త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maxivision Hospital Case | టెస్టుల కోసం వెళ్తే సర్జరీ చేసినట్లు చూపించి క్లెయిమ్ కొట్టేసిన హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రి

టెస్టుల కోసం వెళ్తే సర్జరీ చేసినట్లు చూపి క్లెయిమ్ కొట్టేశారు! హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రి మోసంపై కేసు నమోదు.

J

Hyderabad | Published On Oct 1, 2026, 3.46 pm IST

Maxivision Hospital Case | టెస్టుల కోసం వెళ్తే సర్జరీ చేసినట్లు చూపించి క్లెయిమ్ కొట్టేసిన హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రి

సంక్షిప్త సారాంశం

కంటి చెకప్ కోసం వెళ్లిన ఓ వ్యక్తి పేరుతో రూ.40,000 ఇన్సూరెన్స్ క్లెయిమ్ డ్రా చేశారు. సర్జరీ చేయించుకోకుండానే డిశ్చార్జ్, బిల్లింగ్ ఫేక్ రికార్డులు సృష్టించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. వేరే చోట ఆపరేషన్ కోసం కంపెనీని సంప్రదించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో సోమాజిగూడ మ్యాక్స్ విజన్ ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
  • సర్జరీ చేయలేదు
  • కానీ రూ.40 వేలు స్వాహా
  • హైదరాబాద్ ప్రముఖ కంటి ఆస్పత్రిపై కేసు

Maxivision Hospital Case | త్రినేత్ర న్యూస్ : కంటి పరీక్షల కోసం వెళ్తే.. ఏకంగా ఆపరేషన్ చేసేశామని చెప్పి లక్షల్లో కాకపోయినా వేలల్లో ఇన్సూరెన్స్ డ్రా చేసుకున్న వింత మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. బాధితుడికి తెలియకుండానే నకిలీ రికార్డులు సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న సోమాజిగూడలోని ప్రముఖ కంటి దవాఖాన 'మ్యాక్స్ విజన్' (Maxivision Hospital) పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది?

బీకే గూడకు చెందిన వ్యాపారవేత్త కుమార్ గుంపుల్ల (51) జూన్ 26న కంటి సమస్య రావడంతో సోమాజిగూడలోని మ్యాక్స్ విజన్ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు ఆయన్ను పరీక్షించి, కుడి కంటికి క్యాటరాక్ట్ (శుక్లం) ఆపరేషన్ చేయాలని సూచించారు.

ఈ క్రమంలో హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందో లేదో సరిచూసేందుకు (Eligibility Check) ఆస్పత్రి సిబ్బంది ఆయన దగ్గర ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ వివరాలు, ఇతర డాక్యుమెంట్లు తీసుకున్నారు. పాలసీ కింద దాదాపు రూ. 40,000 వరకు కవర్ అవుతుందని చెప్పారు.

సర్జరీ చేయించుకోకుండానే ఇంటికి..

సర్జరీ చేయించుకోవాలో లేదో ఆలోచించుకుని మళ్లీ వస్తానని చెప్పి కుమార్ అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వలేదు, ఎలాంటి ఆపరేషన్ గానీ చికిత్స గానీ చేయించుకోలేదు.

మరో ఆస్పత్రికి వెళ్లడంతో బయటపడ్డ బాగోతం

సెప్టెంబర్ 28న ఆయన వేరే ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకోవాలని భావించారు. పాలసీ వివరాలు తెలుసుకునేందుకు ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించగా అసలు విషయం తెలిసి ఆయన నివ్వెరపోయారు.

మ్యాక్స్ విజన్ ఆస్పత్రిలో ఆయనకు సర్జరీ జరిగిపోయినట్లు, ఇప్పటికే రూ. 40,000 ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా సెటిల్ అయినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఫేక్ బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీలు

క్లెయిమ్ రికార్డులను పరిశీలించగా జూన్ 29న డిశ్చార్జ్ రిక్వెస్ట్, ఆ తర్వాత బిల్లింగ్ పూర్తయి ఆగస్టు 1న క్లెయిమ్ అమౌంట్ విడుదలైనట్లు తేలింది.

ఎలిజిబిలిటీ చెక్ కోసం ఇచ్చిన తన వ్యక్తిగత, పాలసీ డేటాను ఉపయోగించి.. తప్పుడు మెడికల్ రిపోర్టులు, నకిలీ డిశ్చార్జ్ పత్రాలు సృష్టించి డబ్బులు కాజేశారని కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement