త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR Defamation Case | కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేయొద్దు.. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లపై కోర్టు సీరియస్

కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర నిషేధాజ్ఞలు జారీ చేసింది.

J

Hyderabad | Published On Oct 28, 2026, 7.26 pm IST

KTR Defamation Case | కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేయొద్దు.. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లపై కోర్టు సీరియస్
Advertisement
  • కేటీఆర్ దాఖలు చేసిన రూ.10 కోట్ల పరువు నష్టం దావాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లకు కోర్టు ఆదేశాలు
  • డ్రగ్స్, వ్యక్తిగత సంబంధాలపై నిరాధార వ్యాఖ్యలు చేయరాదని, భవిష్యత్తులో తప్పుడు ఆరోపణలు వ్యాప్తి చేయవద్దని హెచ్చరిక
  • వివాదాస్పద ఇంటర్వ్యూలు, వీడియోలు, వార్తా కథనాలను తక్షణమే తొలగించాలని సంబంధిత మీడియా సంస్థలకు న్యాయస్థానం స్పష్టీకరణ
  • కేటీఆర్ తరఫున బలమైన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పి. విశ్వజనని

KTR Defamation Case | త్రినేత్ర న్యూస్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు, నిరాధార ఆరోపణలు చేయరాదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు (Interim Injunction) జారీ చేసింది. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొంటూ కేటీఆర్ దాఖలు చేసిన రూ.10 కోట్ల పరువు నష్టం దావా విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది.

నిరాధార వ్యాఖ్యలపై కోర్టు ఆంక్షలు

కేటీఆర్ లక్ష్యంగా డ్రగ్స్ వినియోగాన్ని ఆపాదించడం, డ్రగ్ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడం, సినీ ప్రముఖులు, మహిళలతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయంటూ నిరాధార వ్యాఖ్యలు చేయడాన్ని కేటీఆర్ తన పిటిషన్‌లో సవాలు చేశారు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు, ధ్రువీకరణ లేకుండా రాజకీయ లబ్ధి కోసం ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్‌ల ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తూ తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది పి.విశ్వజనని హాజరై బుధవారం న్యాయస్థానంలో పక్కా ఆధారాలతో వాదనలు వినిపించారు.

ఆ వీడియోలు, కథనాలు వెంటనే తొలగించాలి: మీడియా సంస్థలకు ఆదేశం

వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఎమ్మెల్సీలు ఇద్దరూ భవిష్యత్తులో ఈ అంశాలపై కేటీఆర్‌ను ఉద్దేశించి ఎలాంటి ఆరోపణలు చేయరాదని స్పష్టం చేసింది. దాంతో పాటు అభ్యంతరకర ఆరోపణలతో ఇప్పటికే ప్రచురించిన, ప్రసారం చేసిన వీడియోలు, వార్తా కథనాలను తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వెంటనే తొలగించాలని ఏబీఎన్ తెలుగు, మన తొలివెలుగు టీవీ, వాహిని టీవీ తదితర మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. భవిష్యత్తులోనూ ఇటువంటి అవాస్తవ కంటెంట్‌ను ప్రసారం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

తన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠను దిగజార్చే కుట్రలను అడ్డుకోవడంతో పాటు, జరిగిన నష్టానికి పరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని, తప్పుడు ప్రచారాలపై శాశ్వత నిషేధాజ్ఞలు విధించాలని కేటీఆర్ ఈ సివిల్ దావా వేశారు. కోర్టు ఇచ్చిన ఈ తాజా ఆదేశాలు ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు, ఆధారాల్లేని ఆరోపణలు చేసే వారికి గట్టి హెచ్చరికగా మారాయి.

Advertisement
Advertisement