త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Police Digital Initiatives | 15 సెకన్లలో నేరగాళ్ల గుర్తింపు: తెలంగాణ పోలీసుల సరికొత్త అస్త్రాలు

తెలంగాణ పోలీసు శాఖలో సరికొత్త టెక్ విప్లవం మొదలైంది. కేవలం 15 సెకన్లలో ఫేస్ రికగ్నిషన్, విడుదలైన ఖైదీలపై నిఘా సహా 7 డిజిటల్ సేవలను డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.

J

Telangana | Published On Oct 28, 2026, 6.49 pm IST

Telangana Police Digital Initiatives | 15 సెకన్లలో నేరగాళ్ల గుర్తింపు: తెలంగాణ పోలీసుల సరికొత్త అస్త్రాలు

సంక్షిప్త సారాంశం

తెలంగాణ సీఐడీ రూపొందించిన 7 అత్యాధునిక డిజిటల్ అప్లికేషన్లు, సేవలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్. 9.8 లక్షల రికార్డులతో కేవలం 15 సెకన్లలో నేరస్థులను పట్టించే మొబైల్ ఫేస్ సెర్చ్, దేశంలోనే తొలిసారిగా ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా ఫింగర్‌ప్రింట్ సేకరణ యాప్. జైలు నుంచి బయటకు వచ్చే ఖైదీల సమాచారాన్ని సీసీటీఎన్‌ఎస్‌కు అనుసంధానించే జేఆర్‌ఎంఎస్ (JRMS) వ్యవస్థ ఏర్పాటు. ప్రజల ఫీడ్‌బ్యాక్ కోసం కాల్ సెంటర్, రాష్ట్రంలోని 35 భరోసా కేంద్రాల పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ప్రారంభం.

Advertisement
  • నేరగాళ్లకు చెక్ పెట్టేలా హైటెక్ నిఘా
  • తెలంగాణ సీఐడీలో ఏడు సరికొత్త డిజిటల్ సేవలు ప్రారంభం

Telangana Police Digital Initiatives | త్రినేత్ర న్యూస్ : నేర పరిశోధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ తెలంగాణ పోలీస్ శాఖ మరో భారీ ముందడుగు వేసింది. పోలీసింగ్ సేవల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తూనే, నిందితులను వేగంగా పట్టుకునేందుకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) రూపొందించిన ఏడు సరికొత్త డిజిటల్ టెక్నాలజీలను డీజీపీ సీవీ ఆనంద్ డీజీపీ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల విభాగం డీజీ మహేష్ భగవత్, సీఐడీ డీజీ చారు సిన్హా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Telangana Police Launch 7 Digital Initiatives AI Apps to Track Criminals in 15 Seconds

15 సెకన్లలో నిందితుల గుర్తింపు.. స్మార్ట్‌ఫోన్‌తోనే వేలిముద్రలు

నేర పరిశోధనలో అత్యంత కీలకమైన ఆధారాల సేకరణ కోసం రెండు ప్రత్యేక మొబైల్ యాప్‌లను అందుబాటులోకి తెచ్చారు.

మొబైల్ ఫేస్ సెర్చ్ యాప్: దాదాపు 9.8 లక్షలకు పైగా ఫొటోల డేటాబేస్‌తో రూపొందించిన ఈ యాప్ ద్వారా కేవలం 15 సెకన్లలో ముఖాలను సరిపోల్చవచ్చు. గుర్తుతెలియని మృతదేహాలు, అదృశ్యమైన వ్యక్తులు, పాత నేరస్థుల గుర్తింపు నిమిషాల్లో పూర్తవుతుంది.

క్రైమ్ సీన్ ఛాన్స్ ప్రింట్ యాప్: నేరం జరిగిన ప్రదేశంలో లభించే వేలిముద్రలను సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారానే సేకరించి నేరుగా స్టేట్ సర్వర్‌కు పంపవచ్చు. అక్కడ ఆటోమేటిక్‌గా మ్యాచ్ కావడం ద్వారా అనుమానితులను వెనువెంటనే గుర్తించవచ్చు. దేశంలోనే మొదటిసారిగా ఈ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం విశేషం.

జైలు నుంచి బయటకు రాగానే పోలీసులకు అలర్ట్: జేఆర్‌ఎంఎస్ (JRMS)

జైళ్ల నుంచి విడుదలయ్యే నిందితులు, పాత నేరస్థులపై నిరంతర నిఘా కోసం ‘జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్’ (JRMS) అందుబాటులోకి తెచ్చారు. ఎన్‌ఐసీకి చెందిన ‘ఈ-ప్రిజన్స్’ వ్యవస్థను ‘సీసీటీఎన్‌ఎస్’ (CCTNS)తో అనుసంధానించారు. ఖైదీ జైలు నుంచి విడుదల కాగానే సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్ అధికారులకు వెంటనే ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం వెళ్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తూ నేరస్థుల నెట్‌వర్క్‌లను పసిగట్టేందుకు ఉపయోగపడుతుంది.

బాధితులకు 'భరోసా'.. ప్రజల అభిప్రాయాలకు ప్రత్యేక కేంద్రం

మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్రంలో పనిచేస్తున్న 35 భరోసా కేంద్రాలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చారు. బాధితులకు ఇచ్చే లీగల్, మెడికల్, కౌన్సెలింగ్ వివరాలను కేస్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు 23 రకాల రిపోర్టులతో డ్యాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షించవచ్చు.

అలాగే ఎఫ్‌ఐఆర్‌లు, పిటిషన్లు, ఈ-చలాన్లు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సేవలపై ప్రజల నేరుగా స్పందించేందుకు 'సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్' (CFC)ను ఏర్పాటు చేశారు. ప్రజలకు నేర సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా సీఐడీ వెబ్‌సైట్‌తో (https://cid.tspolice.gov.in/) పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు మార్గదర్శకంగా 5 సంపుటాల ప్రామాణిక కార్యాచరణ విధానాలను (SOPs) విడుదల చేశారు. ఈ టెక్నాలజీ వ్యవస్థలతో కోర్టుల్లో నేర నిరూపణ శాతం మరింత పెరుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement