.14 pm IST

OU Non Teaching Staff JAC Dharna | ఓయూలో కదం తొక్కిన నాన్-టీచింగ్ ఉద్యోగులు.. మహా ధర్నాకు అఖిలపక్ష నేతల సంపూర్ణ మద్దతు

సంక్షిప్త సారాంశం

ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట నాన్-టీచింగ్ స్టాఫ్ జేఏసీ (JAC) చేపట్టిన మహా ధర్నా వందలాది మంది ఉద్యోగుల భాగస్వామ్యంతో విజయవంతమైంది. ఎంపీలు ఈటల రాజేందర్, ఆర్. కృష్ణయ్య, నేతలు కల్వకుంట్ల కవిత, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, జాన్ వెస్లీ, వరంగల్ రవి, పృథ్వీరాజ్ ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలిపారు. ప్రొఫెసర్ జి. హరగోపాల్ ఫోన్ ద్వారా సంఘీభావం తెలుపుతూ.. రిటైర్మెంట్ వరకు ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలోనే కొనసాగించడం శ్రమ దోపిడీ అని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, టైమ్ స్కేల్ సిబ్బందికి రూ.3-4 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఓపీఎస్/సీపీఎస్ పెన్షన్, ఈపీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని నేతలు డిమాండ్ చేశారు.

Advertisement

OU Non Teaching Staff JAC Dharna | త్రినేత్ర న్యూస్ : ఉస్మానియా యూనివర్సిటీ నాన్-టీచింగ్ స్టాఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ (OU Non-Teaching Staff JAC) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 'మహా ధర్నా' వేలాది గొంతుకల నినాదాలతో హోరెత్తింది. వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట జరిగిన ఈ నిరసనలో వందలాది మంది బోధనేతర ఉద్యోగులు ఎండను, భోజన విరామాన్ని సైతం లెక్కచేయకుండా సుమారు నాలుగు గంటల పాటు కదలకుండా కూర్చుని తమ ఐక్యతను చాటుకున్నారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, మేధావులు, విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులు తరలివచ్చి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.

Osmania University Non-Teaching Staff JAC Maha Dharna Successful All-Party Leaders Demand Immediate Regularization

ఈటల రాజేందర్: రూ.15 వేల జీతంతో కుటుంబాలు ఎలా బతకాలి?

మహా ధర్నాలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ధరల పెరుగుదల నేపథ్యంలో కేవలం రూ.15 వేల తక్కువ వేతనంతో ఉద్యోగులు కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కనీస భరోసా లేకపోవడం బాధాకరమన్నారు. గతంలో విద్యుత్ శాఖలో ఆర్టిజన్లను, ఇతర ప్రభుత్వ విభాగాల్లోని సిబ్బందిని రెగ్యులరైజ్ చేసినప్పటికీ, వర్సిటీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. చట్టాలతో పాటు అధికారులకు తోటి మనిషి బాధను అర్థం చేసుకునే మానవత్వం ఉండాలని హితవు పలికారు. సమస్యలపై పూర్తి వివరాలతో సమగ్ర డాక్యుమెంట్ అందిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేవరకు వదిలిపెట్టబోనని హామీ ఇచ్చారు.

కల్వకుంట్ల కవిత: రూ.1,000 కోట్లు ఏవి? వీసీ గులాంగిరీ ఆపాలి

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. 35 ఏళ్లుగా ఓయూలో ఉద్యోగుల రక్తం, చెమటను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 105 ఏళ్ల ఓయూ చరిత్రలో మాదిగ బిడ్డను వీసీని చేశామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం, వర్సిటీకి ఇస్తామన్న రూ.1,000 కోట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వీసీ ఉద్యోగులను పట్టించుకోకుండా ప్రభుత్వానికి గులాంగిరీ చేస్తున్నారని, ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Osmania University Non-Teaching Staff JAC Maha Dharna Successful All-Party Leaders Demand Immediate Regularization

85 శాతం లోకల్ కోటాను పక్కనపెట్టి ఓయూ సెక్యూరిటీలో యూపీ, బీహార్ వాళ్లనే ఎందుకు నియమిస్తున్నారని కవిత నిలదీశారు. అకారణంగా సస్పెండ్ చేసిన ప్రొఫెసర్ మనోహర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, టైమ్ స్కేల్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈపీఎఫ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. నాన్-పర్మినెంట్ సిబ్బంది కోసం పర్మినెంట్ ఉద్యోగులు, ఆడబిడ్డలు ముందుండి పోరాడటం గొప్ప విషయమంటూ వారికి సెల్యూట్ చేశారు.

ప్రొఫెసర్ హరగోపాల్: రిటైర్మెంట్ వరకు కాంట్రాక్ట్ పద్ధతి శ్రమ దోపిడీయే

అనారోగ్య కారణాల వల్ల ప్రత్యక్షంగా రాలేకపోయిన ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఫోన్ ద్వారా ఉద్యోగులకు సంఘీభావ సందేశం వినిపించారు. 20 ఏళ్లుగా ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడం విచారకరమన్నారు. ఒక భవన నిర్మాణం వంటి తాత్కాలిక పనులకే కాంట్రాక్ట్ కార్మికులను పెడతారని, కానీ శాశ్వతంగా ఉండే ఉస్మానియా వర్సిటీలో పదవీ విరమణ చేసేవరకు కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేయించడం శ్రమ దోపిడీకి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే వీరిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.

ఆర్.కృష్ణయ్య, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్: రూ.100 కోట్లు ఇస్తే సమస్యలన్నీ తీరుతాయి

ఉద్యోగులు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలు కావని, సాధారణ సమస్యలను జటిలం చేసి వారిని రోడ్లపైకి తేవడం బాధాకరమని, అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఆర్ కృష్ణయ్య హామీ ఇచ్చారు.

Osmania University Non-Teaching Staff JAC Maha Dharna Successful All-Party Leaders Demand Immediate Regularization

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఎక్కువ సమయం పట్టదని, వర్సిటీల అభివృద్ధికి కేటాయించిన రూ.1,000 కోట్లలో కనీసం రూ.100 కోట్లు కేటాయించినా ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

వివిధ పార్టీలు, సంఘాల నేతల మద్దతు

జాన్ వెస్లీ (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి): ఓపీఎస్ (OPS), సీపీఎస్ (CPS) పెన్షన్ విధానాల్లో ఉద్యోగులకు న్యాయం చేయాలని, టైమ్ స్కేల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈపీఎఫ్/ఈపీఎస్ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

డాక్టర్ వరంగల్ రవి (టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్): ఉద్యోగుల సమస్యలను వీసీ వెంటనే పరిష్కరించాలని, వర్సిటీ స్థాయిలో కాకపోతే తానే స్వయంగా జేఏసీ నేతలను సీఎం, డిప్యూటీ సీఎంల వద్దకు తీసుకెళ్లి సమావేశం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

డాక్టర్ పృథ్వీరాజ్ (తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు): ఏళ్లుగా వర్సిటీకి సేవలందిస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

విద్యార్థి, ఉద్యోగ సంఘాలు: ఎస్ఎఫ్ఐ (SFI), పీడీఎస్‌యూ (PDSU), ఏఎస్ఎఫ్ (ASF), ఏఐఎస్ఎఫ్ (AISF) విద్యార్థి సంఘాల నేతలు, టీఎన్జీవో (TNGO) నాయకులు, ఏయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జన్ ధర్నాలో పాల్గొని పూర్తి మద్దతు ప్రకటించారు.

Osmania University Non-Teaching Staff JAC Maha Dharna Successful All-Party Leaders Demand Immediate Regularization

న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: జేఏసీ నేతలు

మహా ధర్నాను విజయవంతం చేసిన ప్రతి ఉద్యోగికి, మద్దతు తెలిపిన రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలకు ఓయూ నాన్-టీచింగ్ స్టాఫ్ జేఏసీ చైర్మన్ డాక్టర్ కుమార్, అధ్యక్షులు ఖదీర్ ఖాన్ ఇతర జేఏసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల ఐక్యతే తమ బలమని, న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమిష్టి పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement