త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Land Resurvey | భూ రీసర్వేలో మరో మైలురాయి..

Land Resurvey | రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు వెయ్యి గ్రామాల్లో సర్వే ప్రక్రియ ప్రారంభం కాగా.. 416 గ్రామాల్లో పూర్తయింది. తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

P

Telangana | Published On Nov 10, 2026, 6.14 pm IST

Land Resurvey | భూ రీసర్వేలో మరో మైలురాయి..
Advertisement
  • వెయ్యి గ్రామాలు దాటిన ప్రక్రియ
  •  భూ యజమానుల హక్కులు, హద్దులకే పెద్దపీట..
  • చిన్న పొరపాటుకూ తావివ్వొద్దు
  • రెవెన్యూ రికార్డుల ఆధారంగానే సర్వే చేపట్టాలి..
  • అనంతరం నోటీసులిచ్చి అభ్యంతరాలు స్వీకరించాలి
  • రైతులకు అవగాహన కల్పించాలి..
  • భూదార్‌ కేటాయింపులు వేగవంతం చేయాలి
  • అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు

Land Resurvey | రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు వెయ్యి గ్రామాల్లో సర్వే ప్రక్రియ ప్రారంభం కాగా.. 416 గ్రామాల్లో పూర్తయింది. తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రీసర్వేలో భూ యజమానుల ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన హద్దులు కల్పించేలా పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించాలని సూచించారు.

125 ఏళ్ల తర్వాత సమగ్ర సర్వే

సుమారు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. తొలి దశలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున 2,720 గ్రామాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఇందులో నక్షాలు అందుబాటులో లేని గ్రామాలనూ చేర్చారు. ఇప్పటివరకు వెయ్యి గ్రామాల్లో రీసర్వే మైలురాయిని దాటగా.. 416 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయిందని వివరించారు. సర్వే ప్రారంభించే ముందు సంబంధిత గ్రామాల రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. భూముల విస్తీర్ణం, యాజమాన్య హక్కులు, సరిహద్దులకు సంబంధించిన వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలన్నారు. సర్వే పూర్తయ్యాక భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని, నమోదైన వివరాలను పరిశీలించుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. అభ్యంతరాలు ఉంటే స్వీకరించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు.

చిన్న చిన్న త‌ప్పుల‌తోనే భూ వివాదాలు..

సర్వేలో జరిగే చిన్న తప్పిదం కూడా భవిష్యత్తులో పెద్ద భూ వివాదానికి కారణమయ్యే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో లోపాలు గుర్తిస్తే వెంటనే సరిదిద్దాలని, కచ్చితత్వం విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సర్వే విధానం, నోటీసుల జారీ, అభ్యంతరాల నమోదు, పరిష్కార ప్రక్రియపై గ్రామస్థాయిలో రైతులు, భూ యజమానులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వారి అభిప్రాయాలు, సూచనలకు ప్రాధాన్యతనిస్తూ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి భూమికి ఆధార్‌ తరహాలో ప్రత్యేక గుర్తింపునిచ్చే భూదార్‌ నంబర్ల కేటాయింపును వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. భూముల హక్కులు, విస్తీర్ణం, సరిహద్దులకు సంబంధించిన కచ్చితమైన రికార్డులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. భవిష్యత్తులో కొత్తగా భూ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రేపు కలెక్టర్లతో సమీక్ష

భూ రీసర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సర్వేలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. జిల్లా వారీగా పురోగతిని సమీక్షించి తదుపరి కార్యాచరణపై ఆదేశాలు ఇవ్వనున్నారు. మంగళవారం సచివాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి క్షేత్రస్థాయి సిబ్బందితోనూ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్‌ కుమార్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, జాయింట్‌ డైరెక్టర్‌ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement