Numaish 2026 | హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 2026 జనవరి 1వ తేదీ నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగే ఈ నుమాయిష్‌కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. స్టాల్స్ కూడా సిద్ధమవుతున్నాయి. ఈ 45 రోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం 4 గంంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు, శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటల వరకు స్టాల్స్ తెరిచి ఉంటాయి. ప్రతి ఏడాది నుమాయిష్‌లో స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. గతేడాది పరిశీలిస్తే దాదాపు 3 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈసారి కూడా అదేస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఇక నుమాయిష్‌లో ప్రధానంగా వస్త్రాలు, కళాత్మక వస్తువులు, హ్యాండ్ క్రాఫ్ట్స్, ఫుడ్, పిల్లల ప్లే థీమ్స్, డ్రైఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన స్టాల్స్ కనిపిస్తాయి. స్వీట్లు, చాట్, హాలీమ్‌కు సంబంధించి ప్రత్యేక స్టాల్స్ ఉంటాయి. పిస్తా హౌస్, షాగౌస్ వంటి పేరొందిన సంస్థలు హలీమ్‌తో పాటు బిర్యానీని అందిస్తాయి. ఈ 45 రోజుల్లో మహిళలకు, చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. నుమాయిష్‌కు వచ్చే సందర్శకులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలతో ఎప్పటికప్పుడు నిఘా పర్యవేక్షిస్తుంటారు. ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ.. ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తమ ఉత్పత్తుల్ని అమ్ముతారు. మరి ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు తమ ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. అందువల్ల వేర్వేరు రాష్ట్రాల ప్రత్యేక వస్తువుల్ని, వస్త్రాల్ని నుమాయిష్‌లో కొనేయవచ్చు.